• సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీ
• జనంతో కిక్కిరిసిన విశాలాంధ్ర, ఏలూరు రోడ్లు
• శ్రీ పవన్ కళ్యాణ్ రోడ్ షోతో కూటమి శ్రేణుల్లో జోష్
విజయవాడ నగర వీధుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వరుసగా రెండో రోజు కూటమి అభ్యర్ధులకు మద్దతుగా భారీ రోడ్ షో నిర్వహించారు. బుధవారం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గార్లతో కలసి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన, గురువారం విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో అశేష జనవాహిని మధ్య రోడ్ షో నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు లబ్బీపేట పశువుల ఆసుపత్రి కూడలి నుంచి ర్యాలీలో పాల్గొన్నారు. జనసేనాని రాక విషయం తెలుసుకున్న తూర్పు నియోజకవర్గ ప్రజలు బందరు రోడ్డుకు పెద్ద ఎత్తున చేరుకుని హారతులు పట్టారు. తూర్పు నియోజకవర్గంలో కూటమి మద్దతుతో టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన శ్రీ గద్దే రామ్మోహన్ రావు వెటర్నరీ ఆసుపత్రి వద్ద శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. తన కోసం వచ్చిన మూడు పార్టీల శ్రేణులకు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అక్కడి నుంచి శిఖామణి సర్కిల్, మోఘల్రాజపురం, విశాలాంధ్ర రోడ్డు, ఏలూరు రోడ్డు మీదుగా విజయా టాకీస్ సెంటర్ కి చేరుకున్నారు. దారి పొడవునా సుమారు 5 కిలోమీటర్ల మేర రహదారికి ఇరువైపులా ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కేరింతలతో స్వాగతించారు. పెద్ద సంఖ్యలో ఆడపడుచులు రోడ్ల మీదకు వచ్చి హారతులతో బారులు తీరారు. అభిమాన నాయకునిపై పూల జల్లులు కురిపించారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో టీడీపీ అభ్యర్ధి శ్రీ బొండా ఉమామహేశ్వరరావు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్వాగతించి ర్యాలీలో పాల్గొన్నారు. రహదారి మొత్తం జనంతో కిక్కిరిసిపోవడంతో అప్సర సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ మీదుగా ర్యాలీ సాగాల్సి ఉండగా, సమయాభావం కారణంగా రూటు కంట్రోల్ రూము వైపు మళ్లించారు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ సర్కిల్, వస్త్రలత మీదుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంజా సెంటర్ కి చేరుకున్నారు. రోడ్ షో ఆద్యంతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాహనం నుంచి లేచి నిలబడి ఆడపడుచుల నుంచి హారతులు స్వీకరిస్తూ, అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జనసేనాని రోడ్ షోతో రెండు నియోజకవర్గాల్లో రహదారులతో పాటు చుట్టు పక్కల భవనాలు కూడా జనంతో నిండిపోయాయి. వన్ టౌన్ లోని పంజా సెంటర్ కి వెళ్లే మార్గం మొత్తం మహిళలు రోడ్డు పక్కన భవనాల నుంచి పూల వర్షం కురిపించారు. వ్యాపారులు దుకాణ సముదాయాల నుంచి బయటకు వచ్చి మద్దతు తెలిపారు. ముస్లిం సోదర, సోదరీమణులు పెద్ద సంఖ్యలో సభకు హాజరు కావడం గమనార్హం. ప్రజలంతా స్వచ్ఛందంగా జనసేన, టీడీపీ, బీజేపీ జెండాలు ఊపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి విజయం కాంక్షిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రోడ్ షోతో విజయవాడ నగరంలో పార్టీ శ్రేణులు, ప్రజల నినాదాలతో దద్దరిల్లింది.