జగన్… ఎన్నికల ముందు ‘నాన్న… పులి’ కథలు ఆపు

జగన్

• జగన్ కు చిన్న గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లు నాటకాలు ఆడుతున్నారు
• అమర్నాథ్ గౌడ్ ను చెరకు తోటలో నిర్దాక్షణ్యంగా కాల్చేసినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా? 30 వేల మంది ఆడబిడ్డలు కనిపించకుండాపోతే ఏం కాలేదా?
• రాయితో దాడి జరిగిందా..? మీ వాళ్లతో జరిపించుకున్నారా..?
• ప్రతి ఎన్నికల ముందు మీ మీద దాడి జరగడమో… మీ కుటుంబ సభ్యులు చనిపోవడమో ఎలా జరుగుతోంది..?
• వచ్చే నెల ఈ సమయానికి వైసీపీ అంకం ముగిసిపోతుంది
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాగీరుగా, ప్రజలంతా బానిసలుగా జగన్ చూస్తున్నారు
• యువతలో నైపుణ్య, ప్రతిభ సర్వే ద్వారా కొత్త అవకాశాలు సృష్టిస్తాం
• మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా చేస్తాం
• తెనాలి వారాహి విజయ భేరి సభలో శ్రీ పవన్ కళ్యాణ్
          జగన్మోహన్ రెడ్డికి చిన్న గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లు వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. తన అక్కను ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నించిన పాపానికి 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడ్ ను నిర్ధాక్షిణ్యంగా చెరుకు తోటలో పెట్రోల్ పోసి చంపేసినప్పుడు రాష్ట్రానికి గాయమవ్వలేదా..? 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయమవ్వలేదా..? తన తండ్రిని అన్యాయంగా చంపేశారని జగన్ కు సోదరి అయ్యే డా.సునీత న్యాయపోరాటం చేస్తుంటే, ఇదే విషయంపై సొంత చెల్లెలు కూడా గొంతెత్తి న్యాయం చేయమంటే అనరాని మాటలు అంటే రాష్ట్రానికి గాయం అవ్వలేదా..? చంద్రబాబుతో సహా ప్రతిపక్ష నాయకులపై రాళ్ల వర్షం కురిపిస్తే రాష్ట్రానికి గాయమవ్వలేదా..? జగన్ ఒక్కడిపైనే చిన్న గులకరాయి పడితే గాయమైనట్టా..? అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిలదీశారు. అదేం విచిత్రమో జగన్ కు ఎలక్షన్ ముందే గాయాలవుతాయి… ఎలక్షన్ ముందే ఆయన తాలుకు మనుషులు చచ్చిపోవడమే, చంపేయడమే జరుగుతుందని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తెనాలిలో నిర్వహించిన వారాహి విజయభేరీ సభలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, తెనాలి అసెంబ్లీ అభ్యర్ధి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ లతో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శ్రీ కొడవగంటి కుటుంబరావు చెప్పినట్లు అధికారం, డబ్బు ఉన్నవాడు ఏం చేసినా మధ్య తరగతి వ్యక్తులుగా దానికో నైతిక భాష్యం మనకు మనమే చెప్పుకుంటాం. కాకినాడలో ఉన్న మాఫియా డాన్ ఎవరినైనా కత్తితో పొడిస్తే ‘‘పాపం’’ ఏ పరిస్థితుల్లో కత్తితో పొడిచాడో అంటాం. వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికేస్తే ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందో ‘‘పాపం’’ అంటాం. 30 వేల మంది ఆడపడుచులు రాష్ట్రం నుంచి అదృశ్యమైతే జగన్ ఏం చేస్తాడు ‘‘పాపం’’ అని సర్ది చెప్పుకుంటాం.
