చట్టాలపై గౌరవం లేని వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు

చట్టాలు

• ముఖ్యమంత్రి కాకముందే చేయాల్సిన దారుణాలన్నీ చేశాడు
•ఎస్సైని స్టేషన్లో కొట్టిన వ్యక్తి ఆయన
• నేరాలను వ్యవస్థలో భాగం చేయాలన్నదే వైసీపీ కుట్ర
• వైసీపీ విముక్త ప్రాంతంగా ఉభయ గోదావరి జిల్లాలను చేద్దాం
• గోదావరి జిల్లాల నుంచే జనసేన జైత్రయాత్ర
• సమగ్ర అధ్యయనం తర్వాతే జనసేన పాలసీలు రూపొందిస్తుంది
• పార్టీ విజయం కోసం నాయకులు, జన సైనికులు బలంగా పని చేయాలి
• నరసాపురం నియోజక వర్గం నాయకుల సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
            ‘యుద్ధం మొదలుపెట్టినప్పుడు ముందుగా చిన్న చిన్న కోటలు కొట్టాలి.. శివాజీ మహారాజ్ కూడా చిన్న చిన్న గెరిల్లా తరహా యుద్ధాలు చేసి, చిన్న ప్రాంతాలను మొదట స్వాధీనం చేసుకున్న తర్వాతే రాజ్యం సాధించాడు. మనం కూడా అదే బాటలో ముందుకు వెళ్దాం. ముందుగా ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ విముక్త ప్రాంతాలుగా చేద్దాం. ఇక్కడున్న 34 స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీ గెలవకూడదు. ఆ స్థాయిలో జనసైనికులు, జనసేన నాయకులు బలంగా పని చేయాల’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సోమవారం నరసాపురంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులతో ఆయన సమావేశం అయ్యారు.
            ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “గోదావరి జిల్లాలను విముక్తం చేసేందుకు – ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే అసాధ్యమేమీ కాదు. పుట్టీ పుట్టగానే అంతా నాయకులు అయిపోలేరు.. వైవీ సుబ్బారెడ్డిలాగా తెల్ల గెడ్డంతో పుట్టరు కదా? శ్రీ జగన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా పుట్టలేదు కదా? ముఖ్యమంత్రి కాకముందు ఆయన చేయాల్సిన దారుణాలన్నీ చేశారు. ఎస్సైని కూడా కొట్టారు. కడప జిల్లాలో ఆయన ఫ్రెండ్స్ వేటకు వెళ్తే పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు ఎస్సైని వేసి కొట్టిన వ్యక్తి ఆయన. ఇప్పుడు వైసీపీ నాయకులు, వారి పిల్లలు కూడా అదే ఫాలో అవుతూ ఎస్పీ, డీఎస్పీలను కొడుతున్నారు. మనం అవేమీ చేయలేదు? వారు చేస్తున్న దారుణాలపై అధ్యయనం చేస్తున్నాం. మనం మాత్రం బాధ్యతగా ముందుకు వెళ్తున్నాం.
* వైసీపీ దాష్టీకాలు మన ఇళ్లలోకి వస్తాయి
           చట్టాల మీద గౌరవం, భయం లేని వారు మనల్ని పాలించడం సరికాదు. ప్రజల్ని యథేచ్ఛగా దోచుకుంటూ మన హక్కుల్ని కాలరాస్తామంటే కుదరదు. దీన్ని ఎదుర్కోవాలంటే మనకు చట్టాల మీద కనీస అవగాహన అవసరం. బాపట్లలో 15 ఏళ్ల కుర్రాడిని తోటలోకి తీసుకువెళ్లి కాల్చేస్తే పోలీసుల స్పందించలేదు. రేపటి రోజున ఆ దాష్టీకాలు మన ఇళ్లలోకి వస్తాయి. మనం ఎదుటి వారికి ఆపద వచ్చినప్పుడు నోరెత్తకపోతే రేపటి రోజున మనదాకా వచ్చినప్పుడు ఎవరూ ఉండరు.
• మార్పు స్పష్టంగా కనబడుతోంది
          ఈ నెల 14వ తేదీ నుంచి యాత్ర ప్రారంభించి తూర్పు గోదావరి జిల్లాలో తిరిగాం. సమస్యలపై స్పందించాం. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అన్నది అర్ధం అవుతోంది. 2008 నుంచి రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్తున్నాం. మార్పు వచ్చే వరకు దాన్ని వదలకూడదని పట్టుదలతో ఉన్నాను. దశాబ్దంన్నర తర్వాత దాని సత్ఫలితాలు ఈ రోజు చూస్తున్నాం. ఎన్ని లక్షలు పోసినా సభలకు ఇంత మంది రారు. రాజోలులో స్వచ్ఛందంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మార్పు మొదలైందన్న దానికి ఇదే సంకేతం.
