గెలిచేది కూటమి… వైసీపీ ఓటమి తథ్యం

వైసీపీ

• ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతికే కూటమి నిర్ణయం తీసుకున్నాం
• కూటమి ప్రభుత్వంలో ఇప్పుడున్న ఏ పథకం ఆగిపోదు
• కల్తీ మద్యం దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి
• రైతుల ముఖంపై చిరునవ్వు తెచ్చేలా పాలన ఉంటుంది
• ఉమ్మడి తూర్పు గోదావరిపై మిథున్ రెడ్డి ఆధిపత్యం ఏమిటి?
• జగన్ సింహం… సింగిల్ గా వస్తాడు అని వైసీపీ అంటోంది- వృద్ధాప్యంలోకి వచ్చిన సింహమే సింగల్ గా చేవలేక చస్తుంది
• పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్
‘రాష్ట్ర ప్రజలకు ఉచిత పథకాలు కాదు… ఉపాధి చూపించే కూటమి ప్రభుత్వం రావాలి. యువతను జాబ్ క్యాలెండర్లు పేరుతో మోసం చేసే మాటలు కాదు.. నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది, ఉపాధి భరోసానిచ్చే కూటమి పాలన రావాలి.. మహిళలపై అత్యాచారం జరిగితే అలాంటివి సాధారణం అని వెటకారంగా మాట్లాడే పాలకులొద్దు… మహిళలకు సంపూర్ణ భరోసానిచ్చే కూటమి సర్కారు రావాల’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మెరుగైన, ఉన్నతమైన పాలన తీసుకురావాలనే సంకల్పాన్ని ఇప్పటికే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, నేను తీసుకున్నాం. ప్రజలు కూడా వారి బంగారు భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం వచ్చే ఎన్నికల్లో కూటమికి అండగా నిలబడాలనే సంకల్పాన్ని తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజల చేతుల్లోనే ప్రజల భవిష్యత్తు ఉంది.. రాష్ట్ర ఉన్నతి ఉంది అని చెబుతూ కూటమిని గెలిపించి, దాష్టీకాలకు చిరునామా అయిన వైసీపీని ఇంటికి పంపాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం పెద్దాపురం నియోజకవర్గం, సామర్లకోటలో జరిగిన వారాహి విజయభేరీ సభలో ఆయన ప్రసంగించారు. పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ లోక్ సభ నుంచి పోటీ చేసున్న శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ లను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాజకీయాల్లో సైద్ధాంతిక విబేధాలు ఉంటాయి. పాలసీల పరంగానూ విబేధాలు ఉండొచ్చు. కాని వ్యక్తిగత కక్షలు తీర్చకోవడానికి రాజకీయాలు ఉపయోగపడకూడదు. జగన్ తన కక్ష తీర్చుకోవడానికి అన్యాయంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు గారిని జైళ్లో పెడితే, నాలుగు దశాబ్దాలపాటు పార్టీని నడిపిన ఆయన కష్టాన్ని అర్ధం చేసుకొని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలను అర్ధం చేసుకొని ఆ రోజు వారికి మద్దతుగా నిలిచాం. ఆ కలయిక ఇప్పుడు మూడు పార్టీల కూటమిగా మారింది. రాబోయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళుతోంది. రాష్ట్రంలోని ఆడపడుచులు ఈ వైసీపీ ప్రభుత్వంపై పిడికిలి బిగించాలి. వైసీపీ చేసిన రాక్షస పాలనను ఆడబిడ్డలు గుర్తు తెచ్చుకోవాలి. బయటకు రండి.. చేయి ఎత్తండి. వైసీపీని నేలమట్టం చేసేద్దాం. పార్టీ నడపలేరు అన్న మాటల నుంచి పుట్టిన కసి, కోపం నుంచి దశాబ్ద కాలంగా నన్ను పార్టీ నడిపేలా చేసింది. జనసేనకు ఉన్నది జనబలం.. జనసైనికుల బలం. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును నిలబెట్టే దిశగా జనసేన ముందుకు వెళ్తుంది.
