స్వేచ్ఛ… భద్రతలకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యం

కూటమి

• జగన్ కు ఓటేస్తే ప్రజల ఆస్తులన్నీ గాలిలో దీపాలై ఆరిపోతాయి
• 2019లో నేను హెచ్చరించినట్లే జగన్ పాలనలో భూ దోపిడీ జరిగింది
• జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు వెనుక భారీ కుట్ర
• ఈ చట్టం అమలు అయితే ప్రజలకు సొంత ఆస్తి అనేది ఉండదు
• ఉత్తరాంధ్రను క్రీడా హబ్ గా పంజాబ్ మాదిరి తీర్చిదిద్దుతాం
• మైనార్టీలు, మత్స్యకారుల అభ్యున్నతికి నాదీ భరోసా
• విశాఖ దక్షిణ నియోజకవర్గం వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్
నేను 2019 ఎన్నికల సమయంలోనే.. దూరదృష్టితో, జగన్ మానసిక స్థితిని అర్ధం చేసుకున్న వ్యక్తిగా రాష్ట్ర ప్రజలను హెచ్చరించాను. జగన్ గెలిస్తే కొండలు, గుట్టలు, స్థలాలు, భవనాలు అన్నీ కబ్జా చేస్తాడని చెప్పాను. 2019లో జగన్ గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు వైసీపీ పాలనలో అదే జరిగింది. జగన్ కొండలకు గుండు కొట్టించి సౌధాలు నిర్మిస్తే, అతడి అనుచరులు ప్రజల ఆస్తులను భయపెట్టి లాక్కుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సగటు మనుషులు నా దగ్గరకు వచ్చి వైసీపీ గుండాగిరి గురించి చెబుతుంటే ఏం చేయలేకపోతున్నామన్న వేదనే నన్ను కదిలించింది… వెంటాడింద’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. 2019లో ఎలా హెచ్చరించానో మరోసారి అదే తీరున ప్రజల్ని హెచ్చరిస్తున్నాను… జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు వెనుక ఇప్పుడు ప్రజల సొంత ఆస్తులను బలవంతంగా లాక్కోవాలనే కుట్ర ఉందని హెచ్చరిస్తున్నాను అన్నారు. జగన్ తీసుకొస్తున్న చట్టం అమలు అయితే ప్రజల ఆస్తులన్నీ గాలిలో దీపాల్లా ఆరిపోతాయని, ఇదో దుర్మార్గ చట్టం అని చెప్పారు. గురువారం విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని పూర్ణా మార్కెట్ సెంటర్లో జరిగిన వారాహి విజయభేరీ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకురావడం వెనుక పెద్ద దురుద్దేశం దాగుంది. ఓ ప్రణాళిక ప్రకారం ప్రజల ఆస్తుల మీద కన్నేశారని జాగ్రత్తగా గమనిస్తే అర్ధం అవుతుంది. మొదట జగన్ మన సొంత ఆస్తులకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల మీద అతడి బొమ్మ వేసుకున్నాడు. తర్వాత ప్రజల ఆస్తులకు సంబంధించిన సర్వే రాళ్ల మీద తన చిత్రాన్ని ముద్రించుకున్నాడు. తర్వాత ప్రజల ఆస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలకు కేవలం జిరాక్స్ మాత్రమే ఇస్తామని, ఒరిజినల్స్ ప్రభుత్వం వద్ద ఉంటాయని చెబుతున్నాడు. ఈ ప్రణాళికలో భాగంగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును తీసుకొచ్చి ప్రజల ఆస్తులన్ని కాజేసే కుట్రకు తెరలేపాడు. దీని వెనుక జగన్ భూ దాహం దాగుంది.
