జనవాణి చెంతకు సమస్యల వెల్లువ

జనవాణి

• అధికార పార్టీ దాష్టీకాలపై ఫిర్యాదుల వెల్లువ
• వైసీపీ నేతల భూ కబ్జాలపైనే అత్యధిక ఫిర్యాదులు
• సమస్యలు చెప్పుకున్న కాలుష్యం, స్టీల్ ప్లాంట్ బాధితులు, మత్స్యకారులు
• ఏడున్నర గంటలపాటు నిలబడి 340కి పైగా అర్జీలు స్వీకరించిన శ్రీ పవన్ కళ్యాణ్
• బాధితులకు భరోసా ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్

            ఎటు చూసినా దోపిడీలు… దౌర్జన్యాలు.. దాష్టీకాలు.. కబ్జాలు.. అధికార పార్టీ నాయకుల అరాచకాలు.. ప్రతి సమస్య వెనకా కంటికి కనిపించని దోపిడీ.. ప్రతి కాగితం వెనకా కన్నీటి గాధలు.. ప్రతి అర్జీ వెనుకా బయటికి చెప్పుకోలేని అలజడులు.. మా ప్రభుత్వం అద్భుతాలు చేస్తోందని జబ్బలు చరుచుకుంటూ చెప్పుకొంటున్న వైసీపీ ప్రభుత్వం… అభివృద్దిని గాలికి వదిలేసి ప్రజల సొమ్మును తమ పార్టీ నేతలకు ఎలా దోచిపెడుతుందో.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ విధమైన అరాచకాలకు పాల్పడుతుందో విశాఖపట్నం వేదికగా నిర్వహించిన ‘జనవాణి – జనసేన భరోసా’ కార్యక్రమంలో కళ్లకు కట్టాయి.. సునామీలా వెల్లువెత్తిన అర్జీలు పేరుకుపోయిన సమస్యల చిట్టాకు తార్కాణంగా నిలిచాయి. గురువారం విశాఖ ప్రజల సమస్యలు తెలుసుకుని, అర్జీలు స్వీకరించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన జనవాణి – జనసేన భరోసా కార్యక్రమానికి వినతులు వెల్లువలా వచ్చిపడ్డాయి. వైసీపీ ప్రభుత్వం, నేతల దాష్టీకాలకు బలైన బాధితులు, అధికార పార్టీ భూ బకాసురుల కాటుకు విలవిలలాడిన సామాన్యులు, పింఛన్ ఎందుకు పోయిందో కూడా తెలుసుకోలేని దివ్యాంగులు, కాలుష్యపు కోరల్లో కొట్టుమిట్టాడుతున్న నిర్వాసితులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ఎల్జీ పాలిమర్స్ బాధితులు.. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చెంతకు ఉదయం నుంచి సాయంత్రం వరకు సమస్యల అర్జీలు వస్తూనే ఉన్నాయి. ఏడున్నర గంటల పాటు నిర్విరామంగా, నిలువుకాళ్లపై వచ్చిన ప్రతి అర్జీని స్వయంగా స్వీకరించారు. 340కి పైగా అర్జీలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చెంతకు వచ్చాయి. కోకొల్లలుగా వస్తున్న సమస్యలు తెలుసుకునేందుకు మరో రెండు మూడు రోజుల పాటు విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించినా పూర్తికావని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. ప్రతి సమస్యను ఓపిగా విన్న ఆయన అందరికీ జనసేన పార్టీ అండగా నిలబడుతుందన్న ధైర్యాన్ని ఇచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన ముఖ్యమైన సమస్యలను ఓ సారి తొంగిచూస్తే..
• మా భూములు ఎవరికో అమ్మేశాం అంటున్నారు : రాజుపేట, దాకమర్రి రైతులు
భీమిలి నియోజకవర్గం, భీమిలి మండలం, దాకమర్రి గ్రామాల రైతులం మేము. వందల ఏళ్లుగా మేము రైతులుగా ఉన్నాము. రేవడి రాజుల నుంచి మా తాతలు ఆ భూములు కొన్నారు. అందుకు సంబంధించిన పత్రాలు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు దాట్ల పెదబాబు మీ భూములు రూ.14 కోట్లకు అమ్మేశాను అంటున్నాడు. 450 ఎకరాలు, 600 కుటుంబాలు, 5 పంచాయితీల ప్రజలు ఈ భూముల మీద బతుకుతున్నాం. కోర్టుకు వెళ్లినా ఫలితం లేదు. అధికారుల మీద ఒత్తిడి తెచ్చి పని చేయనివ్వడం లేదు. మా సమస్యకు పరిష్కారం చూపితే వందల కుటుంబాల గుండెల్లో మీరు నిలిచిపోతారు.