• రైతు కన్నీరు లేని పాలన తీసుకొస్తాం
నదులు అనుసంధానం చేసి రైతులకు మంచి జరిగేలా చూడాలన్నదే కేంద్రం ఆకాంక్ష. దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లి చివరి ఎకరాకూ నీరు అందేలా చూడాలన్నది నా కల. కాలువల్లో పూడికలు తీసేలా, డ్రైనేజీల పారుదల సక్రమంగా సాగేలా చేస్తాం. రైతు కన్నీరు పెట్టని రాజ్యాన్ని తీసుకొస్తాం. వైసీపీ పాలనలో పది మందికి అన్నం పెట్టే అన్నపూర్ణ బిడ్డలైన రైతులు ఏడుస్తున్నారు. గిట్టుబాటు ధర లేదు. సాగు భారమైంది. రానురాను పెట్టుబడులు పెరుగుతున్నాయి. సరైన ధర లేదు. కనీసం పంట అమ్ముకున్నా డబ్బులు సకాలంలో ఇవ్వడం లేదు. ప్రభుత్వం పెట్టిన పనికిమాలిన రైతు భరోసా కేంద్రాల్లో ఏ పని రైతుకు జరగడం లేదు. ఇలా ఎటు చూసినా వారి బాధలు నన్ను కదిలిస్తున్నాయి. ఏమైనా అడిగితే కేసులు పెడుతున్నారు. వైసీపీ గుండాలను పంపి కొడుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాటను రైతులపై వాడుతున్నారు. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు.
• ఇప్పుడున్న ఏ ఒక్క పథకం ఆగిపోదు.. నాదీ హామీ
వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు అమలు అవుతున్న ఏ సంక్షేమ పథకం కూటమి ప్రభుత్వంలో ఆగిపోదు. నేను దీనిపై హామీ ఇస్తున్నా. వ్యక్తిగతంగా ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి మాటను అమలు అయ్యేలా చూస్తాం. దీనిపై వ్యక్తిగత బాధ్యత తీసుకుంటాను. వైసీపీ పాలనలో దాష్టికాలు తారస్థాయికి చేరాయి. సామర్లకోట మండలం, పి. వేమవరం గ్రామంలో మేడిది నాగబాబు అనే డిగ్రీ పూర్తి చేసిన యువకుడు వైసీపీ అక్రమాల మీద సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే అతడిపై హత్యాయత్నం కేసు పెట్టారు. కాకినాడ రూరల్ పరిధిలో కిరణ్ చౌదరి అనే డాక్టరుని పాలకులు వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో మారాలి. మనమంతా అనుకుంటే మారుతుంది. కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలకు తగిన ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి వైసీపీ గూoడాను మోకాళ్ల మీద నడిపించే పరిస్థితి తీసుకొస్తాం. ప్రజలు నిర్బయంగా బతికేలా చూస్తాం.
• ఆరోగ్య శ్రీ బిల్లులు ఇవ్వరు… పేదల బతుకులకు భరోసా లేదు
వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1200 కోట్లు పెండింగ్ లో ఉంది. దీనిపై ఆస్పత్రుల యాజమాన్యాలు అడిగి అడిగి వేశారిపోయాయి. సర్జికల్ ఆంకాలజీ కేసులు 6 వేలు పెండింగ్ లో ఉన్నాయి. 60 వేల కే షీట్లు పెండింగ్ లో ఉన్నాయి. 2019 నుంచి 2021 వరకు 17.16 లక్షల అప్లికేషన్లు ఆరోగ్య శ్రీ కింద వస్తే, 9.24 లక్షల క్లయిమ్స్ ఇప్పటికీ క్లియర్ చేయలేదు. వారికి బిల్లులు ఇవ్వడం లేదు. ఆరోగ్య శ్రీ బిల్లులు ఇవ్వాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు మూడుసార్లు సమ్మెకు పిలుపు ఇచ్చారంటే ఆరోగ్య శ్రీ అమలు తీరును అర్ధం చేసుకోవచ్చు. చాలా ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీని ఒప్పుకోవడం లేదు. డబ్బులు కట్టాలని పేదలను అడుగుతున్నారు. మరి పేదలకు ఆరోగ్య భరోసా ఇచ్చే దారి ఏదీ..? ప్రజల పన్నుల నుంచి కట్టే డబ్బు ఎక్కడికి వెళ్తుంది..? అసలు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు…? దీనిపై సర్కారు సమాధానం చెప్పాలి.
• రాష్ట్రంలో కల్తీ మద్యం మరణాలు అధికం
రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రభావంతో ప్యాంక్రియాస్, కిడ్నీ వ్యాధుల మరణాలు అధికం అయ్యాయి. వైసీపీ పాలకుడు మాత్రం ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ రూ.41 వేల కోట్ల సంపాదించాడు. ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి దండుకున్నాడు. ప్యాంక్రియాస్, కిడ్నీ, లివర్ వ్యాధులతో ఆంధ్రప్రదేశ్ లో మరణాలు బాగా పెరిగాయని వైద్య నివేదికలు చెబుతున్నాయి. మద్యం విపరీతంగా కల్తీ కావడం వల్ల దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి వస్తోంది. పాలకులు మాత్రం కల్తీ మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల్లో బహిరంగంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మద్యం ఆర్డర్లలో 74 శాతం సంపద రెండు కంపెనీల వద్దనే ఉంది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెందిన స్పైఆగ్రోస్, అదాన్ డిస్టలరీస్ కే మద్యం ఆర్డర్లు ఇచ్చారు. ప్రజల డబ్బు ఎక్కడికి వెళ్తుందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ప్రజాధనాన్ని ఇలా మద్యం ద్వారా మింగి, ప్రజా ఖజానా నుంచి రూ.1300 కోట్లు వైసీపీ రంగులు వేసుకునేందుకు వెచ్చించారు. కోర్టులు మొట్టికాయలు వేయడంతో రంగులు తొలగించడానికి మరో రూ.1000 కోట్లు దుర్వినియోగం చేశారు. ఇవన్నీ చూస్తే బాధేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పచ్చగా ఉండాలన్నది కల. రైతు ఏడవకూడదన్నది నా ఆశయం.. యువత చిరునవ్వుతో బతకాలన్నది నా ఆకాంక్ష.. ఆడబిడ్డలు ఆర్థిక శక్తులుగా మారాలన్నది నా అభిలాష.
