రాష్ట్రంలో వచ్చేది కూటమి ప్రభుత్వమే

రాష్ట్రం

• సంక్షేమం, అభివృద్ధి.. సమంగా ముందుకు తీసుకువెళ్తాం
• డ్యాన్సులు చేసేవాళ్లు… బూతులు తిట్టేవాళ్లు మన మంత్రులు
• ఇక్కడ దోచుకొని పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారు
• వైసీపీ నాయకుల అహాన్ని గోస్తని నదిలో కలిపేద్దాం
• పోలీసుల శ్రమశక్తిని దోచుకున్న జగనే పెద్ద పెత్తందారుడు
• అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు సీపీఎస్ రద్దుకు పరిష్కారం
• తణుకు ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
          ‘ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు, ప్రఖ్యాత చిత్రకారులు బాపు గారు లాంటి గొప్పవారికి జన్మనిచ్చిన నేల… యజ్ఞ యాగాదులు చేసి నన్నయ్య భారతానికి శ్రీకారం చుట్టిన నేల… రాకెట్ ఇంధనాన్ని తయారు చేసి పారిశ్రామికంగా పురోగభివృద్ధి సాధించిన నేల తణుకు. ఇలాంటి నేల వైసీపీ పాలనలో అవినీతికి కేంద్రం అయిపోయింద’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బూతులు తిట్టేవాళ్లు… డ్యాన్సులు కట్టేవాళ్లు మంత్రులుగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమేనని హెచ్చరించారు. 2024లో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని… జోడెద్దుల మాదిరి సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తణుకులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ…“ధాన్యం తడిచిపోయి పుట్టెడు బాధలో ఉన్న రైతు తన బాధను పౌరసరఫరాల శాఖ మంత్రికి చెబితే … ధాన్యం తడిస్తే మొలకలు కాకపోతే ఏం వస్తాయి..? అని హేళన చేస్తూ బూతులు తిట్టిన విధానం నన్ను ఎంతగానో బాధించింది. మంత్రి అహాన్ని గోస్తని నదిలో కలిపేసే రోజులు దగ్గరపడ్డాయి. అతన్ని, అతని కొడుకునీ ఆ మాటలే ఓడిస్తాయి. రైతుతో కన్నీరు పెట్టించిన ఆయన పొగరు, అధికారమదం సర్వం ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవాలి.
• ఇక్కడ దోచుకొని తెలంగాణలో పెట్టుబడులు
    మంత్రి ఒక వైపు… ఆయన కుమారుడు మరో వైపు… అనుచరులు ఇంకో వైపు నియోజకవర్గాన్ని దోచేసుకుంటున్నారు. ఆ దోచుకున్న సొమ్మును తెలంగాణలోని బాలనగర్ ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టి జేబులు నింపుకుంటున్నారు. ఇక్కడ దోచేసిన సొమ్ముతో కనీసం ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టినా పదిమందికి ఉపాధి అయిన కలిగేది. ఈ ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తులను తన్ని తగలేసేలా నిర్ణయం తీసుకోవాలి. కలుగులో ఎలుకల్లా ఎక్కడ దాక్కున్నా వారిని బయటకు లాగుదాం. జన సైనికులపై అక్రమ కేసులు బనాయించి… వాళ్లను అన్యాయంగా కొట్టించావు. జన సైనికుల ఒంటి మీద పడిన ప్రతి దెబ్బకు బదులు చెబుతాం.
• ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది?
పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది అని అడిగితే సంబంధిత మంత్రి గారు ఓలమ్మి తిక్క రేగిందా అనే పాటకు డ్యాన్సులు వేస్తాడు. బాధితులకు పునరావసం కల్పించారా..? అని అడిగితే అబ్బనీ తియ్యని దెబ్బ అని స్టెప్పులు వేస్తాడు. మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ ఏమిటంటే బూతులు తిట్టేవాళ్లు… డ్యాన్సులు కట్టేవాళ్లు… దాడులు చేసే వాళ్లు మంత్రులుగా ఉండటం. ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు కోసం మేము తగ్గాం. పార్టీ వ్యవస్థాపక బలం ఉండి శ్రీ చంద్రబాబు గారు తగ్గారు. వారాహి యాత్ర సమయంలో తణుకులో అభ్యర్థిని ప్రకటించి కూడా నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే బలమైన సంకల్పంతో పొత్తును ముందుకు తీసుకొచ్చాం. ప్రధాని మోడీ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారితో అనేక చర్చలు జరిపిన అనంతరం కూటమిగా ఎన్నికలకు సిద్ధమయ్యం. ఇందులో భాగంగా మా అన్నయ్య నాగబాబు గారి సీటును కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. ఇదంతా రాష్ట్రంలోని రైతు బాగుండాలి… ఆడ బిడ్డలకు రక్షణ ఉండాలి… యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలని చేసిందే తప్ప దీని వెనుక ఎవరికి ఎలాంటి స్వార్థం లేదు. మనలో ఒకరు తగ్గితే ప్రజలు గెలుస్తారనే ఉద్దేశంతో తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కాదు.
