• శ్రీ మోదీ గ్యారెంటీతో రాష్ట్రం పరుగులు తీయడం ఖాయం
• అన్ని వర్గాలకీ మేలు చేసేలా పాలన అందిస్తాం
• ప్రజల కోసం ఆలోచించిన గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
• అంతా కలిసి మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం
• అనకాపల్లి ఎన్టీయే కూటమి ఎన్నికల సభలో శ్రీ చంద్రబాబు నాయుడు
‘కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఎక్కించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇది కల్లోల ఆంధ్రప్రదేశ్, కలల ఆంధ్రప్రదేశ్ కి మధ్య జరుగుతున్న పోరాటం. సైకో జగన్ పోవాలి. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలవాలి. అందుకోసం మూడు పార్టీలు కూటమిగా వస్తున్నామ’ని టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రగతి కూటమితోనే సాధ్యమన్నారు. సోమవారం సాయంత్రం అనకాపల్లిలో జరిగిన ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారితో కలసి పాల్గొన్నారు. ఈ సభను ఉద్దేశించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ.. “రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి. ప్రజలు బాగుండాలి. అది జరగాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. అందుకోసం మొదట ముందుకు వచ్చిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ త్యాగానికి అయినా సిద్ధం అని చెప్పిన వ్యక్తి ఆయన. సీట్ల కోసం ఓట్ల కోసం ఆలోచించలేదు. తనను నమ్ముకున్న ప్రజల కోసం త్యాగం చేయాలని ముందుకు వచ్చారు. అలాంటి వ్యక్తి ప్రజల కోసం విశాఖ వస్తే ఆటంకాలు సృష్టించారు. ఉన్నపళంగా వేరే ప్రాంతానికి తరలించారు. ఆయనకు జరిగిన అవమానం చూసి విజయవాడ వచ్చి సంఘీభావం తెలియచేశాను. నన్ను జైలులో పెట్టినప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేరుగా వచ్చి సంఘీభావం తెలిపారు. పొత్తు ఉంటుందని ప్రకటించారు. ప్రజా జీవితంలో ఆయన నిజమైన హీరో. నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అన్నింటినీ భరించాం. ప్రజల్ని కాపాడుకునేందుకు ఎన్నోనిద్రలేని రాత్రులు గడిపాము. ఈ సారి ఎన్డీఏ గెలుపుని ఎవరూ ఆపలేరు. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి.. సైకోని ఎక్కడికి పంపాలో మీరే చూసుకోండి.
• దేశం.. రాష్ట్రం అభివృద్ధిలో నంబరు 1 కావాలి
శ్రీ మోదీ గారు పదేళ్లలో దేశాన్ని ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. వచ్చే ఐదేళ్లలో మూడో ఆర్థిక శక్తిగా మారుస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ చేస్తారు. వికసిత్ భారత్ శ్రీ మోదీ గారి కల. నా కల, శ్రీ పవన్ కళ్యాణ్ గారి కల వికసిత్ ఆంధ్రప్రదేశ్. శ్రీ మోదీ గారి నాయకత్వంలో దేశం ముందుకుపోవాలి. భారతీయులు ప్రపంచంలో నంబర్ వన్ కావాలి. మన దేశం ప్రపంచంలో నంబర్ వన్ కావాలి. దేశంలో రాష్ట్రం నంబర్ వన్ కావాలి. పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం మా కల. అందుకే ఈ కలయిక. శ్రీ మోదీ గారి గ్యారెంటీ, సూపర్ సిక్స్ ప్రజల కోసమే. కూటమి మేనిఫోస్టో ముందు సైకో మేనిఫెస్టో వెలవెలబోయింది. కూటమి 25 పార్లమెంటు స్థానాలు 160కి పైగా అసెంబ్లీ సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది. ఈ ముఖ్యమంత్రి గత ఎన్నికల ముందు బుగ్గలు నిమురుతూ రోడ్లు పట్టుకుని తిరిగాడు. అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు. సైకో బాదుడుకి ప్రజలు అలసిపోయారు. శుక్రవారం అయితే ప్రొక్లెయిన్ వస్తుంది. ఎవరి ఇల్లు కూలగొడతాడో తెలియదు. ఈ గూండా గిరి అణచివేయడానికి, అమరావతి నిర్మాణం చేయడానికి, పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా నీరివ్వడం కోసమే మా కలయిక. అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేసి సుపరిపాలన అందిస్తాం. దేవాలయాలు కాపాడుతాం. అన్ని వర్గాలకు పూర్తి న్యాయం చేస్తాం.
• పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం
శ్రీ మోదీ గారి సహకారంతో పోలవరం పూర్తి చేస్తాం. అభివృద్ధిని పట్టాలు ఎక్కిస్తాం. శ్రీ మోదీ గారి గ్యారెంటీలు, కూటమి మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకువెళ్లండి. జగన్ డ్రామాలు అందరికీ అర్ధమయ్యాయి. తన తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడంటూ వారి షాపుల మీద దాడి చేశాడు. ఎన్నికల తర్వాత ఆ రిలయన్స్ అధినేత చెప్పిన వారినే రాజ్య సభకు పంపాడు. ఉత్తరాంధ్ర ప్రాంతం వైసీపీ నాయకుల దోపిడీకి అడ్డాగా మారింది. ప్రజల భూముల మీద కన్నేశారు. ఒక్క పని చేసింది లేదు. భోగాపురంలో విమానాశ్రయానికి పునాది రాయి వేస్తే దాని మీద మళ్లీ పునాది రాయి వేశాడు. ఈ స్టిక్కర్ ముఖ్యమంత్రి, అసమర్ధ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. శ్రీ మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధితో కూడిన నీతివంతమైన పాలన అందిస్తాం. సంపద సృష్టిస్తాం. ఆదాయం పెంచి అందరికీ పంచుతాం. కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డ నిధి కింద నెలకి రూ. 1500 ఇస్తాం, తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు రూ. 15 వేలు అందచేస్తాం. ప్రతి బిడ్డని చదివించే బాధ్యత తీసుకుంటాం. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందచేస్తాం. శ్రీ మోదీ గారి గ్యారెంటీలో చెప్పిన విధంగా మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తాం. శ్రీ మోదీ గారు కల్పించిన 33 శాతం రిజర్వేషన్ తో వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు, శాసనసభలలోకి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి చేరతారు. యువతకు ఉద్యోగాలు కావాలన్నా కూటమి రావాలి. కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెడతాం. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం. కేంద్రంలో శ్రీ మోదీ గారిని , రాష్ట్రంలో నన్ను, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే పెట్టుబడులు వస్తాయి. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. రైతుని రాజుని చేస్తాం. పింఛన్లు ఏప్రిల్ నెల నుంచి రూ. 4 వేలు ఇస్తాం. ఒకటో తేదీన ఇంటి వద్దే ఆ మొత్తం అందచేస్తాం. శవరాజకీయాలు చేయం. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి, ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం. కూటమిని గెలిపించే బాధ్యత తీసుకోండి. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను గెలిపించండి’’ అని అన్నారు.