* అహింసాయుత మార్గాలే ఉద్యమానికి ఊపిరి
* సమస్య ఏదైనా వస్తే శాంతియుతంగా చర్చలు జరుపుదాం
* సమాజ హితం కోసం కూలీలా పని చేయడానికి వచ్చాను
* అమలాపురం కార్యకర్తలు, నాయకుల సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్
‘కోనసీమ నీరు, తిండి, గాలిలో పౌరుషం ఉంటుంది. ఈ నేలలో బడబాగ్ని దాగి ఉంది. అన్యాయం, తప్పు జరిగితే ఊరుకునే తత్వం ఉండదు. మనుషుల్ని ఇక్కడి వారు ఎంతగా ప్రేమిస్తారో, అభిమానం ఎంతగా చూపుతారో, వారి కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. అయితే పోరాటాలు ఎప్పుడు అహింసాయుత మార్గాల్లో జరగాలి. ఏ ఉద్యమమైనా హింసాయుత వాతావరణంలోకి వెళితే ఆ ఉద్యమం నీరుగారిపోతుంది’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం అమలాపురంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎదుటి వారి హక్కులకు భంగం కలగనీయకుండా మన హక్కులు కాపాడుకోవాలి. ఎదుటి వారి హక్కులకు నువ్వు భంగం కలిగిస్తే కచ్చితంగా అది తప్పే. చట్టం అందరికీ సమానంగా ఉండాలి. నేరం చేసిన వ్యక్తి ఏ కులంలో ఉన్నా ఆ కులంలోని వారు వెనకేసుకురాకూడదు. ఒక దళిత డ్రైవర్ను హత్య చేసి ఇంటికి పార్సిల్ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు మా కులం వాడు అని, 13 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగులపెట్టిన వారు మా కులానికి చెందిన వారని వారికి వంత పాడుతామా..? తప్పు చేసిన వారు ఏ కులంలో ఉన్న కచ్చితంగా మూకుమ్మడిగా ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజల నుంచి ఎన్నికైన వారు కేవలం తమ కులానికే ప్రతినిధి కారు. రేపటి రోజున ఇక్కడి నుంచి శ్రీ రాజబాబు ఎమ్మెల్యే అయితే దళిత వర్గానికి మాత్రమే కాదు అందరికీ ప్రతినిధి అవుతారు. పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కఠినంగా ఉండే చట్టాలు అవసరం. సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన న్యాయం ఉండాలి అన్నది జనసేన లక్ష్యం.
* ముందుగా ఆత్మ విమర్శ చేసుకోవాలి
సమాజంలో బలమైన మార్పు రావాలని అందరికీ ఉంటుంది. అలా అనుకునే వారంతా ముందుగా ఆత్మ విమర్శ చేసుకోవాలి. సమాజంలో మనం ఎక్కడ ఉన్నాం.. ఏం ఆలోచిస్తున్నాం? అనేది ఆత్మావలోకనం చేసుకోవాలి. ముందుగా మనం మారాలి. మార్పు ఎలా కోరుకుంటున్నామో అలా మనం మారితే కచ్చితంగా మార్పు మన నుంచే మొదలవుతుంది అని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. ప్రజల కోసం నేను ముఠా కూలీలా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను సమాజాన్ని పూర్తిగా అర్థం చేసుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. నన్ను ప్రజల కోసం పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత నా అభిమానులదే. అమలాపురాన్ని ఐక్యంగా ఎ-వన్ నగరంగా తీర్చిదిద్దుదాం. కోనసీమలో కచ్చితంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిద్దాం. నా పర్యవేక్షణలో కార్యాలయం కోనసీమలో పెట్టేలా చర్యలు తీసుకుంటాను” అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ శెట్టిబత్తుల రాజబాబు పాల్గొన్నారు.
* శ్రీ పవన్ కళ్యాణ్ కి వెండి పూల దండ బహూకరణ
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో అమలాపురం మండలం సమనస గ్రామానికి చెందిన శ్రీ మామిడిపల్లి దొరబాబు 511 వెండి పూలతో తయారు చేయించిన ప్రత్యేక దండను శ్రీ పవన్ కళ్యాణ్ కి శుక్రవారం బహూకరించారు. గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి తీసుకువచ్చిన దండను శ్రీ పవన్ కళ్యాణ్ మెడలో వేశారు. ఆయనకు సకల శుభాలు కలుగాలని ఈ సందర్భంగా మామిడిపల్లి దొరబాబు కుటుంబం ఆకాంక్షించారు.