* చేనేత ముడి సరకుపై రాయితీ ఇస్తాం
* పట్టు రైతులకు గిట్టుబాట ధర అందేలా చర్యలు తీసుకుంటాం
* మూడున్నరేళ్లలో ముచ్చటైన ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాం
* జనసేన ప్రభుత్వంలో అన్ని వర్గాలకు తగు ప్రాధాన్యం
* చేబ్రోలులో పట్టురైతులు, చేనేత కళాకారులతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
జనసేన పార్టీకి ప్రభుత్వం స్థాపించగలిగే బలం ఇస్తే మూడున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు తీసుకొస్తామని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోయారు… ఒక్కసారి నిజాయతీపరుల మాటలు నమ్మి అవకాశం ఇస్తే ఉప్పాడ ప్రాంతాన్ని సిల్క్ సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చేబ్రోలులో పట్టు మార్కెటింగ్ యార్డు ఏర్పాటు చేయడంతోపాటు, చేనేత ముడి సరకుపై వీలైనంత రాయితీ ఇస్తాం. గురువారం చేబ్రోలులో పట్టు రైతులు, చేనేత కళాకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “మూడేళ్లుగా పట్టు గూళ్లు ఉత్పత్తి చేస్తున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు రావడం లేదు.పట్టు పురుగులు పెంచే షెడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకంలో అందించే రాయితీ సొమ్మూ రెండేళ్లుగా అందడం లేదు. పట్టు గూళ్లు పండించే రైతులకు ప్రోత్సాహకం కేజీ రూ. 50 కాదు రూ. 100 ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదు. ఇకపై నిలబెట్టుకుంటాడనే నమ్మకం లేదు. నేను ఈ ముఖ్యమంత్రి మాదిరి అధికారం కోసం నోటికొచ్చిన హామీ ఇచ్చి, తర్వాత మాట తప్పే వాడిని కాదు. అన్నీ ఆలోచించి, పరిశీలించిన తర్వాతే మాట ఇస్తాను. ప్రాణం పోయినా దానికి కట్టుబడి ఉంటాను. రైతులు, ప్రజలను నేను కోరేదొక్కటే… ఒక్కసారి జనసేన వైపు చూడండి. మమ్మల్ని నమ్మి ఓట్లేయండి. కచ్చితంగా పట్టు రైతులకు గిట్టుబాటు ధర, నేతన్నల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందేలా చూస్తాం. ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేయాలో ఓ నిర్దుష్టమైన విధానాన్ని తీసుకొస్తాం. రెండు వర్గాల ప్రజలు లాభాల పొందే విధానాన్ని తీసుకొస్తాం. చేనేత కళాకారులు బతుకులు బాగు చేసే పాలసీలకు జనసేన కట్టుబడి ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ అమ్మకాలను ప్రొత్సహించే ఏర్పాటు చేస్తాం.
* మేము వస్తేనే డబ్బులు వేస్తారా?
మూడేళ్లుగా పట్టు గూళ్లు ఉత్పత్తి చేస్తున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందలేదు. మేము వస్తున్నామని తెలియగానే రూ. 7 కోట్లు విడుదల చేస్తాం అని నోటి మాటగా చెబుతున్నారు. నేటి సమావేశం రద్దు చేసుకోవాలని అధికారులు రైతుల్ని, చేనేత కళాకారులని కోరుతున్నారు. సమావేశానికి వెళ్లకండి అని రైతులకు చెబుతున్నారు. మేము వస్తున్నామంటనే రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తారు.. మేము వస్తున్నామని తెలిస్తేనే విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తారు.. మేము వస్తున్నామంటేనే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తారు. ఏం మేము రాకపోతే ప్రోత్సాహకాలు ఇవ్వరా? ఇప్పటికైనా అర్ధం చేసుకోండి నిజాయతీపరులంటే ఈ దుష్టప్రభుత్వానికి ఎంత భయామో. జనసేన పార్టీకి నిజంగా చట్టసభల్లో ప్రతినిధులు ఉంటే రైతులకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నా విన్నపం ఏంటంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆలోచించి ఓట్లు వేయండి. ఈ ముఖ్యమంత్రి లాగా తన సొంత సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టకుండా దామాషా పద్దతిలో అందిరికీ పదవులు ఇస్తాం. అన్ని కులాల వారిని చట్ట సభలకు తీసుకెళ్లి గొంతు వినిపిస్తాం.
* ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో రెట్టింపు లాక్కుంటున్నారు..
నేస్తం పేరుతో చేనేత కళాకారులకు ఏడాదికి రూ. 24 వేలు ఇస్తున్నారు. మరోవైపు ముడిసరకు ధరలు పెంచి లాగేసుకుంటున్నారు. అలాగే అమ్మఒడి పేరుతో డబ్బులు ఇస్తున్నట్లే ఇచ్చి నాన్న తడి పేరుతో జేబులు గుల్ల చేస్తున్నారు. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ రెడ్డి… ఇవాళ రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారేలా విధానాలు తీసుకొచ్చారు. దళితుల మేనమామ అని చెప్పి విదేశీ విద్య పథకంలో అంబేద్కర్ పేరు తొలగించారు. ఒక్క పదేళ్లు జనసేన పార్టీకి అధికారం ఇవ్వండి. రాజకీయాలకు విలువలు తీసుకొస్తాం. జవాబుదారీతనం తీసుకొస్తాం” అన్నారు.
* శ్రీ పవన్ కళ్యాణ్ వస్తేగాని ప్రభుత్వంలో కదలిక రాదా?
చేబ్రోలుకు చెందిన పట్టు రైతులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పాదయాత్రలో ఉండగా పట్టు రైతులకిచ్చే ఇన్సెంటివ్స్ రూ. 50 సరిపోదు దాన్ని రూ.100కి పెంచుతామన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ 50 కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం రెండేళ్లుగా పట్టు రైతుల్ని పట్టించుకోవడం లేదు. ఇన్సెంటివ్స్ లక్షల్లో బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని రాత్రికి రాత్రి కాకినాడ నుంచి డీడీ ఫోన్ చేసి రెండు రోజుల్లో బకాయిలు మొత్తం క్లియర్ చేస్తాం. మీటింగ్ కి వెళ్లొద్దని చెప్పారు. శ్రీ పవన్ కళ్యాణ్ వస్తే గాని ప్రభుత్వంలో కదలిక రాదా? మార్కెటింగ్ సదుపాయం లేక 800 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లి అమ్ముకుంటున్నాం. జనసేన ప్రభుత్వంలో పట్టు రైతులకు అదనపు ఇన్సెంటివ్ ఇవ్వండి. గిట్టుబాటు ధర కల్పించాలని శ్రీ పవన్ కళ్యాణ్ ని కోరారు.
* చేనేతలపై జీఎస్టీ తీసేయాలి – చేనేత కళాకారులు
రాను రాను చేనేత పరిశ్రమ కంటుబడే పరిస్థితి దాపురిస్తోంది. ఉప్పాడ పట్టు చీరలకు ప్రత్యేక మైన ట్రేడ్ మార్క్ ఉంది. అయితే పవర్ లూమ్స్ కారణంగా ఉప్పాడ చేనేతలకు మనుగడ ప్రమాదంలో పడింది. ఉప్పాడ డిజైన్ చీరలు పవర్ లూమ్స్ మీద తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలి. చేనేత వస్త్రాలు, చేనేత వస్త్రాల తయారికి అవసరం అయిన ముడి పదార్ధాలపై జీఎస్టీ తొలగించాలి. ప్రభుత్వమే సొంతంగా ఈకామర్స్ సైట్ ఏర్పాటు చేసి నేరుగా చేనేతకు చేయూత ఇవ్వాలి అని పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు చేనేత కళాకారులు శ్రీ పవన్ కళ్యాణ్ కి విన్నవించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పార్టీ నేతలు శ్రీ షేక్ రియాజ్, శ్రీమతి మాకినీడు శేషు కుమారి తదితరులు పాల్గొన్నారు. చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ సమన్వయకర్తగా వ్యవహరించారు.