సీఎంపై రాయి ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోండి

సీఎం

• డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీలను బదిలీ చేయాలి
• నిష్పక్షపాత విచారణ జరిగేలా చొరవ తీసుకోండి
• ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలి
• రాష్ట్ర చీఫ్ ఎలక్టొరల్ అధికారికి వినతి పత్రం సమర్పించిన జనసేన నేతలు
        ముఖ్యమంత్రిపై రాయి దాడి ఘటనపై బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుని, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించేలా ఎన్నికల సంఘం అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలోని చీఫ్ ఎలక్టోరల్ అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనాకు జనసేన పిఎసి సభ్యుడు శ్రీ కోన తాతారావు, పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస రావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శ్రీ షేక్ రియాజ్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ కోన తాతారావు మాట్లాడుతూ.. “ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మీద జరిగిన దాడి ప్రజల్ని నమ్మించడానికో, సానుభూతి పొందడానికే ఆడిన డ్రామా అనిపిస్తోంది. భద్రతా వలయం మధ్య గులకరాయి ఎక్కడి నుంచి వచ్చింది. ముఖ్యమంత్రికి దెబ్బ తగిలితే తీసుకున్న చర్యలు ఏంటి? అసలు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగనిస్తారా? అని ప్రజలు భయపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీ వేసి దర్యాప్తు జరపాలని, ఆ కమిటీ నేరుగా ఎన్నికల కమిషన్ కి నివేదిక అందచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎన్నికల సంఘం మీద జనసేన పార్టీకి పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. ఈ ఘటనకు బాధ్యులు అయిన డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్, సంబంధిత అధికారులను బదిలీ చేయాలి” అన్నారు.
• పోలీసుల వ్యాఖ్యలు హాస్యాస్పదం : శ్రీ షేక్ రియాజ్
       “సీఎం మీద రాయి దాడి ఘటనలో పోలీసుల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. మొన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగిన ఆయన పరదాలు తీయించుకుని కరెంటు కట్ చేయించుకుని మరీ రాయి విసిరించుకున్నట్టు ఉంది. ఈ కథలన్నీ సినిమాల్లో బాగుంటాయి”.
• ప్రజా వ్యతిరేకత తప్పించుకునేందుకే డ్రామాలు : శ్రీ చిల్లపల్లి శ్రీనివాస రావు
     “ముఖ్యమంత్రిపై దాడి వ్యవహారంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు”.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్