• ముసలి సింహమే సింగిల్ గా వస్తుంది
మాట్లాడితే వైఎస్ జగన్ నేను సింహం. సింగిల్ గా వస్తాను అంటాడు. సింహం ఎప్పుడూ వేటాడదు. వేటాడేలా తన సైన్యాన్ని పంపుతుంది. శివంగులు వేటాడుతాయి. ఇక జీవితం అయిపోయిన క్రమంలో, ముసలి వయసులో తన మాట ఎవరూ వినని సమయంలోనే సింహం ఒంటరి అయిపోతుంది. చేవలేక చస్తుంది. అది తెలుసుకోవాలి. అయినా ఇదేమీ జంతు ప్రపంచం కాదు.. మనుషుల ప్రపంచం. ఇది ఆంధ్రప్రదేశ్ నేల. ఈ అందమైన నేలలోకి ద్వారంపూడి లాంటి వారే కాదు.. ఏ రౌడీ వచ్చినా పోరాడుతా. ప్రజలకు అండగా నిలుస్తాం. అన్నం పెట్టే రైతుకు భుజం కాస్తాను. మహిళలకు భద్రత, యువతకు ఉపాధి భరోసా ఇచ్చే పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ పండ్లు ఇచ్చే చెట్టు లాంటి వాడు. మీకు నేను ఇచ్చే పండు తిని ఆనందిస్తే.. మీ కళ్లలో ఆనందం చూసి ఉప్పొంగిపోయే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగింది. దళితులపై దాడులు, హత్యలు జరిగాయి. గొంతు ఎత్తితే కేసులు పెట్టారు. పెద్దాపురం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్, ఇసుక, మట్టిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దవులూరి దొరబాబు కనుసన్నల్లో అమ్ముకున్నారు. ప్రకృతి సంపదను దోచు కుంటున్న వారిని వదిలిపెట్టం. రామేశ్వరం మెట్టలో 600 ఎకరాల్లో మైనింగ్ చేసి మింగేసిన వారికి తగిన బుద్ది చెబుతాం. నివాసయోగ్యం స్థలాలను సెంటు భూమి స్కాంలో భారీగా మింగేశారు. పెద్దాపురం నియోజకవర్గంలో 55 ఎకరాల్లో 20,040 మందికి ఇంటి పట్టాలు ఇస్తే, కేవలం 1019 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. కేవలం 5 శాతం మాత్రమే లబ్ధిదారులకు ఇళ్లు కట్టించారు. ప్రచారం యావ తప్ప వైసీపీ ప్రజలకు చేసిందేమీ లేదు. తూర్పు గోదావరి జిల్లాలో అడ్డు వచ్చిన ఎవరినీ ఈ మిథున్ రెడ్డి బతకనివ్వడు. తూర్పుగోదావరి లో ఏ మైనింగ్ తవ్వకాలు జరగాలన్నా, ఏ పని జరగాలి అన్నా మిథున్ రెడ్డికి చెప్పి జరగాలి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆధిపత్యం చూపించడానికి మిథున్ రెడ్డి ఎవరు..? తూర్పుగోదావరి జిల్లా నాయకులకు ఇక్కడి వనరులపై ఆధిపత్యం ఉండాలి. స్థానిక నాయకులకు అధికారం ఉండాలి. నేను అన్ని కులాలను సమానంగా చూస్తాను. అన్ని కులాలకు సొంత వ్యక్తిలా ఉంటాను. అయితే కాపు రిజర్వేషన్ల గురించి ఈ ముఖ్యమంత్రి గతంలో గట్టిగా చెప్పాడు. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని తన రాజకీయ లబ్ధికి చక్కగా వాడుకున్నాడు. ఎందరో అమాయకుల మీద కేసులు పెట్టించి ఇరికించాడు. చివర్లో మాత్రం కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు అని తెగేసి చెప్పాడు. ఇలాంటి వ్యక్తికి కాపులంతా గతంలో ఓటేశారు. దీనిపై కాపు నాయకులు ఆలోచించాలి. కాపు సామాజిక వర్గం, బీసీ, ఎస్సీలు ఆలోచించాలి. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని తేలికగా చెప్పిన వ్యక్తికి కాపు నాయకులు ఎలా నిలబడతారు..? దళితులను చంపి డోర్ డెలివరీలు చేసిన వ్యక్తికి మేం ఎందుకు నిలబడాలి అని దళిత సోదరులు ఆలోచించాలి. బీసీల సబ్ ప్లాన్ ను చంపేసిన వ్యక్తికి మేం ఎందుకు నిలబడాలి అని బీసీలు అడగాలి. వైఎస్ జగన్ చిరంజీవి గారిని ఇంటికి పిలిచి మరీ అవమానం చేశాడు. హీరో శ్రీ మహేష్ గారిని, శ్రీ ప్రభాస్ గారిని అవమానించాడు. ఆయన ముందు అంతా చేతులు కట్టుకోవాలి. అణిగిమణిగి ఉండాలి. జగన్ ఏమైనా దిగి వచ్చాడా..?