* జగన్ చట్టం జనం ఆస్తులకు నిప్పు పెడుతుంది
ఈ యాక్టు ప్రకారం మనకు అన్యాయం జరిగితే కోర్టులకు వెళ్లలేం. హైకోర్టుకు వెళితే ఎన్ని రోజులు అక్కడ తిరగాలో తెలీదు. మన మొర వినాల్సిన పోలీసులు జగన్ కిందనే పని చేస్తారు. ఇక చివరిగా రెవెన్యూ అధికారుల వద్ద ఆస్తులను సెటిల్ చేసుకునే పరిస్థితికి తీసుకొస్తారు. చట్టం ప్రజల సొంత ఆస్తులకు మెల్లగా నిప్పు పెడుతుంది. ఇది అమలైతే మన ఆస్తులు మనవి అని చెప్పుకోవడానికి కూడా ఏమీ ఉండదు. నేను 2019లో హెచ్చరించినట్లుగానే మరోసారి జగన్ తీరుపైనా హెచ్చరిస్తున్నాను. ఈ చట్టం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. మన సొంత ఇంట్లోనే మనం కానివాళ్లం అయిపోతాం .. మన సొంత భూమే మనది కానిది అయిపోతుంది. దీనిపై ఆలోచించండి. ఇంతటి అరాచక పాలనకు తెరదించి, అంతా సిద్ధమై వైసీపీని బంగాళాఖాతంలో కలపాల్సిన సమయం వచ్చేసింది.
* మనిషికి స్వేచ్ఛ, భద్రత ప్రధానం
మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రతి అంశం కూటమి ప్రభుత్వంలో అమలు చేస్తాం. అంతకంటే ముందు వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల స్వేచ్ఛ, భద్రత అనేవి గాలిలో కలిసిపోయాయి. మనిషికి ఎంత ధనం ఉన్నా, ఎంత పరపతి ఉన్నా స్వేచ్ఛ లేని బతుకు చావుతో సమానం అవుతుంది. అలాగే మహిళల భద్రతను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఇటీవల బోటు ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వడానికి వచ్చినపుడు మహిళలంతా కలిసి కొందరు యువకులు మమ్మల్ని వేధిస్తున్నారని చెబుతున్నారు. గంజాయి మత్తులో మహిళలపై వేధింపులు పెరిగాయి. ఇక వైజాగ్ లో జనవాణి నిర్వహించడానికి వచ్చిన నాకే స్వేచ్ఛ లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. ప్రాథమిక హక్కులు వైసీపీ పాలనలో పూర్తిగా కాలరాశారు. వారు చెప్పిందే వేదం.. వైసీపీ నాయకులు చేసిందే చట్టం అనే స్థాయిలో పాలన సాగింది. వ్యక్తిగత స్వేచ్ఛ పూర్తిగా పోయింది. కూటమి ప్రభుత్వంలో పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, భద్రత కల్పించేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం. ఓ గూండా మనల్ని పరిపాలిస్తున్నాడని ఎక్కడికీ పారిపోలేం. ఈ నేల మనది. కష్టం వస్తే అంతా ఏకమై పోరాడాలి. నేను సమాజంలోని భయాన్ని ఇష్టపడే వ్యక్తిని కాదు. తప్పు జరిగితే సమాజం అంతా దాన్ని ఖండించాలి. బాధితులకు అండగా నిలవాలి. రాష్ట్ర ప్రజలు దీనిపై చైతన్యవంతులు కావాలి. నేను మీ గుండెల్లో అలాంటి చైతన్య రవళి నింపేందుకే వచ్చాను.
* ప్రజల్ని రక్షించలేని అధికారులు ఎందుకు?
