వైసీపీ సర్కార్ దోపిడీకి దారులు వెతికింది… కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు కొత్త వెలుగులు చిందిస్తుంది

ఆంధ్రప్రదేశ్

* రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేందుకు సమగ్ర ప్రణాళికలు ఉన్నాయి
* ఐదేళ్లుగా ప్రజల్ని భయపెడుతూ రాక్షస పాలన చేశారు
* జనసేన పోరాటమే ప్రజల్లో ధైర్యం నింపింది
* కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
* జాతీయ స్థాయిలో పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
* పిఠాపురం బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
‘వైసీపీ అంటే గూండాల పార్టీ. ఈ ఐదేళ్ల కాలంలో ఒక్కరిని కూడా ప్రశాంతంగా బతకనివ్వలేదు. వాళ్ల అరాచకాలు, దాష్టీకాలు చూసి ఎవరికైనా వీధుల్లోకి రావాలంటే భయం.. రోడ్ల మీద తిరగాలంటే భయం. హక్కులు హరించారు అని చెప్పడానికి భయం. ఇంతలా ప్రజలను భయపెట్టిన ప్రభుత్వాలు గతంలో ఎప్పుడు లేవ’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. వైసీపీ పుట్టించిన ఆ భయాన్ని పోగొట్టింది జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళల పోరాటమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేకంగా నామినేషన్లు వేసి జగన్ అహాన్ని అణిచి వేశారని చెప్పారు. ఈ రోజు జగన్ భయపడుతున్నాడంటే ఒక్క జనసేన పార్టీకేనని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “రాహువు పట్టిన పట్టు ఒక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనమంతటితో తలక్రిందులైపోతుందా..? అన్న చందంగా 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలను చేతిలో పెట్టుకొని వైసీపీ ప్రజలను భయపెట్టింది. కడుపు మండిన భవన నిర్మాణ కార్మికులు, ఉద్యోగులు, అఘాయిత్యానికి గురైన సుగాలి ప్రీతి తల్లి బయటకు వస్తే ప్రాణాలను పణంగా పెట్టి బయటకు వచ్చాను. జనసేన పార్టీని ఒక్క ఎన్నికల కోసం స్థాపించలేదు. మన బిడ్డల భవిష్యత్తు కోసం స్థాపించాను. ఒక తరం కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను.
• ధర్మో రక్షతి రక్షితః
మా నాన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగి. మాకు ఆస్తిపాస్తులు ఏమీ పెద్దగా ఇవ్వలేదు. మాకు చిన్నప్పటి నుంచి ఒకటే నేర్పించాడు. ధర్మంగా బతకాలని మాత్రమే చెప్పేవాడు. ధర్మో రక్షతి రక్షితః అని.. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందని చెప్పాడు. ఇప్పటికీ అదే పాటిస్తున్నాను. ధర్మం కోసమే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, నోటికొచ్చినట్లు నన్ను బూతులు తిట్టినా భరించాను. రాజకీయాలు అంటే తెలియని నా భార్యను కూడా ఇష్టానుసారం మాటలు అన్నారు. ఇవన్నీ చూసి ఆమె చాలా బాధపడింది. నా నుంచి నువ్వు ఇన్ని మాటలు పడ్డావు నన్ను క్షమించమని మాత్రమే ఆమెను అడిగాను. నేను ఇంతలా ప్రజలకు ఎందుకు నిలబడ్డానో తెలియాలంటే ఈ నెల 13వ తేదీ పిఠాపురం వచ్చి చూడు అని చెప్పాను. సాయి ధరమ్ తేజ్ నాకు మద్దతుగా ప్రచారం చేయడానికి వస్తే ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించారు. బీర్ బాటిల్ విసిరి తల పగలగొట్టాలని చూశారు. ఆ బాటిల్ దురదృష్టవశాత్తు తెలుగుదేశం కార్యకర్తకు తగిలి తలకు గాయమైంది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
• బీజం పిఠాపురంలోనే పడాలి