* నేను ఒక పని మొదలు పెట్టాక నిలబడతాను.
           సమాజంలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కొంత మంది చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ పరిస్థితుల్లో మిగిలిన వారు దేహి అనే పరిస్థితి రాకూడదనే ఈ ప్రయాణం మొదలుపెట్టాను. ఇసుక రీచ్ లో అడ్డగోలుగా జరిగిన దోపిడీ వల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది.
• ఆదాయం పోకుండా కాలుష్యాన్ని పారద్రోలాలి
          ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధి కోసం ఒక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. అందులో ముఖ్యమైన అంశం కాలుష్య నివారణ. ఆక్వా కల్చర్ వల్ల ఆదాయంతోపాటు ఆపద ఉంది. ఆదాయం పోకుండా కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. తూర్పు గోదావరి జిల్లాలో గ్రామాల్లో కూడా నీరు పచ్చగా వస్తోంది. ఇలాంటి పరిస్థితులు కిడ్నీలు లాంటి అవయవాలను దెబ్బతీస్తున్నాయి. ఉద్దానం లాంటి పరిస్థితులు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వచ్చేస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో పచ్చదనం దెబ్బ తినకుండా.. ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోకుండా.. ఆదాయం రావాలి. దాని కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. రెండు జిల్లాల్లో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న దివ్వ క్షేత్రాలను అనుసంధానం చేసే విధంగా డివోషనల్ సర్క్యూట్ రూట్ ఏర్పాటు చేసి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. నరసాపురంలో కాలువలు ఉన్నా కేరళ తరహా పర్యాటకం అభివృద్ధి చేయలేకపోతున్నాం? బోట్ హౌస్ లు ఎందుకు తయారు చేయలేకపోతున్నాం. ఒక బలమైన వ్యూ ఉంటేనే అది సాధ్యం.
• మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను
          మన దగ్గర పెట్టుబడి పెట్టే వారు లేరు. ముఖ్యమంత్రికి, నాయకులకు కాంట్రాక్టులు, అక్రమార్జనలు ఉన్నాయి. నేను ఒక వ్యవస్థ నడుపుతున్నాను. నాకు అలాంటి అక్రమార్జన ఉంటే ముందుకు వెళ్లగలిగేవాడిని కాదు. నేను పార్టీ నడుపుతూ ఇన్నాళ్లు దెబ్బలు తిన్నాను తప్ప మీ ఆత్మగౌరవాన్ని ఎక్కడా తాకట్టు పెట్టలేదు. ఇప్పటి వరకు రాజకీయాల్లో ప్రలోభాలకు చోటివ్వకుండానే ఉన్నాం. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా ఇంత అభిమానం రాదు. ఇవన్నీ డబ్బుతో కొనేవి కాదు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లినా ఇదే స్థాయి అభిమానం ఉంటుంది. ఆ అభిమాన బలంతో ముందుగా ప్రజా సమస్యల పరిష్కారం మీద దృష్టి సారించాను. తర్వాత పార్టీ నిర్మాణం వైపు అడుగులు వేశాం. సమస్య మూలాలు తెలుసుకోకుండా మూర్ఖంగా ఒక పాలసీ తెచ్చేసి ప్రజల మీద రుద్దేది ఉండదు. ఇసుక రీచ్ వ్యవహారంలో ఒక్క పాలసీతో ఈ ప్రభుత్వం ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. 32 మంది చావులకు కారణం అయ్యారు. ఎంతో మంది ఉపాధి తీసేశారు. అందుకే పాలసీల మీద స్వయంగా అధ్యయనం చేస్తున్నాను.