• పోలీసుల శ్రమశక్తిని కూడా దోచుకుంటున్నాడు
జగన్ మాట్లాడితే క్లాస్ వార్ … క్లాస్ వారు అంటాడు. క్లాస్ వార్ అంటే డబ్బున్న వాడు పేదవాడిని దోచుకోవడం. రాష్ట్రంలో దాదాపు 70 వేల పోలీస్ కుటుంబాలకు రావాల్సిన టీఏ, డీఏలను ఇవ్వలేదు. రేయింబవళ్లు రోడ్ల మీద రక్షణ కల్పించే పోలీసులను రోడ్డున పడేశాడు జగన్. వారి శ్రమశక్తిని దోచుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తికి ఇంకోసారి అవకాశం ఇస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. 2020 విజన్ అని చెప్పి సైబరాబాద్ కు రూపకల్పన చేశారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన తట్టుకొని నిలబడ్డారు. ఉద్ధానం కిడ్నీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే 24 గంటల్లో ఉన్నతాధికారుల బృందాన్ని పంపించి కావాల్సిన చర్యలు తీసుకున్న వ్యక్తి. అలాగే ప్రధాని మోదీ గారు 2047 విజన్ తో ముందుకు వెళ్తున్నారు. ఇవన్ని దృష్టిలో పెట్టుకొనే పొత్తును ముందుకు తీసుకెళ్లాను. నేను చాలా తగ్గాను, మన ప్రజలు బాగుపడాలని మన అభ్యర్థులను కూడా వెనక్కి తీసుకున్నాను. కేవలం ప్రజల బాగు కోసమే, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వ్యక్తిని.
• దోపిడీ దృష్టి ఉన్నవాళ్లు ప్రజల అవసరాలు గుర్తించరు
ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. మెగా డీఎస్సీ అని మాయ మాటలు చెప్పారు. కనీసం తణుకు ఆస్పత్రిలో రోగుల భోజన బకాయిలు రూ. 2 కోట్లు చెల్లించలేకపోయారు. ఉపాధి అవకాశాలు లేక చాలా మంది ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ కు వలస వెళ్లిపోతున్నారు. ఇవేవి కూడా వైసీపీ ప్రభుత్వానికి పట్టదు. దోపిడీపై దృష్టి ఉన్న వాళ్లు ప్రజల అవసరాలు గుర్తించరు. ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు పేద, అల్పదాయ, పారిశ్రామిక వర్గాల గురించి ఆలోచించాయి… తప్ప మధ్యతరగతి మనిషిని వదిలేశారు. నేను ఈ సభా ముఖంగా మధ్యతరగతి ప్రజలను గుర్తించాలని చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మధ్యతరగతి ప్రజలు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా నిలబడితే రాజకీయాల్లో బలమైన మార్పు తీసుకురావచ్చు. అలాగే ఒక మాజీ ఉద్యోగి కొడుకుగా చెబుతున్నాను… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు సీపీఎస్ రద్దుకు పరిష్కార మార్గాన్ని కనుక్కొంటాం. కష్టమైనా సాధిస్తాం. మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. జనసేన షణ్ముఖవ్యూహం, టీడీపీ సూపర్ సిక్స్ తో రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తాం. తణుకు శాసనసభకు కూటమి అభ్యర్థిగా శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అలాగే నరసాపురం లోక్ సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తున్నారు. వారిద్దరిని బలమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు. బహిరంగ సభకు కూటమిలోని మూడు పార్టీల నుంచి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కూటమి అభ్యర్థులు, ప్రధాన నాయకులందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్