రాయలసీమలో ప్రజా తిరుగుబాటు మొదలయ్యింది

రాయలసీమ

• ఆ తిరుగుబాటు జగన్ ని ఇంటికి పంపడం ఖాయం
• వైసీపీ పాపాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయి
• అధికార మదంతో ఇష్టానుసారం రాజకీయాలు చేస్తున్నారు
• అన్నమయ్య డ్యాం కూల్చారు.. రాజంపేట జిల్లా కేంద్రం రాకుండా చేశారు
• అరాచక శక్తులను ఎదుర్కొనేందుకు మేము సిద్ధం
• వైసీపీని చిత్తుగా ఓడించేందుకు ప్రజలూ సిద్ధం కావాలి
• రాజంపేట ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు
‘పాలకులు ప్రజాభిప్రాయం మేరకు పరిపాలించకపోతే ప్రజా తిరుగుబాటు ఎదుర్కోక తప్పదు. వైసీపీ ప్రభుత్వం అధికారమదంతో ఇష్టానుసారం రాజకీయం చేస్తోంది. అందుకే రాయలసీమ ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభం అయింద’ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలోనూ కూటమి అన్ని సీట్లు గెలవబోతోందని, వైసీపీ డ్రామా కంపెనీ మూతబడుతుందని అన్నారు. అన్నమయ్య డ్యాం పాపం అమర్నాథ్ రెడ్డిది అయితే, పింఛా డ్యాం పాపం పెద్దిరెడ్డిదన్నారు. జిల్లా తరలింపు వెనుకా ఆ పెద్దిరెడ్డే ఉన్నాడు. వైసీపీ పాపాలు పెరిగిపోయి సమాజాన్ని నాశనం చేసే స్థాయికి చేరాయన్నారు. మరోసారి వీరికి ఓటు వేస్తే ప్రజల జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోతాయని తెలిపారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేట ప్రజాగళం సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ..
• ఆన్ లైన్లో ఆస్తిని కాజేసి ఆడ బిడ్డను అనాధను చేశారు
రాష్ట్రంలో అరాచక శక్తులు పెరిగిపోయాయి. ఈ అరాచక శక్తులతో తాడోపేడో తేల్చుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను నాలుగు రోజులు రాష్ట్రంలో కలసి పర్యటించాం. ఈ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో మొదలైన తిరుగుబాటు చూసాక జగన్ ని ఇంటికి పంపడం ఖాయం. లేదంటే ఈ వైసీపీ అరాచకాలకు అంతూ పొంతూ ఉండదు. వైసీపీ నాయకులు ఆన్ లైన్లో ఆస్తిని కాజేసి ఈ ఆడబిడ్డను అనాధను చేశారు. ఈ లక్ష్మీప్రసన్న తండ్రి శ్రీ సుబ్బారావు పద్మశాలి. చేనేత కుటుంబం. అప్పుల పాలై ఉన్న భూమిని అమ్ముకొని బిడ్డల్ని చదివించాలనుకున్నాడు. వైసీపీ నాయకులు ఆన్ లైన్లో ఆయన ఆస్తిని రాసేసుకున్నారు. అధికారుల చుట్టూ తిరిగి పని జరగకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. అది తెలిసి భార్య, ఓ కుమార్తె విషం తాగి చనిపోయారు. ఈ బిడ్డ మాత్రం హైదరాబాద్ లో ఉండి బతికిపోయింది. విషయం తెలిసిన వెంటనే పార్టీ నుంచి రూ.5 లక్షల సాయం అందించాం. ఈ అమ్మాయి బాధ్యత మాది. ఉద్యోగం ఇప్పించి జీవితంలో స్థిరపడే ఏర్పాటు చేస్తాం. వైసీపీ పాపాలు సమాజాన్ని నాశనం చేసే స్థాయికి వెళ్లాయి. అలాంటి వైసీపీకి ఓటు వేస్తే మనమంతా ఏమవుతామో ఆలోచించుకోవాలి.
• దుర్మార్గ పాలనను ఉపేక్షించి లాభం లేదు
నాలుగు రోజుల క్రితం రాష్ట్రంలో ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియచేసేందుకు కోవూరు లక్ష్మి ఢిల్లీ వెళ్లి ఇండియా గేట్ వద్ద వేలు కోసుకున్న పరిస్థితి. మీ జీవితాలు బాగుపడాలంటే ఇక్కడ మిథున్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి చిత్తుగా ఓడాలి. ఇలాంటి దుర్మార్గులను ఉపేక్షించి లాభం లేదు. వైసీపీ అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా రాకూడదు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసిన వ్యక్తి జగన్. డ్యాం కొట్టుకుపోయిన తర్వాత బాధితులకు న్యాయం చేసింది లేదు. డ్యాం కొట్టుకుపోయి 40 మంది చనిపోతే, ఆ కుటుంబాలను మేము ఆదుకున్నాం. లష్కర్ రామయ్యకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. 2 లక్షలు ఇస్తే, బాధిత కుటుంబాలకు ఎన్డీఆర్ ట్రస్ట్ నుంచి రూ. లక్ష చొప్పున మేము సాయం చేశాం. ఈ ముఖ్యమంత్రి కనీసం ఇళ్లు కూడా కట్టించలేదు. కూలిన అన్నమయ్య డ్యాం కట్టలేని ఈ వ్యక్తి మూడు రాజధానులు కడతాడంట.