• పెద్దాపురం సమస్యలన్నీ ప్రాధాన్యత క్రమంలో తీరుస్తాం
కేంద్రం సహాయంతో నిర్మించిన టిడ్కో ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇళ్లన్నీ పాడయ్యేలా జగన్ కక్ష కట్టారు. ఇప్పుడు అన్నిచోట్లా టిడ్కో ఇళ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పెద్దాపురం నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్యలున్నాయి. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు ఇచ్చే జలజీవన్ మిషన్ పథకాన్ని జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించింది. గోదావరి నుంచి భారీ పైపులైను వేసి సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాలకు తాగునీరు ఇస్తామని చెప్పిన జగన్ తర్వాత దాన్ని పట్టించుకోలేదు. సామర్లకోట లో 120 ఏళ్ల చరిత్ర కలిగిన డెక్కన్ షుగర్ ఫాక్టరీని 3 ఏళ్ల క్రితం మూసేశారు. రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నాయి. కేంద్రం సహకారం ఇస్తున్నా, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గత నాలుగేళ్లగా రాష్ట్రంలో 90 వేల ఏకరాల్లో చెరకు పంట తగ్గిపోయింది. చెరకు రైతుకు ఇవ్వాల్సిన డబ్బులను వెంటనే ఇవ్వకుండా 6 నెలల నుంచి 8 నెలలు పెండింగ్ పెడుతున్నారు. కేంద్రం చెరకు రైతు కోసం ప్రొత్సహించినా, మద్దతు ధర చెరకు టన్నుకు రూ.1000 పెంచినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. పెండలం దుంప బాగా పండే ప్రాంతంలో సగ్గుబియ్యం పరిశ్రలమకు కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని సరిజేస్తాం. కమ్యూనిటీ హెల్త్ సెంటరును 100 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతాం. 2020లో కట్టమూరు కాండ్రోకోట, తూర్పుపాకాల ప్రజలకు ఎంతో అనువుగా ఉండే వంతెన కూలిపోతే పట్టించుకోలేదు. ఆ వంతెన నిర్మించే బాధ్యత తీసుకుంటాం. ఏలేరు ఆధునీకరణకు మాటిచ్చాం. అయిదు నియోజవకర్గాలకు ప్రధానమైన దాన్ని పూర్తి చేస్తాం. పామాయిల్ రైతులకు తగిన మద్దతు ధర వచ్చేలా చూస్తాం. మెట్ట గ్రామాలకు సురంపాలెం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి పుష్కర్ కాలువ ద్వారా నీరు అందించే బాధ్యత తీసుకుంటాం. ఉద్యాన పంటలకు తోడ్పాటు అందిస్తాం. ఏడీబీ రోడ్డును ఆరునెలల్లో పూర్తి చేస్తాం. 60 కిలోమీటర్ల కెనాల్ రోడ్డు అభివృద్ధి బాధ్యత తీసుకుంటాం. దశాబ్దకాలంగా పోరాటం చేస్తున్నాను తప్ప ఎప్పుడు విజయాన్ని చూడలేదు. ప్రజలంతా నిండు మనసుతో భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూటమిని గెలిపించoడి. నాకు విజయం రుచి చూపించండి. మీకు సేవకుడిలా పనిచేస్తాను. పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ నిమ్మకాయల చినరాజప్పకు సైకిల్ గుర్తుపై, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూటమి తరఫున పోటీ చేస్తున్న శ్రీ ఉదయ్ శ్రీనివాస్ కు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి, ఆశీర్వదించండి’’ అని కోరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్