పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ ఇంటి నిర్మాణం చేపడుతున్నారు

పిఠాపురం

• పిఠాపురమే ఆయన శాశ్వత నివాస స్థలం
• శాసనసభ సమావేశాలు, కేంద్ర పర్యటనలు, పార్టీ కార్యకలాపాలు మినహా నియోజకవర్గంలోనే ఎప్పుడూ ఉంటారు
• పిఠాపురంను దక్షిణకాశిగా తీర్చిదిద్దుతాం
• పిఠాపురం మీడియా సమావేశంలో శ్రీ కె. నాగబాబు

            పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే స్వంత ఇల్లు నిర్మించే పనిలో ఉన్నారని, పిఠాపురం నియోజకవర్గం శ్రీ పవన్ కళ్యాణ్ గారి శాశ్వత నివాస స్థలం అవుతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలు, కేంద్ర పర్యటనలు, పార్టీ కార్యకలాపాల కోసం పర్యటనలు మినహా నియోజకవర్గంలోనే ఎప్పుడూ ఉంటారని, నియోజకవర్గం ప్రజల సమస్యలు స్వీకరించి వాటి పరిష్కార మార్గాల కోసం ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించనున్నట్లు, స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారే హాజరయ్యి చేపట్టాల్సిన కార్యక్రమాలు ఆయనే స్వయంగా చేపడతారని వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలతో మూడు మతాల వారు సామరస్యంగా ఉండే పవిత్రమైన శాంతికి నిలయం పిఠాపురం అని, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శక్తి పీఠం కొలువై ఉన్న పవిత్ర ఆధ్యాత్మిక పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీకి దిగడం మా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. పిఠాపురంను దక్షిణకాశిగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యభూమిక పోషించే మీడియా పట్ల జనసేన పార్టీకి ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందని చెప్పారు. కొన్ని మీడియా సంస్థల అధినేతల ఒత్తిళ్లకు తలొగ్గి వారికి అనుగుణంగా పని చేయాల్సిన పరిస్థితి కొంతమందికి ఉన్నప్పటికీ, సామాజిక బాధ్యత గల పౌరులుగా జర్నలిస్టులను తామెప్పుడూ గౌరవిస్తామని అన్నారు. గత 15 ఏళ్లుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు, ఒక్కసారి శాసనసభ్యులుగా అవకాశం కల్పిస్తే చట్ట సభల్లో ప్రజా గళం వినిపించగలరని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఏ నిర్ణయం అయినా ప్రజా క్షేమం, ప్రజా సంక్షేమం కోసమే ఉంటుందని తెలిపారు. రూల్ ఆఫ్ లా న్యాయ బద్దంగా అమలవ్వాలని ఆశిస్తారని, పవన్ కళ్యాణ్ గారి నిబద్దత మనందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. దుర్మార్గ పరిపాలన, దమన నీతిపై పోరాటాలు చేస్తారు తప్ప వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారికి ఎవరి మీద కోపం ఉండదని, ఏ విధమైన వ్యక్తిగత ఆకాంక్షల కోసం పని చేయరని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు, మహిళలు, కార్మికులు, వ్యాపారస్తులు ఎవరూ ఆనందంగా లేరని, 30 వేల మంది మహిళలు అదృశ్యం అయితే కనీసం ఆ విషయంపై రివ్యూ చేసే సమయం కూడా జగన్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. అదృశ్యం అయిన మహిళలు ఎటువంటి నరకంలో బ్రతుకుతున్నారో తలచుకుంటేనే భయమేస్తోంది అన్నారు. రైతుల ఆత్మహత్యలు గురించి అబద్ధాలు చెప్పే అసమర్థ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్యలు చేసుకున్న వేలాది మంది కౌలు రైతుల కుటుంబాలకు కోట్ల రూపాయలు రైతు భరోసా అందజేస్తోన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పిఠాపురం నియోజకవర్గం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రతీ ఇంటి కోసం, ప్రతీ కుటుంబం కోసం పని చేస్తారని చెప్పారు. మేము ఎవరికి నష్టం చేయం, కానీ తప్పు చేసిన వారిని మాత్రం వదిలి పెట్టమని అన్నారు. రైతులు, మహిళలు సంతోషంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆలోచించే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు.
• రక్షణకు నిలయంగా ఉండే రాష్ట్రం భయానికి కేంద్రం అయింది: జనసేన స్టార్ కాంపైనర్ సాగర్
           గతంలో రక్షణకు నిలయంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు భయానికి కేంద్ర బిందువు అయిందని జనసేన స్టార్ కాంపైనర్ సాగర్ వెల్లడించారు. రాష్ట్రంలో సగటు పౌరుడు స్వేచ్చగా బ్రతికే పరిస్థితులు లేవని, ప్రశ్నించిన వారిని హింసించే దుస్థితి నెలకొని ఉన్నదని అన్నారు. సినిమా నటులు రాజకీయాలు చేయకూడదని కొందరు వైసీపీ నాయకులు చెప్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తోందని, సినిమా నటులకు సామాజిక బాధ్యత ఎక్కువ ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు, పిఠాపురం కో ఆర్డినేటర్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, శ్రీ మహేందర్ రెడ్డి గారు, శ్రీ శంకర్ గౌడ్ గారు, శ్రీ వెన్నా జగదీష్ గారు, శ్రీ కడారి నాయుడు గారు, శ్రీ చక్రధర్ రావు గారు, శ్రీ పిళ్లా శివశంకర్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్