ప్రజా ధనం నుంచి జీతాలు తీసుకుంటూ ప్రజల్నే వేధించే అధికారులు మనకు ఎందుకు..? ప్రజల జీవితాలకు రక్షణ కల్పించలేక, రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయని అధికారులు ఎందుకు పనిచేస్తున్నట్లు..? వారే ఆలోచించాలి. ఐఏఎస్, గ్రూప్ – 1 అధికారులూ.. జగన్ లాంటి వాడికి జీ హుజూర్ అనడానికి మీరు లేరు. ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి, వారి హక్కుల రక్షణకు అధికారులున్నారు. దీన్ని గుర్తుంచుకోవాలి. దీనికోసం ప్రజా సమూహం కూడా ఓటును నిర్భయంగా వేసి, స్ఫూర్తిని చాటాలి. భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాలి. కేవలం ఒక రోజు హాలీడే అనుకోకుండా అందరిలో చైతన్యం రావాలి. రాష్ట్రం కోసం వేసే ఓటుగా దీన్ని గుర్తించండి. మనందరిలో వచ్చే ఓటు చైతన్యమే రాష్ట్రానికి దిశదిశా చూపించే గొప్ప మార్గం అవుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
* వైసీపీని ప్రజలంతా తుంగలో తొక్కడానికి సిద్ధం
రాష్ట్రంలో 30 వేల మందికి పైగా మహిళలు అదృశ్యం అయ్యారని తెలిస్తే కనీసం సమీక్షించడానికి సీఎంకు తీరిక లేదు. గంజాయి రవాణాలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిస్తే దాన్ని అరికట్టే మార్గాలపై సమావేశం లేదు. మరి మీకెందుకు 151 స్థానాలు ఇచ్చి ప్రజలు మిమ్మిల్ని గద్దెను ఎక్కించింది..? మీరు రాజ్యాలు చేయడానికా..? ప్రజలను బానిసల్లా ఉంచడానికా..? మీ రౌడీలు ప్రజల్ని భయపెట్టడానికా..? వైసీపీ రౌడీలు మహిళలు, సగటు మనుషుల జోలికి వెళ్తున్నారు. ఇదే కొనసాగితే ప్రతి వైసీపీ గూండాలకు చెబుతున్నాం. తోలు తీసి జగదాంబ సెంటర్లో కూర్చొబెడతాం జాగ్రత్త. జగన్ లాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుంటే భావితరాలకు ఏమని సమాధానం చెబుతాం. జగన్ తాతల దగ్గర నుంచి బైరెటీస్ గనులను లాక్కున్నారు… జగన్ శివశివానీ స్కూల్లో పేపర్ లీకేజీలు చేశారని చెబుతామా..? వచ్చే తరాలు కూడా అలా తయారు కావాలని నేర్పుతామా ఆలోచించండి. 30 వేల మంది మహిళలు అదృశ్యం అయితే కనీసం వారి కన్నీరు తుడవని జగన్ లాంటి వాళ్లకి అధికారం ఎందుకు..? కష్టం వస్తే పలకరింపు లేని పాలన ఎందుకు..? ఇలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని తుంగలో తొక్కడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.
* జగన్ కు భూమిని తొలిచి డబ్బు తీయడం మాత్రమే తెలుసు
భూమిని తొలిచి డబ్బు తీయడమే జగన్ కు తెలిసిన విద్య. అదే భూమిలో ఓ విత్తనం నాటితే పది మందికి కడుపు నింపుతుంది.. లేదా పదిమందికి చల్లని నీడను ఇస్తుందన్న ఆలోచన ఉండని వ్యక్తి. విత్తనం వేసి పంట పడించడం తెలీదు కాని… అదే భూమిని అమ్ముకొని డబ్బు చేసుకోవడం బాగా తెలుసు. మరోసారి జగన్ ను భరించడానికి రాష్ట్ర ప్రజలెవరూ సిద్ధంగా లేరని ప్రజల స్పందనను చూస్తేనే అర్ధం అవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు చాలామంది మన పార్టీని బలోపేతం చేసుకునేందుకు సమయం దొరికందని సలహాలు ఇచ్చారు. అయితే నేను మాత్రం రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలంటే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా జగన్ ను మళ్లీ రానివ్వకూడదు అంటే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. దీనికి బీజేపీ ఆశీర్వాదం లభించడం ఆనందం కలిగించింది. విశాఖ సముద్రాన్ని కాలుష్యం బారి నుంచి బయటపడేయాలి. ముఖ్యంగా ఇక్కడున్న పారిశ్రామిక కాలుష్యం నుంచి బయటపడేయాలి. సముద్రం మన సంపద. దాన్ని పరిరక్షించుకుందాం. నాకు ఓడిపోయినప్పుడు బాధ కలగలేదు కాని… ప్రజల నుంచి వచ్చే సమస్యలు విన్నపుడు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసినపుడు అయ్యో మనం ప్రజల కోసం అసెంబ్లీలో లేకపోయాం.. వారి గురించి పోరాడలేకపోయాం అనే బాధ నన్ను నిలువునా దహించివేసింది. మనందరి అనైక్యతే జగన్ బలం. మత్స్యకారుల బోట్లు కాలిపోతే ఓ మనిషిగా స్పందించి ఒక్కొక్కరికీ రూ.50 వేల సహాయం అందించాను. దాన్ని కూడా తీసుకోవద్దని బెదిరించిన వ్యక్తి జగన్. జనవాణి కోసం వస్తే వైసీపీ నాయకులు పోలీసుల సాయంతో సాగించిన అరాచకానికి విశాఖపట్నం అంతా నాకు తోడై నిలిచింది. మూడు సంవత్సరాల బిడ్డను ఒడిలో పెట్టుకొని ఓ మహిళ రాత్రంతా నా కోసం ఉందంటే ఇక్కడి వారు నా కోసం నిలబడే తీరు నా కళ్లలో నీళ్లు తెప్పించింది. మత్స్యకారులు, మహిళల భద్రతకు తగిన ప్రాధాన్యం ఇస్తాం.