నర్సిపట్నం నియోజకవర్గం, కొత్తఎర్రవరం పంచాయతీ, రాజుపేట గ్రామం పరిధిలో సాగు చేసుకుంటున్న మా భూములకు హక్కులు కల్పించడం లేదు. అధికారుల్ని అడిగితే అవి ఇనాం భూములు అంటున్నారు. 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం, పట్టాల కోసం పోరాడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఒక వ్యక్తిని తీసుకువచ్చి ఇనాందారుడు అతనికి వాటా ఇవ్వమన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే ఇనాందారుడి పేరిట మరో వ్యక్తిని తెరమీదకి తెచ్చి 50 శాతం వాటా అతనికిచ్చేస్తే పట్టాలు ఇచ్చేస్తామంటున్నారు. గ్రామ సభలు లేవు. అనుమతులు లేవు. సర్పంచు కి కూడా తెలియకుండా సర్వేలు చేయిస్తున్నారు. మా సమస్య పరిష్కారానికి సహకరించండి.
• మా స్కూలు మీద వైసీపీ నేతల కన్నుపడింది : శ్రీ శ్రీనివాస్, నిర్వాహకులు హిడెన్ స్పౌట్స్ స్కూలు
హిడెన్ స్పౌట్స్ స్కూల్ పేరిట మానసిన వైకల్యం కలిగిన 200 మంది పిల్లలకు 17 సంవత్సరాలుగా ఉచితంగా సేవలు చేస్తున్నాము. స్కూల్ నిర్వహణ నిమిత్తం పదేళ్ల క్రితం ఎంవీపీ కాలనీ, ఉషోదయ జంక్షన్ వద్ద 2 వేల చదరపు గజాలు జీవీఎంసీ నుంచి లీజుకు తీసుకున్నాం. ఆ స్థలం మీద స్థానిక వైసీపీ నాయకుడు అక్రమాని వెంకట్రావు కన్నుపడింది. లీజు గడువు ముగిసిందంటూ కరోనా సమయంలో ఉన్న పళంగా రోడ్డు మీదకు తోసేశారు. రోడ్డు మీదే చిన్న షెడ్డు వేసుకుని 120 మంది చిన్నారులను సాకుతున్నాం. పిల్లలకు ఫించన్లు కూడా తీసేశారు సర్.
• పట్టాలు ఇంట్లో ఉన్నాయి.. భూములు రిజిస్ట్రేషన్ అయిపోయాయి : అనంతగిరి భూ బాధితులు
అరకు నియోజకవర్గం, అనంతగిరిలో 220 ఎకరాల గిరిజనుల భూమిని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. పట్టాలు మా ఇంట్లోనే ఉన్నాయి. భూమి మాత్రం రిజిస్ట్రేషన్ అయిపోయింది. మాకు అండగా నిలవండి సర్.
• మా అమ్మాయి రెండేళ్లుగా కనబడడం లేదు : శ్రీ ఎన్. శ్రీనివాసరావు, అనకాపల్లి
రెండేళ్లుగా మా పాప కనబడడం లేదు. కాల్ ట్రేస్ చేస్తే పంచాయితీ సర్పంచు కొడుకుదని తేలింది. కారు ఇచ్ఛాపురంలో ట్రేస్ అయ్యింది. పోలీసుల స్పందన లేదని హైకోర్టులో రిట్ వేశాం. కేసు ఉపసంహరించుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారు. మీ పిల్ల ఎక్కడుందో మీకు తెలుసంటూ ఎదురు బుకాయిస్తున్నారు. మాకు న్యాయం చేయండి అంటూ అనకాపల్లి నియోజకవర్గం, కదనపేడి గ్రామానికి చెందిన శ్రీ నదిగడ్ల శ్రీనివాసరావు దంపతులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరారు.
• హైడ్రో పవర్ ప్రాజెక్టు మా గ్రామాలను ముంచేస్తుంది : పాడేరు పవర్ ప్రాజెక్టు నిర్వాసితులు
పాడేరు నియోజకవర్గం చింతపల్లి, కొయ్యూరు మండలాల పరిధిలోని రెండు పంచాయితీల పరిధిలో నిర్మిస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు కారణంగా 32 గ్రామాలు ముంపు భారిన పడతాయి. ముత్తాతల కాలం నుంచి అక్కడ జీవిస్తున్నాం. 3,240 మంది నిరాశ్రయులు అవుతాం. పంచాయితీ తీర్మానం, గ్రామ సభలు లేకుండా మా గ్రామాల నుంచి మమ్మల్ని వెళ్లిపోమంటే ఎక్కడికి పోవాలి. స్థానిక ఎమ్మెల్యేతో చెప్పినా పట్టించుకోవడం లేదు. మాకు న్యాయం చేయండి.