2024 సార్వత్రిక ఎన్నికలు మన భవిష్యత్తుకు చాలా కీలకం. రాష్ట్ర దశ, దిశను నిర్దేశించే ఎన్నికలు. దేశంలోనే బలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదగాలంటే దానికి బీజం పిఠాపురం గెలుపుతోనే మొదలవ్వాలి. జనసేన అంటే డబ్బుకు అమ్ముడుపోయే పార్టీ కాదు. సారా ప్యాకెట్, బిర్యానీ పొట్లానికి వచ్చే కార్యకర్తలు ఈ పార్టీలో ఉండరు. దశాబ్ద కాలంగా చట్టసభల్లో స్థానం లేకపోయినా బలంగా నిలబడి ఉన్నాం అంటే దానికి ముఖ్య కారణం మన భావజాలం, సిద్ధాంతాలకు ఆకర్షితులై గుండెల్లో పెట్టుకున్న జనసైనికులు, వీరమహిళలే. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన మన పార్టీ మద్దతుదారులు కనిపిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు సైతం మన కండువా కప్పుకున్నారు అంటే మన నిజాయతీ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
• కడుపు మండినోడు రోడ్ల మీదకు వస్తే సంగ్రామమే
సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం… మనిషి నుంచి మనిషికి రెండు గుండెల దూరం.. గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు అంటారు. ఈ రోజు పచ్చగా, కళకళలాడాల్సిన పల్లెలు వైసీపీ పాలన అరాచకాలతో వెలవెలబోతున్నాయి. రైతులకు సాగునీరు లేదు. ప్రజలకు తాగు నీరు దొరకడం లేదు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు రావడం లేదు. టీఏ, డీఏలు ఇవ్వడం లేదు. ఇలా వైసీపీ పాలనపై కడుపు మండినోడు రోడ్లు మీదకు వస్తే… గ్రామం నుంచి సంగ్రామానికి ఎక్కువ సమయం పట్టదు. నేను ఎప్పుడు గొంతెత్తినా ఒక కులం కోసమో… ప్రాంతం కోసమో గొంతెత్తలేదు. కష్టాల్లో ఉన్న ప్రతి మనిషి కోసం గొంతెత్తాను. కులాల వెనకబాటుతనాన్ని గుర్తించే వాడినే తప్ప… కులాలతో రాజకీయం చేసేవాడిని కాదు. అరాచకం, రౌడీయిజం రాజ్యమేలుతుంటే 5 కోట్ల మంది ప్రజలు నెగ్గాలని మాకు మేము తగ్గాము.
• రాష్ట్ర అభివృద్ధికి కొత్త బాటలు వేస్తాం
పిఠాపురం అన్నదమ్ములు, ఆడపడుచులు, పెద్దలకు ఒకటే చెబుతున్నాను… కులాలు, మతాలకు అతీతంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం ప్రాణాలు పణంగా పెట్టాలంటే ముందుంటాను. రాష్ట్ర ప్రజలను గెలిపించడం కోసం నేను తగ్గాను. కూటమి అధికారంలోకి రాగానే విద్యా, వైద్యం, సాగు నీరు, తాగు నీరు, ఉపాధి, లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రతి మండల కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. దేశం మన వైపు చూసేలా ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్ ను అద్భుతంగా అభివృద్ధి చేస్తాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. ప్రకటించిన సమయానికే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం. మీరు రాష్ట్రాన్ని దోచుకోవడానికి దారులు వెతికారు. మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిబాటకు కొత్త మార్గాలు వెతుకుతాం. యువతకు 5 వేలు వచ్చే ఉద్యోగం కాకుండా వాళ్లు పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్తాం. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులు, పోలవరం కూడా సకాలంలో పూర్తి చేస్తాం. పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. అభివృద్ధి అంటే పిఠాపురం… పిఠాపురం అంటే అభివృద్ధి అనే స్థాయిలో పిఠాపురం రూపురేఖలు మారుస్తాం అని అన్నారు. పిఠాపురం నుంచి నేను, కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నాం. మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలి” అని కోరారు. ఈ సభలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, పిఠాపురం బీజేపీ ఇంఛార్జి శ్రీ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్