అవినీతే వైసీపీ అజెండా

వైసీపీ

• ల్యాండ్, శాండ్, వైన్, మైన్ లో కోట్లు దోచేశారు
• జగన్ కు రాజకీయ వారసత్వంపై ఉన్న శ్రద్ధ… ప్రాజెక్టులను పూర్తి చేయడంలో లేదు
• పోలవరం, సుజల స్రవంతి ప్రాజెక్టులను గాలికొదిలేశారు
• చెరకు రైతులకు, మత్స్యకారులకు అండగా ఉంటాం
• రైల్వే కార్యాలయాలకు భూమి ఇవ్వని ప్రభుత్వం ఇది
• ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి
• అనకాపల్లి ఎన్డీఏ ఎన్నికల సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
భారతీయ జనతా పార్టీది అభివృద్ధి మంత్రమయితే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అవినీతి మంత్రమని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పేర్కొన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ లో ఇష్టానుసారం దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తూ ప్రజలను నిలువునా ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న జగన్… ఆయన ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులను మాత్రం పూర్తి చేయలేకపోయాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యమని, కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం అనకాపల్లిలో ఎన్డీఏ నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ… “తెలుగు భాష, అనకాపల్లి బెల్లం రెండు చాలా మధురమైనవి. ఈ మాధుర్యం జూన్ 4న మరింత పెరుగుతుంది. ఆ రోజు ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించబోతోంది. ఎన్డీఏ హయాంలో భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. చంద్ర మండల దక్షిణ ధృవంపై తొలిసారి అడుగుపెట్టిన దేశంగా చరిత్ర లిఖించింది. మునుపటితో పోల్చితే ప్రపంచంలో భారతదేశ గౌరవం పెరిగింది. ఈ గౌరవం ప్రతి భారత పౌరుడి ఛాతి ఉప్పొంగేలా చేసింది. ముఖ్యంగా ప్రవాస భారతీయులు గర్వంతో తలపైకెత్తేలా చేసింది.
• రైల్వే జోన్ ఇచ్చాము… కార్యాలయానికి వైసీపీ సర్కార్ భూమి ఇవ్వలేదు
ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకుంటాం. అనకాపల్లి- అనంతపురం ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మించాం. రాయపూర్-విశాఖ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంలో ఉంది. కోలకత్తా- చెన్నై ఎక్స్ ప్రెస్ హైవే ఈ ప్రాంతం మీద నుంచే వెళ్తుంది. 2014 వరకు రాష్ట్రంలో 4 వేల కి.మీ. జాతీయ రహదారి ఉంటే ఇప్పుడు అది తొమ్మిది వేలకు పెరిగింది. కర్నూలులో ట్రిపుల్ ఐటీ, తిరుపతిలో ఐఐటీ, ఐసర్, విశాఖలో ఐఐఎం స్థాపించాం. పెట్రోలియం విశ్వవిద్యాలయం, పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ పార్క్ కు అనుమతులు ఇచ్చాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ పార్క్ ప్రారంభానికి రూ. వెయ్యి కోట్లు అందించాం. దీనివల్ల పెట్టుబడులు పెరిగి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కు కేంద్రం ఆమోదం తెలిపి భూమి కేటాయించమని కోరితే రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటి వరకు భూమి కేటాయించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వంగా మేము రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే వైసీపీ ఎందుకు చేయలేకపోతోంది. వాళ్లు అభివృద్ధి పనులు చేయకపోగా.. మేము చేస్తున్న పనులకు మోకాలడ్డుతున్నారు.
• కేంద్రం 24 లక్షల ఇళ్ళు మంజూరు చేసింది
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో పేదలకు 24 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే అందులో సగం కూడా వైసీపీ ఇవ్వలేదు. పేదల బాధలు మోదీ తీరుస్తుంటే… వీళ్లకు బాధ కలుగుతోంది. వైసీపీది ఒకటే అజెండా అవినీతి… అవినీతి. వాళ్లకు అవినీతి తప్ప అభివృద్ధి పట్టదు. ఇందుకు ఉదాహరణే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. 8 వేల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. తండ్రి నుంచి రాజకీయ వారసత్వం తీసుకున్న జగన్.. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేకపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుదీ అదే పరిస్థితి. కేంద్రం ఇప్పటి వరకు రూ. 15 వేల కోట్లు అందించింది. ప్రాజెక్టు పనులు సకాలంలో చేయడంలోనూ, నిర్వాసితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.
• చెరకు రైతుల బతుకుల్లో వెలుగులు నింపుతాం
రాష్ట్రం, ముఖ్యంగా అనకాపల్లి ప్రాంతం చెరకు సాగుకు కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో అనేక చక్కర కర్మాగారాలు మూతపడ్డాయి. ప్రభుత్వ విధానాల వల్ల చెరకు పంటను పండించాలంటేనే రైతులు భయపడే స్థాయికి వెళ్లారు. సకాలంలో బిల్లులు చెల్లించకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాం. పెట్రోల్ లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్నాం. దీనివల్ల రూ. 8 వేల కోట్లు చెరకు రైతులకు అందుతాయి. భారీగా లబ్ధిపొందుతారు. మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాం. కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తాం. ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు పెంచి ఆర్థికంగా ఆదుకుంటాం.
• హద్దులు లేని అవినీతే కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ పోయిందని సంతోషించేలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వేరు వేరు కాదు. రెండు పార్టీల గుర్తింపు ఒక్కటే అదే హద్దులు లేని అవినీతి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో భూ మాఫియా రాజ్యమేలుతుంటే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, వైన్ మాఫియా రాజ్యమేలుతోంది. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల హయాంలో మన సంస్కృతిపై దాడి జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని బహిరంగంగా తిరస్కరిస్తే… ఇక్కడ ఏకంగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేవాలయాలపై దాడులను ఆపుతామ”ని హామీ ఇచ్చారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్