* ఎవడి పాపానికి వాడు పోడు.. మనమే వాడిని సాగనంపాలి
ఉత్తరాంధ్ర యువతలో సముద్రమంత బలమైన శక్తి ఉంది. వారు ఏదైనా సాధించగలరు. ఇక్కడ క్రీడాకారులు, సైనికులు అధికం. అలాంటి విశాఖను అత్యత్తమ క్రీడా గ్రామం చేయాలి. కేంద్రం సహకారం తీసుకొని విశాఖను క్రీడలకు హబ్ గా తయారు చేస్తాం. శ్రీమతి కరణం మల్లేశ్వరీ, శ్రీ కోడి రామ్మూర్తి వంటి క్రీడా దిగ్గజాలు పుట్టిన ఉత్తరాంధ్ర ముఖద్వారం అయిన విశాఖను పంజాబ్ మాదిరిగా ఓ చక్కటి క్రీడా గ్రామం చేస్తాం. దీనిపై ఓ ప్రణాళికతో ముందుకు వెళ్తాం. ఇక్కడి పరిశ్రమల్లో కాలుష్యం లేకుండా చూసే బాధ్యతను తీసుకుంటాం. ఎప్పటికప్పుడు కాలుష్య తనిఖీలు చేసేలా బాధ్యత తీసుకుంటాం. విశాఖ పచ్చదనం మరింత పెంపొందేలా, ఇక్కడి సామాన్యులకు మరింత బతుకు భద్రత ఇచ్చేలా చూస్తాం. యువతను ముఖ్యంగా నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతాం. వారిలో దాగున్న ప్రతిభను బయటకు తీసి, అద్భుతమైన ఎంటర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దుతాం. వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు పాపం చేశారని మనకు తెలిసినా పోనిలే వాళ్ల పాపాన వాళ్లే పోతారని అనుకుంటాం. ఇక్కడ ఎవడి పాపాన వాడు పోడు. మనమే వాళ్లని సమాజం నుంచి సాగనంపాలి. దైవం మానుష్య రూపేణా అన్నట్లు సమాజానికి మంచి చేయడానికి, సమాజంలో ఉన్న తప్పులను సరిజేయడానికి దేవుడు ఓ రాముడు, ఓ కృష్ణుడి రూపంలో మనిషిగానే వచ్చాడు. ఇక్కడ మనకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడటానికి, వాటి నుంచి రక్షించుకోవడానికి మనమే ముందడుగు వేయాలి. తప్పు చేసిన వాడికి ఎప్పటికీ బుద్ధి రాదు.. వాళ్లు మారరు. అలాంటి వారిని జనమంతా కలిసి సమూహంగా మారి బంగాళాఖాతంలో కలపాలి. ఏ సమస్య అయినా, విప్లవమైనా ఒకడు తలుచుకుంటేనే మార్పు మొదలు అవుతుంది. ఆ ఒక్కడు మీరే కావాలి. ఇంత మంది యువతలో అది మీరు అవ్వాలి. వైసీపీ హక్కులను పూర్తిగా కాలరాసింది. వైసీపీ ఎంపీ భార్య, పిల్లలు కిడ్నాప్ అయితేనే రక్షించుకోలేని స్థితిలో శాంతిభద్రతలు నిర్వీర్యం అయ్యాయి. నాయకుడికి ఓటమి రుచి తెలియాలి. దాని నుంచి నేర్చుకోవాలి. నేను దశాబ్దం పాటు ప్రజల కష్టాలు, కన్నీళ్లు విని రాజకీయంగా నాకు నేనే శిక్షణ ఇచ్చుకొని మరీ ఇప్పుడు ప్రజల ముందు నిలిచాను. మీ ప్రతి కష్టం నాకు తెలుసు. ప్రజల కన్నీరు నాకు తెలుసు. వైసీపీ చంపేసిన ప్రాథమిక హక్కులను పునరుద్ధరించేందుకు పోరాటం చేద్దాం. వాటిని ఎవరో ఇవ్వరు.. మనమే పోరాడి తెచ్చుకోవాలి. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారు మన నేలలోకి వచ్చి జులం ప్రదర్శించడం కాదు.. మన నేలను మనమే సంరక్షించుకుందాం. ఓ నాయకుడు ఓ తరం గురించి ఆలోచించాలి. అలా ఆలోచించే నేను రాజకీయాల్లోకి వచ్చాను.