• రాజంపేట నుంచి జిల్లా పోవడానికి పాపాల పెద్దిరెడ్డే కారణం
రాష్ట్రం బాగుండాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. యువత బాగుండాలంటే కూటమి అధికారంలోకి రావాలి. మేము అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ మీద పెడతాం. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం. నిరుద్యోగ భృతి ఇస్తాం. అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేస్తాం. బాధితులకు నష్టపరిహారం అందించి పూర్తి స్థాయి పునరావాసం ఏర్పాటు చేస్తాం. రైతులకు ఏడాదికి రూ. 20 వేలు ఆసరా ఇస్తాం. మద్యపాన నిషేధం అని చెప్పిన వ్యక్తి క్వార్టర్ మీద రూ. 140 పెంచేశాడు. ఆ పెరిగిన మద్యం ఆదాయం మొత్తం పాపాల పెద్దిరెడ్డి ద్వారా జగన్ రెడ్డి జేబుల్లోకి పోయింది. విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, నిత్యవసరాల ధరలు పెరిగాయి. ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. ఈ ప్రభుత్వంలో అన్ని ధరలు పెంచేశారు. ప్రజలను సమస్యల్లోకి నెట్టారు. ఇలాంటి వ్యక్తులను చిత్తు చిత్తుగా ఓడించాలి. జిల్లా కేంద్రం వ్యవహారంలో రాజంపేటకు అన్యాయం జరిగింది. జిల్లా తరలిపోవడానికి పాపాల పెద్దిరెడ్డే కారణం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జిల్లా వ్యవహారంలో రాజంపేటకు జరిగిన అన్యాయాన్ని సమీక్షిస్తాం. రాజంపేటకు జిల్లా కేంద్రం కావాలి, రాయచోటికి అన్యాయం జరగకూడదు. మదనపల్లి ప్రజల అభీష్టం ఏంటో తెలుసుకుంటాం. మూడు ప్రాంతాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. రాజంపేటను జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేసి మెడికల్ కాలేజీ ఇస్తాం. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేస్తాం. మాచపల్లి బ్రిడ్జి పూర్తి చేస్తాం. ఓబిలి, టంగుటూరు హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తాం. ఝరికోన నుంచి సుండుపల్లి మండలానికి నీరిస్తాం. గాలేరు, నగరి కాలువలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అది పూర్తయితే ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తాయి. విభజన తర్వాత ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేశాం. మరింత చేస్తాం. ఈ సారి సూపర్ సిక్స్ తో వస్తున్నాం. యువతకు యువగళం, ఆడబిడ్డలకు మహా శక్తి పథకాలు తెస్తున్నాం. పేదవారికి స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తాం. పింఛన్లు రూ. 4 వేలకు పెంచి ఇంటివద్దే ఇస్తాం. ప్రతిపక్షంలో ఉన్నారని పించన్లు కోల్పోయిన వారికీ పునరుద్దరిస్తాం.
• రాష్ట్ర బాగు కోసం కూటమికి శ్రీ పవన్ కళ్యాణ్ నాంది పలికారు
మాకు అనుభవం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉంది. రాష్ట్రం బాగు కోసం మూడు పార్టీలు కలిశాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తి. నేను జైల్లో ఉన్నప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక్కటే చెప్పారు. రాష్ట్రంలో ఓటు చీలడానికి వీల్లేదు. కలసి పోటీ చేద్దామని మొదట చెప్పిన వ్యక్తి ఆయన. మూడు పార్టీలు కలవడానికి అదే నాంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసింది మా కోసం కాదు.. రాష్ట్రం కోసం. అంతా తగ్గాం. ఒక అవగాహనకు వచ్చాం. వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు. ఈ ముఖ్యమంత్రి 2014లో తండ్రి మరణం సానుభూతితో వచ్చాడు. 2019లో బాబాయ్ ని గొడ్డలితో చంపి రాజకీయం చేశాడు. ఇంతకీ.. హూ కిల్డ్ బాబాయ్? పోయిన ఎన్నికల్లో కోడి కత్తితో, ఇప్పుడు గులకరాయితో డ్రామా ఆడుతున్నాడు. అది మేమే చేయించామంట. ఇలాంటి విశ్వసనీయత లేని వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించి ప్రజలే తగిన చికిత్స చేయాల్సిన సమయం ఆసన్నమైంది. శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్య ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. రైల్వే కోడూరులో జనసేన తరఫున శ్రీ శ్రీధర్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. వీరిని అఖండ మెజారిటీతో గెలిపించండి. వైసీపీకి డిపాజిట్లు కూడా రాకూడదు” అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్