• మేము జీవచ్ఛవాల్లా మారిపోయాం : ఎల్జీ పాలిమర్స్ బాధితులు
ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి వచ్చి మీకు నేనున్నాను.. మీ ఆరోగ్యానికి నాది భరోసా అని చెప్పారు. చనిపోయిన వారికి రూ. కోటి ఇచ్చారు. చనిపోయిన వారితో పోలిస్తే బతికున్న మేము జీవచ్ఛవాల్లా బతుకుతున్నాం. ఆసుపత్రిలో చేరినవారికి తీవ్రత ఆధారంగా రూ. 25 వేల నుంచి రూ. 10 లక్షల వరకు సాయం చేస్తానన్నారు. మా వెంకటాపురం గ్రామంలో 191 మందికి ఇప్పటికీ పరిహారం అందలేదు. గ్యాస్ తీవ్రతతో అవయవాలు పాడై నానా ఇబ్బందులు పడుతున్నాం. మా కోసం ప్రత్యేక ఆసుపత్రి కట్టిస్తానన్న హామీ నెరవేర్చలేదు. ఎల్జీ పాలిమర్స్ బాధితుల పేరు చెబితే స్పందనలోనూ ఫిర్యాదులు స్వీకరించడం లేదు.
• రూ. కోటితో నా కూతురు వస్తుందా : శ్రీమతి లత, ఎల్జీ పాలిమర్స్ బాధితురాలు
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మా పాప చనిపోయింది. ఆ ఆవేదనతో ఆందోళన చేపడితే నా మీద కేసు పెట్టారు. పోలీసులు నా మీద చెయ్యి చేసుకున్నారు. న్యాయం అడిగినందుకు కేసు పెట్టారు. మాట్లాడితే అధికార పార్టీ నాయకులు రూ. కోటి ఇచ్చాం అంటున్నారు. కోటితో నా కూతురు తిరిగి వస్తుందా అని ఎల్జీ పాలిమర్స్ బాధిత మహిళ శ్రీమతి లత వాపోయారు.
• తాడి గ్రామాన్ని తరలించాలి : గ్రామస్తులు
పరవాడ పారిశ్రామిక వాడ బాధితులం సర్. కాలుష్యపు కోరల్లో విలవిల్లాడుతున్న తాడి గ్రామ తరలింపు 18 ఏళ్లుగా పెండింగ్ లోనే ఉంది. మాకు సదుపాయాలు లేవు, ఉద్యోగాలు లేవు అని, తమ సమస్య పరిష్కారం శ్రీ పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమని నమ్మకంతో జనవాణికి వచ్చినట్టు తాడి గ్రామస్తులు తెలిపారు.
• మా భూమి రౌడీషీటర్ ఆక్రమించేశాడు : శ్రీ జె. శ్రీనివాసరావు
గాజువాక నియోజకవర్గం దువ్వాడ గ్రామంలో రజక సామాజిక వర్గానికి చెందిన నాకు 84 సెంట్ల భూమి ఉంది. ఆ భూమి అమ్మమంటూ స్థానికంగా ఉండే రౌడీ షీటర్ దేవల వెంకటరమణ బెదిరిస్తున్నాడు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని ఆక్రమించుకున్నాడు. దళిత యువతను అడ్డుపెట్టి అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఆక్రమించిన భూమికి గోడ కూడా కట్టేశారు. మాకు న్యాయం చేయండి.
• మత్స్యకారులకు భరోసా కరువు : మత్స్యకారులు
మత్స్యకారులు వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తానన్న ముఖ్యమంత్రి అందుకోసం జీవో. 15 కూడా జారీ చేశారు. ఒక్కరికీ పూర్తి పరిహారం ఇవ్వలేదు. కేంద్రం నుంచి వస్తున్న రూ. 5 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 70 మంది చనిపోతే, అధికారికంగా 14 మంది చనిపోయినట్టు చూపారు. 4 గురికి మాత్రమే సాయం చేశారు. అదీ పార్టీల ఆదారంగా చేస్తున్నారు. డీజిల్ సబ్సిడీ, వేట విరామ బరోసా విషయాల్లోనూ మోసం జరుగుతోంది. కాలుష్య వ్యర్ధాల దెబ్బ మా మీద పడుతోందని మత్స్యకారులు తమ సమస్యలు తెలియచేశారు.
• డంపింగ్ యార్డు తరలించాలి
గాజువాక డంపింగ్ యార్డు 16 గ్రామాల ప్రజల ఆరోగ్యాలు హరిస్తోంది. డంపింగ్ యార్డును సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రంగా మార్చడంతో వెదజల్లే దుర్వాసనతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో డంపింగ్ యార్డుని పార్కుగా మారుస్తానన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ నాగిరెడ్డి ఏకంగా యార్డు చుట్టూ ప్రహరీ కట్టించారని గాజువాక డంపింగ్ యార్డు బాధితులు వాపోయారు.