* మత్స్యకారులు, మైనార్టీలు నా కుటుంబ సభ్యులే
జగన్ గత ఎన్నికల్లో మైనార్టీల కోసం ఇస్లామిక్ బ్యాంకు అని మోసం చేశాడు. పండగలకు తోఫాలను తీసేశాడు. మైనార్టీ కార్పొరేషన్ రుణాలను తొలగించాడు. విద్యార్థులకు ఇచ్చే రూ.5 వేల సాయాన్ని ఆపేశాడు. షాదీ తోఫాను నిలిపేశాడు. మైనార్టీలకు ఏ చిన్న సాయం చేయలేదు. కూటమి ప్రభుత్వంలో మైనార్టీలకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా దానిని సరిజేసే బాధ్యత నేను తీసుకుంటాను. మైనార్టీలకు తగిన భరోసాను ఉమ్మడి మేనిఫెస్టోలో కల్పించాం. ఇక మత్స్యకారుల విషయంలో జగన్ చేసిన ద్రోహం అంతాఇంతా కాదు. గంగవరం పోర్టులో వాటా అమ్ముకున్నాడు. హార్బర్ ల నిర్మాణం సాగరంలో కలిసిపోయింది. మత్స్యకారుల జీవనాన్ని ప్రభావితం చేసేలా జీవో 217 తెచ్చాడు. నేను మైనార్టీలను, మత్స్యకారులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. గంగస్నానంతో నా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన వాడిని. అలాగే రెల్లికులాన్ని స్వీకరించిన వాడిని. నాకు అన్ని కులాలు, మతాలు ఒక్కటే. అందరికీ సమ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను. అలాగే కేంద్రం కల్పించిన ఈబీసీ రిజర్వేషన్లను అగ్రకుల పేదలకు సమానంగా, దామాషా పద్ధతిలో అందిస్తాం. వారికి తగిన చేయూతను అందిస్తాం. విశాఖలో జరిగిన భూ అక్రమాలపై కమిషన్ ను నియమిస్తాం. రాజీ లేకుండా జరిగిన ప్రతి అక్రమాన్ని బయటపెట్టి, బాధితులకు తగిన న్యాయం చేస్తాం. కాలానికి తగిన శక్తి ఉందని బలంగా నమ్ముతాను. మానవ హక్కులను హరించే విషయంలో ఎవరైనా ఒక్కటే. వాటి పరిరక్షణ కోసం చిత్తశుద్ధిగా పని చేస్తాను. విశాఖ ఎంపీ కూటమి అభ్యర్థిగా శ్రీ భరత్ గారికి సైకిల్ గుర్తుపై, విశాఖ దక్షిణం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారికి గాజు గ్లాసు గుర్తుపై, గాజువాక కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి సైకిల్ గుర్తుపై, ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి కమలం పువ్వు గుర్తుపై, తూర్పు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారికి సైకిల్ గుర్తుపై, పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న శ్రీ గణబాబు గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి, కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలి’’ అని కోరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్