విజయవాడ నగర వీధుల్లో ఎన్డీఏ అగ్ర నేతల విహారం

ఎన్డీఏ

• ప్రధాని శ్రీ మోదీతో కలసి శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీ చంద్రబాబు రోడ్ షో
• బ్రహ్మరథం పట్టిన బెజవాడ జనం
• శ్రీ మోదీ చిత్రపటాలతో మహిళల పాదయాత్ర
• బందరు రోడ్డుని ముంచెత్తిన మూడు పార్టీల జెండాలు, అభిమానులు
• కూటమి షో సూపర్ సక్సెస్ తో మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం
కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి సాక్షిగా బెజవాడ పురవీధుల్లో ఎన్డీఏ కూటమి పక్షాల వికసిత నినాదాలు మిన్నంటాయి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కలసి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన భారీ రోడ్ షో జయహో మోదీ జీ.. జయజయహో పవన్, జయహో చంద్రబాబు నినాదాలతో మారుమోగింది. బందరు రోడ్డులో ఎన్డీఏ అగ్రనేతలు ప్రచార రథంపై విహరించగా దేశ ప్రధానితో పాటు జనసేన, టీడీపీ అధినేతలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం సాయంత్రం ఈ మెగా ఈవెంట్ కి రాజధాని నగరం విజయవాడ వేదిక అయ్యింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పక్షాలతో కలసి సభలు నిర్వహించిన ప్రధాన మంత్రి శ్రీ మోదీ గారు, తుది అంకంలో రాజధాని నగరంలో రోడ్ షోతో ప్రచారాన్ని ముగించారు. మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బుధవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేరుకున్నారు. ప్రజల జయజయధ్వానాల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచార రథం ఎక్కి రోడ్ షో లో పాల్గొన్నారు. ప్రధానితో పాటు అగ్రనేతల రాక నేపథ్యంలో ఎం.జి.రోడ్డుకి ఇరు వైపులా బారికేడ్లతో మూడంచెల రక్షణ వలయం ఏర్పాటు చేసి రోడ్ షో తిలకించేందుకు వీలుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచే ఈ మెగా రోడ్ షోని తిలకించేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లాతోపాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి మూడు పార్టీల శ్రేణులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. గ్యాలరీల్లో కిక్కిరిసిన జనాలు శ్రీ మోదీ గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నినాదాలు చేస్తుండగా ముగ్గురు నేతలు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మున్సిపల్ స్టేడియం, లబ్బీపేట, పీవీపీ, డీవీ మేనర్ హోటళ్ల మీదుగా సుమారు రెండు కిలోమీటర్లు గంటకు పైగా ఈ రోడ్ షో సాగింది. ప్రచార రథానికి ముందు మహిళలు శ్రీ మోదీ గారి చిత్రపటాలతో పాదయాత్రగా కదలగా, తరలివచ్చిన ఆశేష జనవాహినికి అభివాదం చేస్తూ మూడు పార్టీల అగ్రనేతలు ముందుకు కదిలారు. వికసిత్ భారత్ టార్గెట్ 2047, శ్రీ మోదీ జీకి విజయం కలగాలి అంటూ ప్రజలు ప్లకార్డులు ప్రదర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ సందడి చేశారు. నగరంలోని గుజరాతీ ఆడపడుచులు గ్యాలరీల్లో సంప్రదాయ నృత్యాలతో ప్రధానికి, టీడీపీ, జనసేన అధినేతలకు స్వాగతం పలికారు. ఎన్డీఏ అగ్రనేతల రోడ్ షోలో బందరు రోడ్డు మొత్తం మూడు పార్టీల జెండాలతో నిండిపోయింది. రోడ్ షో సాగినంతసేపు ప్రధాని చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు గారు మద్దతుగా తరలివచ్చిన జనవాహినికి నమస్కరిస్తూ ముందుకు సాగారు. ముగ్గురు నేతలపై ప్రజలు పూల వర్షం కురిపించగా భద్రతా కారణాల దృష్ట్యా ఎస్పీజీ నాయకులకు రక్షణ వలయంలా నిలిచారు. అమరావతి రైతులు కూటమి నేతల రోడ్ షోకి సంఘీభావంగా తరలివచ్చారు. రాత్రి 8 గంటలకు బెంజి సర్కిల్ వద్ద ముగిసిన ఈ రోడ్ షో కూటమి శ్రేణుల్లో జోష్ నింపింది.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్