• జనసేన, టీడీపీ అధినేతలకు ఆధ్యాత్మిక నగరిన బ్రహ్మరథం
• అడుగడుగునా హారతులు, కేరింతల స్వాగతం
• విద్యుత్ దీపాలు ఆర్పి అక్కసు వెళ్లగక్కిన వైసీపీ
• మొబైల్ లైట్ల వెలుగుల మధ్య రోడ్ షో
• ఎదురేగి అభిమాన నేతలను స్వాగతించిన తిరుపతి ప్రజలు
ఆధ్యాత్మిక నగరం తిరునగరి జనసంద్రమయ్యింది. జనసేన, టీడీపీ అధినేతలకు విజయనాదంతో స్వాగతం పలికింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారితో కలసి జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అడుగడుగునా జనసైనికులు, టీడీపీ శ్రేణులు, ఆడపడుచులు హారతులు, కేరింతల మధ్య బ్రహ్మరథం పట్టారు. పోటెత్తిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఇరువురు అధినేతలు ముందుకు సాగారు. కరకంబాడి రోడ్డులోని ఆషా ఫంక్షన్ హాల్ నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు కిక్కిరిసిన జనం మధ్య రెండున్నర గంటల పాటు ఈ రోడ్ షో సాగింది.
• రోడ్ షోకి తరలివచ్చిన ఆశేష జనవాహిని
తిరుపతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వారాహి విజయ భేరీ సభ కోసం జనసేన, టీడీపీ అధినేతలు సాయంత్రం కరకంబాడి రోడ్డులోని ఆషా కన్వెన్షన్ హాల్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి వేలాదిగా తరలివచ్చిన జనసమూహం జేజేల మధ్య రోడ్ షో నిర్వహించారు. కరకంబాడి రోడ్డు, మంగళం, లీలామహాల్ సెంటర్, తిలక్ రోడ్డు మీదుగా గాంధీ రోడ్డులోని నాలుగుకాళ్ల మండపం వరకు సాగిన ఈ రోడ్ షో ఆద్యంతం అశేష జన సందోహం మధ్య సాగింది. ర్యాలీ సాగిన మార్గం మొత్తం తిరుపతి నగర ప్రజలతో నిండిపోయింది. పూల వర్షం కురిపిస్తూ, జయహో జనసేన, జయజయహో టీడీపీ అంటూ నినదించారు. ఇరు పార్టీల శ్రేణులు జెండాలు రెపరెపలాడించగా, ప్రజలు గాజు గ్లాసు గుర్తుని స్వచ్ఛందంగా ప్రదర్శిస్తూ మద్దతు తెలిపారు.
• దారంతా జనసేన జెండాలు, గాజు గ్లాసు గుర్తుల ప్రదర్శన
మంగళం నుంచి లీలా మహాల్ సెంటర్ల మధ్య జనప్రవాహం ప్రతి అడుగుకీ రెట్టింపు అవుతూ వచ్చింది. ప్రతి ఒక్కరి చేతిలో జనసేన జెండా, గాజు గ్లాసు కనబడింది. జనసంద్రం రహదారులతో పాటు గరుడ వారధిని ముంచెత్తింది. లీలామహాల్ సెంటర్ లో కమలాలతో తయారు చేసిన భారీ గజమాలను అభిమానులు ఇరువురు అధినేతలకు అలంకరించారు. తమపై తిరునగరి ప్రజలు చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగారు.
• విద్యుత్ సరఫరాకి బ్రేక్.. రోడ్ షోకి మొబైల్ టార్చ్ వెలుగులు
కూటమికి మద్దతుగా తరలివచ్చిన ఆశేష జనవాహినిని చూసి వైసీపీ సర్కారు రోడ్ షోలో వీధి దీపాలు ఆర్పేసి అక్కసు వెళ్లగక్కింది. భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా వీధి దీపాలు ఆర్పివేయడంపై మూడు పార్టీల నాయకులు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రోడ్ షో ఆద్యంతం మొబైల్ లైట్ చేతిలో పట్టుకుని శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగారు. విద్యుత్ సరఫరా నిలిపివేతతో అధినేతలు చీకట్ల మధ్య రోడ్ షో సాగిస్తుండడాన్ని గమనించి రోడ్ షోకి వచ్చిన ప్రజలంతా రహదారికి ఇరువైపులా నిలబడి మొబైల్ టార్చ్ లు వెలిగించి దారి చూపారు. జనసేన, టీడీపీ అధినేతల రోడ్ షోలో విద్యుత్ శాఖ వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు హల్లో ఏపీ బైబై వైసీపీ అంటూ నినదించారు.