• రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఆయన వైఖరి మీద ప్రజలు ఆగ్రహంతో రగలిపోతున్నారు
• దేశ రాజకీయాల్లో జగన్ లాంటి నాయకులు చీడ పురుగులు
• ఇంతలా దిగజారి మాట్లాడిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు
• వైసీపీకి వై నాట్ 15 సీట్లే గతి
• జాతీయ సర్వేలన్నీ కూటమి విజయాన్ని నిర్ధరించాయి
• అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మంచి చర్చను ప్రజలు చూస్తారు
• మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్
‘చిన్న రాయి తగిలితేనే.. కడుపు మండదా అని జగన్ మాట్లాడుతున్నాడు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎంత కడుపు మండుతుందో జగన్ తెలుసుకోవాలి. పోలవరం పూర్తి చేయనందుకు ప్రజల కడుపుమండుతోంది… రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు కడుపు మండుతోంది… దళిత డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసినందుకు దళితుల కడుపు మండుతోంది… 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే పట్టించుకోనందుకు రాష్ట్రానికి కడుపు మండుతోంది.. అంగన్వాడీలను కాళ్లతో తన్ని అక్రమంగా అరెస్టు చేసినందుకు కడుపు మండుతోంది… అంబేద్కర్ విదేశీ విద్యానిధి తొలగించినందుకు కడుపు మండుతోంది… రాష్ట్రంలో అన్ని వర్గాలకు జగన్ మీద కడుపు మండుతోంది. అది రాబోయే ఎన్నికల్లో జగన్ పరాజయాన్ని లిఖించే బడభాగ్నిగా మారుతుంద’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బుధవారం మచిలీపట్నంలో జరిగిన వారాహి విజయభేరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “జగన్ పదే పదే వైనాట్ 175 అంటున్నాడు. ఇప్పుడు పరిస్థితిని చూస్తే, ప్రజల ఆగ్రహాన్ని పరిశీలిస్తే, జాతీయ మీడియా సర్వే లెక్కలు చెబుతున్న దాని ప్రకారం జగన్ కు వై నాట్ 15 వస్తాయని అర్థమవుతుంది. జగన్ చేసిన పాలనకు 15 సీట్లు చాలా ఎక్కువ. జగన్ పాలన మీద ప్రజలంతా లోతుగా అధ్యయనం చేసి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ లాంటి వ్యక్తుల పాలనలో రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్లిందో వారు తెలుసుకోవాలి. దేశ రాజకీయాల్లో జగన్ లాంటి చీడ పురుగులు ఉండకూడదు. ఇంతమంది భవిష్యత్తును ఒక వ్యక్తి ఎలా నాశనం చేస్తున్నాడో ప్రజలు పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో దీన్ని ఓటుగా మలచి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
• ఇంత దిగజారి మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరూ ఉండరు
నేను ఏనాడూ జగన్ గారి సతీమణి గురించిగాని… వారి కుటుంబ సభ్యుల గురించిగానీ మాట్లాడలేదు. ఈ ముఖ్యమంత్రి మాత్రం ఇష్టానుసారం దిగజారి మాట్లాడుతున్నాడు. వ్యక్తిగత విషయాలను ప్రజా వేదికల్లో మాట్లాడుతూ మరింత దిగజారిపోతున్నాడు. పెళ్లాం అనే మాటను ఎవరూ.. ఎప్పుడు ఇతరుల భార్యలను ప్రస్తావిస్తూ ఉపయోగించరు. కానీ ముఖ్యమంత్రి మాత్రం పదే పదే అదే మాటను వాడుతూ ఏం మాట్లాడుతున్నాడో కూడా అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. సొంత చెల్లి జీవితాన్ని రోడ్డు మీదకు నెట్టేవాడు… ఆమెను గోడకు కొట్టేవాడు ఇంతకన్నా ఏం మాట్లాడగలడు. వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి ప్రజల ముందు మరింత చులకన అవుతున్నాడు. చంద్రబాబు కూడా జగన్ లా పాలించి ఉంటే అసలు అన్ని రోజులు జగన్ రోడ్లపై తిరిగేవాడా..? అధికారంలోకి వచ్చేవాడా..? ప్రజలు ఆలోచించాలి. నేను కూడా పాలసీపరంగా చంద్రబాబు గారితో విబేధించినా ఏనాడు వ్యక్తిగతంగా ఆయన నన్ను దూషించలేదు. ప్రజాస్వామ్యయుతంగానే ప్రవర్తించారు.
• జగన్ మీద దాడులు చేయడానికి మేము ఆయనలా క్రిమినల్ కాదు
సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపేసే వాళ్లకు వత్తాసు పలికే వ్యక్తి ఢిల్లీ వెళ్లి కేంద్రం మెడలు వంచుతానంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటి వ్యక్తి గత ఎన్నికల్లో కేంద్రం మెడలు వంచి మరీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రజలను నమ్మించాడు. చివరకు బాబాయిని చంపిన వారిని వెనకేసుకొచ్చాడు. జగన్ మీద మేము రాళ్ల దాడులు చేశామని చెబుతున్నాడు. ఈయనపై దాడులు చేసేంత సమయం మాకెవ్వరికీ లేదు. ఆయనలా క్రిమినల్ ఆలోచనలు మాకు లేవు. వంట చేస్తున్నప్పుడు చిన్న నూనె చుక్క ఒంటి మీద పడితేనే ఎంతో బాధ కలుగుతుంది. అలాంటింది 15 ఏళ్లు బాలుడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు … ఆ బాలుడికి ఎంత వేదన కలిగిందో తలుచుకుంటేనే బాధ కలుగుతుంది. అలాంటి సమయంలో కూడా కనీసం స్పందించని ఈ ముఖ్యమంత్రి చిన్న రాయి ఘటనకు మమ్మల్ని అందరినీ విమర్శిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం కనీసం ప్లకార్డు కూడా పట్టుకోలేని వ్యక్తి .. ఈ రాష్ట్రానికి ఏమీ చేయడలేదని ప్రజలు గుర్తించుకోవాలి.
