సురక్ష ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యం

ఆంధ్రప్రదేశ్

* బయటకు వెళ్లిన ఆడబిడ్డ క్షేమంగా ఇంటికి రావాలి
* క్రిమినల్ రాజ్యం ఏలితే శాంతిభద్రతలు క్షీణిస్తాయి
* సాక్షాత్తూ ఎంపీ కుటుంబానికే రాష్ట్రంలో రక్షణ లేదు
* ఆడబిడ్డల చల్లని దీవెనలు ఉంటే జనసేన జయకేతనం ఎగరేస్తుంది
* కాకినాడ రూరల్, అర్బన్ నియోజక వర్గాల వీరమహిళల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు  శ్రీ పవన్ కళ్యాణ్

            ‘ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడబిడ్డ మళ్లీ క్షేమంగా ఇంటికి చేరాలి. తనకు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా చెప్పుకోవాలి. తన హక్కుల కోసం గొంతెత్తాలి. అలాంటి సమాజ నిర్మాణ కోసమే జనసేన పార్టీ పోరాటం చేస్తుంద’ని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయాలు అంటే వేలకోట్ల డబ్బు, నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం, అరుపులు, కేకలుగా మారిపోయాయి… ఆ ఆలోచనను ప్రజల మనసు నుంచి మార్చాలనే జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది అన్నారు. ఒక సిద్ధాంతం కోసం మనం బలంగా నిలబడితే అది జరిగి తీరుతుందని తెలిపారు. వారాహి విజయయాత్రలో భాగంగా సోమవారం కాకినాడలో వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “క్రిమినల్ పాలించడం అన్నా రాజ్యం ఏలినా నాకు చిరాకు. కులాలు, వర్గాలుగా మనల్ని విడగొట్టి వాళ్లు రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. ఎదురు తిరిగి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ వైసీపీ నాయకులు ఎంత నీచానికి దిగజారారు అంటే ఎస్సీల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు పెడుతున్నారు. బతికినంత కాలం వీళ్ల కాళ్ల దగ్గర అణిగిమణిగి ఉండాలని అనుకుంటున్నారు.
* ప్రజా ప్రతినిధుల కుటుంబానికే రక్షణ లేదు
         బాపట్లలో 14 ఏళ్ల బాలుడు తన అక్కను వేధిస్తున్నాడని వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తిని నిలదీస్తే, ఆ వెంకటేశ్వరరెడ్డి ఆ బాలుడిని పెట్రోలు పోసి తగులబెట్టాడు. ఆ అబ్బాయిని చూస్తే నాకు నేను గుర్తొచ్చాను. చిన్నప్పుడు మా అక్కను కామెంట్ చేస్తుంటే నాకు వాళ్లను చంపేయాలన్నంత కోపం వచ్చింది. విశాఖపట్నంలో సాక్షాత్తు ఓ ఎంపీ కుటుంబానికే రక్షణ లేకుండా పోయింది. డబ్బుల కోసం కిడ్నాప్ చేశారు. ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మన ఆంధ్ర ప్రాంతంలో అన్యాయం జరిగితే బయటకైనా వస్తుంది. అదే రాయలసీమలో అయితే గొంతెత్తే పరిస్థితి కూడా లేదు. ముందు మనం బలంగా ఉన్న ప్రాంతంలో పోరాటం చేయాలి. తరువాత దానంతట అదే విస్తరిస్తుంది. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఉన్నపుడు ఓ ఆడబిడ్డ తన సమస్యను చెప్పుకోవాడానికి వచ్చింది. తాడేపల్లిలో నివసించే ఆ బిడ్డ ఇంటిని సీఎం భద్రత కోసమని కొట్టేశారు. సరైన పరిహారం ఇవ్వలేదు. దీని గురించి నేను మాట్లాడతానని హామీ ఇచ్చిన తర్వాత మళ్లీ అదే ఆడబిడ్డ వారం రోజులకు మళ్లీ పార్టీ కార్యాలయం వద్ద కనిపించింది. ఏమైందని అడిగితే ఆ అమ్మాయి చెప్పే విషయాలు నాకే కన్నీళ్లు తెప్పించాయి. నన్ను కలిసి, వినతిపత్రం ఇచ్చిన తర్వాత నుంచి వైసీపీ నాయకులు వేధించడం మొదలుపెట్టారు. మార్కెట్ కు వెళ్లిన తన అన్నను చంపి ఆటోలో శవంగా తీసుకొచ్చి ఇంటి ముందు పడేశారు. నన్ను కలిశారు అన్న ఒకే కారణంతో ఆ కుటుంబాన్ని వైసీపీ నాయకులు సర్వనాశనం చేశారు. ఆ ఆడబిడ్డ ఆవేదన చూశాకే జనవాణి కార్యక్రమం ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది.
* రాజకీయాల్లో ఎదగాలి అనుకుంటే ఏనాడో ఎదిగేవాడిని
         రాజకీయాల్లో ఎదగాలి అనుకుంటే నాకున్న ప్రజాదరణ, రాజకీయ స్నేహాలతో ఏనాడో ఎదిగేవాడిని. ఎంపీగానో, మంత్రిగానో పదవులు అనుభవించేవాడిని. సమాజయంలో మార్పు, పరివర్తన తీసుకురావాలని పోరాటం చేస్తున్నాను. దానికి కొంత సమయం పడుతుంది. శ్రీ మాయవతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆమె కాళ్లను మొక్కాను. దీనిపై కొంతమంది విమర్శలు కూడా చేశారు. గూండాలు, రౌడీలు, కిరాయి మూకలతో నిండిపోయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలకు ఓర్చి ఆమె ఒంటరిగా పోరాటం చేశారు. చివరకు ఆమె ముఖ్యమంత్రి అయ్యాక కొంతమంది గూండాలు, రౌడీలు రాష్ట్రం వదిలిపారిపోతే… మరికొంతమంది బాత్ రూమ్స్ లో దాక్కున్నారు. ఆనాడు ఆమె చూపించిన పోరాట పటిమకు నేను నమస్కరించాను.
* వెనక్కి తగ్గడం అంటే పిరికితనం కాదు
శివాజి మహారాజ్ వంటి పోరాట యోధుడే అనువుగాని చోట వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రత్యర్థి మనకంటే బలవంతుడైనప్పుడు కాస్త వెనక్కి తగ్గి పోరాటం చేయడం మంచిది. వెనక్కి తగ్గినంత మాత్రాన పిరికితనం కాదు. సమయానుకూలంగా ఆలోచించి ఒక్క అడుగు వెనక్కి వేస్తే తరువాత వందడుగులు ముందుకు పడతాయి. రండి.. పోరాటం చేయండి అని మహిళలకు ఏనాడు చెప్పను. వారి జీవితాలను రిస్క్ లో పెట్టను. స్ర్తీలను రక్షించుకోవడం ప్రధాన కర్తవ్యం. పార్టీ కోసం మీకు ఎంత వీలైతే అంతే చేయండి. పార్టీ గెలుపు కోసం మీ చల్లని దీవెనలు ఇవ్వండి చాలు” అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్