• యూకే తరహా హెల్త్ పాలసీ
          ఆరోగ్య శ్రీ లాంటి పాలసీలు చిన్నపాటి జబ్బులకు మంచిదే. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఉంటే ఇంకా మంచిది. ప్రజలు టాక్సులు కట్టినందుకు వారి ఆరోగ్య బాధ్యత బ్రిటన్ ప్రభుత్వమే తీసుకుంటుంది. మేధావులతో కూర్చుని అధ్యయనం చేసిన తర్వాత సమగ్ర ఆరోగ్య పాలసీకి రూపకల్పన చేస్తాం. పార్టీ తరఫున ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకువస్తే రూ. 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వగలుగుతున్నాం. అదే పాలసీ ప్రజలందరికీ ఎందుకు వర్తింపచేయలేమన్న ఆలోచనే ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల హెల్త్ ఇన్యూరెన్స్ అన్నదానికి దోహదం చేసింది. ప్రస్తుత పాలకులు ప్రైమరీ హెల్త్ కేర్ ని చంపేశారు. కాలుష్యం పెరిగి ప్రజల్లో అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. జనసేన ప్రభుత్వంలో యూకే తరహా హెల్త్ పాలసీ తీసుకువస్తాం. దీనిపై లోతుగా అధ్యయనం చేస్తున్నాం.దాతలు ఇచ్చిన కాలేజీ స్థలాలు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. పెద్దలు భావితరాల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూములు దోచుకుంటున్న వారికి ప్రభుత్వాలు అండగా నిలిచినప్పుడు లక్ష్యాలు దెబ్బతింటాయి. ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలలను బలోపేతం చేయాలి. ఉపాధి అవకాశాలు ఉండాలి. ఇక్కడ ఐటీ పరిశ్రమలు లేవు. తెలంగాణలో 1500, కర్ణాటకలో 2000 ఐటీ హబ్బులు ఉంటే.. మన రాష్ట్రంలో ఆ స్థాయిలో ఎందుకు లేవు. ఇది మన నేల అన్న తపన ఉన్న నాయకులు పూనుకుంటేనే అది సాధ్యపడుతుంది. మనం నోరెత్తకపోతే సమాజం నాశనం అయిపోతుంది. అందుకే నేను ఉభయ గోదావరి జిల్లాల బాధ్యత స్వీకరించా. యువత తాలూకా ఇంధనం అభివృద్ధికి దోహద పడితే అద్భుతంగా ఉంటుంద”న్నారు.
* ఓటర్ల లిస్టులను క్షుణ్ణంగా పరిశీలించండి: శ్రీ నాదెండ్ల మనోహర్
         ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “వారాహి విజయయాత్రలో ప్రతి నియోజకవర్గంలోనూ రెండు రోజులు గడిపి, ప్రతి సమస్యపై లోతైన చర్చ చేయడం అద్భుతం. సామాన్యులు, మహిళలు ముందుకు వచ్చి, వారి ఆలోచనలు పంచుకున్నారు. అన్ని వర్గాల వారు సూచనలు, సలహాలు రాసివ్వడం, వారి సమస్యలను ధైర్యంగా ముందుకు తీసుకురావడంతో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. రాజకీయ ప్రస్థానంలో అన్ని రకాల అంశాలను అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎన్నికల వేళ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగితే సరిపోదు. ప్రతి అంశాన్ని అర్ధం చేసుకోవాలి. నరసాపురంలో శ్రీ బొమ్మిడి నాయకర్ గారు పూర్తిస్థాయిలో పనిచేయడం, కార్యక్రమాలు ముందుండి నడిపించడం మంచి పరిణామం. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావాలంటే అంతా సంఘటితం కావాలి. వైసీపీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరినీ నామినేషన్ వేయనీయకపోతే వీర మహిళలు ముందుండి పోరాడారు. నరసాపురంలో ముఖ్యమంత్రి ఇటీవల రూ.3,200 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసి వెళ్లిపోయారు. ఈ రోజుకు రూపాయి పని కాలేదు. ఆయన పర్యటన సమయంలో పచ్చటి చెట్లు మాత్రం నాశనం చేశారు. ఆర్భాటం కోసం, ఆ నాడు కార్యక్రమం కోసం రూ.6 కోట్లు వృథా చేయడం తప్ప ఏం జరగలేదు. ఈ ప్రాంతానికి వైసీపీ పాలన వల్ల ఒరిగిందేమీ లేదు.
          శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు జన సైనికులు, వీర మహిళలు వారధులుగా ఉన్నారు. నాయకులంతా డోర్ టు డోర్ సర్వేలు చేసి, ఓటర్ల లిస్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అంతా ఒకసారి సర్వేలు నిర్వహించండి. ఎన్ని కొత్త ఓట్లు, తీసివేసినవి ఎన్ని అనేవి తెలుసుకోండి. యువతను భాగస్వామ్యం చేయండి. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళదాం. అంతా కలిసికట్టుగా పనిచేయండి. వ్యక్తుల కోసం జనసేన పార్టీ లేదు… ఇదో వ్యవస్థ. ప్రజల కోసం బలంగా పోరాడే వ్యవస్థ ఇది” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్, పీఏసీ సభ్యులు శ్రీ చేగొండి సూర్యప్రకాష్, పార్టీ నాయకులు శ్రీ చాగంటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్