• చిత్ర పరిశ్రమను ఎవరూ రాజకీయంగా వేధించలేదు
చిత్ర పరిశ్రమ మొదలైన దగ్గర నుంచి ఎవరైనా సరే దానిని ప్రోత్సాహించారు తప్పితే చిత్ర పరిశ్రమను రాజకీయంగా ఎవరూ వేధించింది లేదు. జగన్ ప్రభుత్వంలో చిత్ర పరిశ్రమ రకరకాల రాజకీయ వేధింపులు ఎదుర్కొంది. స్వశక్తితో ఎదిగిన ఎందరో నటులు వ్యక్తిగతంగా జగన్ గారిని కలిసినా ఫలితం లేకపోయింది. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారికి కూడా ఈ హక్కులు వర్తిస్తాయి. గొప్ప వ్యక్తులు రాసిన రాజ్యాంగం మనందరికీ శ్రీరామ రక్ష. దాని నీడలో భయం లేకుండా యువత పోరాడాలి. నేను ధైర్యంగా ఉన్నాను. ఓ మధ్య తరగతి ఉద్యోగి కొడుకుగా ఈ దాష్టిక పాలన మీద పోరాడుతున్నాను. యువత కూడా భయాన్ని వీడి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. బందరు ఆకు రౌడీలకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలాంటి ఆకు రౌడీలు యువసైన్యం మూకుమ్మడిగా వస్తే తట్టుకోలేరు.
• అసెంబ్లీలో సహేతుక చర్చ జరిగేలా చూస్తాం
వైసీపీ పాలనలో అసెంబ్లీ అంటే బూతులు… ఒకరిపై అరుపులు, రన్నింగ్ కామెంట్రీ, అనవసర విమర్శలు మాత్రమే తెలుసు. ప్రజా సమస్యల మీద పూర్తిస్తాయి సహేతుకమైన చర్చ సాగితే ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వంలో చూస్తారు. ప్రజల సమస్యలు గుర్తెరిగే ప్రజాప్రతినిధుల సమూహం సమస్యలపై నిజాయతీగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో ప్రజలు చూస్తారు. బూతులు తిట్టేవారు ప్రజల కోసం ఏం ఆలోచిస్తారు…? అసెంబ్లీలో ఆరోగ్యవంతమైన చర్చలు ఉంటాయని హామీ ఇస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో ఓటు చీలకూడదని నేను పిలుపు ఇచ్చింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అని ప్రజలు గుర్తించారు.
• అతని కొడుకు దిగి వచ్చాడా..?
రాష్ట్రంలోని యువతకు బందరు ఎమ్మెల్యే కొడుకుకి ఏంటి తేడా..? అతనికున్న అదనపు అర్హతలు ఏంటి..? ఆయనేమైనా పైనుంచి దిగివచ్చాడా..? ఇది ప్రజాస్వామ్యామా లేక రాచరికమా..? మీ రక్తం ఏమైనా నీలి రంగులో పారుతోందా..? జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాడు. స్థానిక ఎమ్మెల్యేతో నన్ను బూతులు తిట్టిస్తుంటాడు. మేము మేము కాపులం అంటూ ఇష్టానుసారం తిడతాడు. ఎందుకు ఈ బలుపు..? జగన్ కు ఊడిగం చేసి కుక్క పిల్లలా ఉండాలంటే ఉండొచ్చు. అంతే కానీ కులం పేరు తీసుకొచ్చి ఇష్టానుసారం మాట్లాడితే జాగ్రత్త. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మర్యాద ఇచ్చినప్పుడు దానిని నిలబెట్టుకో… పిచ్చివాగుడు వాగడం మానేయ్… నాతో గొడవ పెట్టుకుంటే అది చచ్చే వరకు అన్నది గుర్తు పెట్టుకో. చంద్రబాబు హయంలో పెద్దిరెడ్డి మీద ద్వేషం పెంచుకుంటే వాళ్లు రాష్ట్రంలో తిరిగేవాళ్లా..? వాళ్ల ప్రాంతంలోకి ఇతరులు రాకూడదని హుకుం జారీ చేస్తారు. వాళ్లు మాత్రం రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి దోచుకోవచ్చు. అన్యాయం మీద సామాన్యుడు గుండె పగిలి తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తా. 2047కు భారత్ సూపర్ పవర్ గా ఎదగాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తున్నారు. దీనికోసం యువశక్తిని రాష్ట్రం నుంచి సన్నద్ధం చేయాలి. అత్యంత నైపుణ్యవంతమైన యువత దేశానికి అవసరం . రాష్ట్రం నుంచి అలాంటి యువత తయారు కావాలి. దీని కోసం కూటమి ప్రభుత్వంలో ప్రత్యేక సర్వే చేసి తీసుకోవాల్సిన భవిష్యత్తు చర్యలు ప్రణాళిక ప్రకారం అమలు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో ఓటు రాష్ట్ర భవిష్యత్తు కోసం అని అందరు గుర్తుంచుకోవాలి. ఎంపీగా శ్రీ బాలశౌరి, ఎమ్మెల్యేగా శ్రీ కొల్లు రవీంద్రను గెలిపించాల”ని కోరారు.