• కాకినాడకు చెందిన శ్రీమతి ఆరుద్ర తన కుమార్తె సాయిచంద్రకు మూడుసార్లు స్పైనల్ కార్డు ఆపరేషన్ అయ్యిందని, మరోసారి చెయ్యించాల్సిన పరిస్థితిలో ఇల్లు అమ్మకానికి పెడితే మంత్రి దాడిశెట్టి రాజా గన్ మెన్, మరో కానిస్టేబుల్ తమకే అమ్మాలని వేధిస్తున్నారని కన్నీరుపెట్టుకున్నారు. చివరికి పోలీసులు మమ్మల్ని పిచ్చాసుపత్రిలో చేర్చి చంపడానికి ప్రయత్నించారు అంటూ ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు.
• మాది సాలూరు నియోజకవర్గం, మక్కువ మండల పరిధిలోని పెద్దవలస గ్రామం. మా గ్రామానికి ఏడేళ్లుగా పాఠశాల భవనం లేదు. రెండేళ్ల క్రితం నాడు నేడు పేరిట రూ. 36 లక్షలు విడుదలైంది. కొంత డబ్బు కూడా పడిందన్నారు. అది పునాదులకే సరిపోయిందని గోతులు తీసి వదిలేశారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు అని బంగార్రాజు అనే గిరిపుత్రుడు అదే స్కూలులో చదువుతున్న తన ఇద్దరు చెల్లెళ్లతో కలసి వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అర్జీ సమర్పించాడు.
• యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మినిమం టైమ్ స్కేలు అమలు కోసం 2019 నుంచి మూడు జీవోలు వచ్చాయి. చివరిగా ఇచ్చిన జీవో 110తో మాకు ఉద్యోగ భద్రత పోయింది. మాకు మినిమం టైమ్ స్కేలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎన్నికల సమయంలో పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉద్యోగ భద్రత కూడా లేకుండా చేశారని, తమకు న్యాయం చేయాలని కాంట్రాక్టు అసిస్టెంటు ప్రొఫెసర్లు అర్జీ సమర్పించారు.
• ఆంధ్రా యూనివర్సిటీలో బోధనా సిబ్బంది కోరత తీవ్రంగా ఉందని, గెస్ట్ ప్యాకల్టీలు సైతం లేరని, ఎంట్రన్స్ టెస్ట్ కూడా లేకుండా నేరుగా పీహెచ్ డీ చేస్తున్న వారిని తీసుకువచ్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారన్న విషయాన్ని ఓ విద్యార్ధి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చాడు.
• పెందుర్తి మండలం, ముదపాక గ్రామ పంచాయితీ పరిధిలో జగనన్న కాలనీల కోసం భూమి సేకరించారు. అందులో సగం భూములు దళిత రైతులకి చెందినవి. పరిహారం చెల్లించే విషయంలో అధికార పార్టీ నాయకులు అవకతవకలకు పాల్పడుతున్నారు. జాబితా నుంచి రైతుల పేర్లు తొలగించి 137 ఎకరాలకు వైసీపీ వారి పేర్లు పెట్టుకున్నారు. వ్యతిరేకించిన రైతులపై కేసులు పెడుతున్నారు. కోర్టుకు వెళ్లినా ఫలితం లేదని ముదపాక గ్రామ రైతులు తమ సమస్యపై అర్జీ సమర్పించారు.
• ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు జరిగిన ప్రిలిమినరీ పరీక్షల్లో ఐదు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, రెండు మార్కుల తేడాతో సుమారు 50 వేల మంది దేహదారుడ్య పరీక్షకు దూరం అయ్యామని, ఈ వ్యవహారాన్ని వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేయాలని బాధిత నిరుద్యోగులు వినతిపత్రం సమర్పించారు.
• విశాఖ జిల్లా, పద్మనాభం మండలం, కోరాడకు చెందిన మరో రైతు తన భూమిని జగనన్న ఇళ్ల పథకానికి తీసుకుని రూపాయి కూడా ఇవ్వకుండా లాగేసుకున్నారని, కోర్టుకు వెళ్లినా, అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదని, ఎమ్మెల్యే అందర్నీ భయపెడుతున్నాడని శ్రీ కోరాడ సూర్యనారాయణ అనే రైతు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తన సమస్య తీసుకువచ్చారు.
• నా మనుమడిని చంపేసి రోడ్డు మీద పడేశారు. చంపేశారన్న ఆదారాలున్నా రెల్లి కులస్తులమని ఎవరూ పట్టించుకోవడం లేదు. పోలీసుల నుంచి స్పందన లేదు. పైగా రాజకీయ నాయకులు బెదిరిస్తున్నారు అని చోడవరం నియోజకవర్గానికి చెందిన శ్రీమతి సన్యాసమ్మ తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని జనసేనాని ముందుంచారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్