• నాటకాలు ఆపండి… చూడలేకపోతున్నాము
     సగటు మధ్య తరగతి ప్రజలు చేస్తున్న తప్పు ఇదే. మన హక్కుల్ని మనమే కాలరాసుకుంటున్నాం. నైతిక భాష్యం ముసుగులో పెద్దలకు మనమే అధికారం ఇస్తున్నాం. ఇది తరతరాలుగా వస్తున్న మధ్య తరగతి జాడ్యం. జగన్ కు గాయమైతే మనందరికీ అయినట్లు కాదు… రాష్ట్రానికి అయినట్లు కాదు. నిన్న జగన్ గారికి దెబ్బతగిలితే మా పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చి ఆయన త్వరగా కోలుకోవాలని స్టేట్మెంట్ ఇవ్వండి సార్ అని అడిగారు. స్టేట్మెంట్ ఇవ్వడానికి నిజంగా ఆయనపై దాడి జరిగిందా..? లేకపోతే ఆయనే కొట్టుకున్నాడో ఎవరికి తెలుసు..? దాడి జరిగిన సమయంలోనే కరెక్టుగా కరెంటుపోయింది. పూలదండలో రాయి పెట్టి ఆయనే కొట్టుకున్నాడేమో..? నిజంగా దాడి జరిగితే ఆ దాడి చేసిన వాడిని పట్టుకోండి. చుట్టూ నాలుగు అంచెల భద్రత ఉంది. మందీమార్బలం ఉన్నా కరెక్టుగా రాయి తగిలింది అంటే కచ్చితంగా దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రతిసారీ ‘‘నాన్న పులి’’ కథలాగా ఎలక్షన్ ముందు ఈ సెంట్మెంట్ డ్రామాలు చేస్తున్నారు. నాటకాలు ఆపండి భరించలేకపోతున్నాం. గతంలో ప్రజారాజ్యం తరఫున ఖమ్మం పర్యటకు వెళ్లినప్పుడు నా మీద రాళ్లు పడ్డాయి. అప్పుడు చెప్పుకోవడానికి నా దగ్గర మీడియా కూడా లేదు. నేను ఏమీ ముఖ్యమంత్రి కొడుకును కాదు కదా..? అందుకే నా మీద కనీసం రాళ్లు వేసినట్లు కూడా బయటకు తెలీయలేదు.
• కోడి కత్తి లాంటిదే అనిపిస్తోంది
            జగన్ చుట్టూ భారీగా భద్రత ఉంది. మరి వారు తలుచుకుంటే రాయి వేసిన వాడిని నిమిషాల్లో పట్టుకోవాలి కదా..? ఎందుకు పట్టుకోలేదు. అయినా అందరి మీద దాడి చేసిన వ్యక్తిపై ఎవరైనా దాడి చేయడానికి సాహసిస్తారా..? వైసీపీ నాయకులే రాళ్లతో దాడి చేయించారేమో..? జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికే 2019లో విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో పొడిచానని దాడి చేసిన వ్యక్తే చెప్పాడు. అలాంటిదే ఇది కూడా అనిపిస్తోంది. ఇలాంటి సెంటిమెంటు డ్రామాలకు మనం పడాల్సిన అవసరం లేదు. సొంత చిన్నాన్నను గొడ్డలితో నరికేసి గుండెపోటు అని చెప్పిన మనుషులు వీళ్లు. వీళ్ల కథలు మనం ఎలా నమ్ముతాం..? వివేకా కేసులో సీబీఐ అధికారులను కూడా ప్రశాంతంగా పని చేయనివ్వలేదు. బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినవాడు మనల్ని చంపుతాం, నరుకుతాం అని బెదిరిస్తే చూస్తూ ఎంతకాలం భరిస్తాం. ఎందుకు నోరు మూసుకొని ఉంటున్నాం..?
• చేతల్లో జగన్ పెద్ద పెత్తందారుడు… చెప్పేవి క్లాస్ వార్ కహానీలు
          క్లాస్ వార్ అని రోజూ గొంతు చించుకుంటున్న జగన్ కు 30 వేల మంది ఆడపడుచులు రాష్ట్రం నుంచి మాయం అయినట్లు చెబితే, దానిపై సమీక్షించే తీరిక లేకపోయింది. క్లాస్ వార్ అని మాట్లాడుతున్న జగన్ పాలన ప్రారంభించగానే రోజువారీ కూలి పనులు చేసే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు. ఇసుక కొరత సృష్టించి 40 మంది చావులకు కారణం అయ్యాడు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించాల్సిన రూ.450 కోట్ల నిధులను పక్కదారి పట్టించాడు. క్లాస్ వార్ అని కథలు చెప్పే జగన్ నిజంగా పేదల తరఫున నిలబడితే ఇంతమంది ప్రజలు మాకు ఘనంగా స్వాగతం ఎందుకు చెబుతారు..? మమ్మిల్ని గుండెల్లో పెట్టుకొని ఎందుకు చూసుకుంటారు..? ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఎందుకు ఎదురు చూస్తారు..? ప్రజలకు ఎవరు పెత్తందారుడో తెలుసు. ఎవరు గత అయిదేళ్లుగా నిత్యం వేధిస్తున్నాడో తెలుసు.
• వచ్చే నెల ఇదే సమయానికి వైసీపీ ఓటమి బ్యాలెట్ బాక్సుల్లో ఉంటుంది
         వచ్చే నెల ఇదే సమయానికి వైసీపీ ఓటమి తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంటుంది. అయిదేళ్ల దుష్ట పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. నేడు మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి. ఎంతో గొప్ప ఆశయాలతో, భవిష్యత్తు కలలతో రాసిన రాజ్యాంగం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రాష్ట్రంలో బతికించాలనేదే నా కోరిక. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కావాలనేది నా ఆకాంక్ష. రాష్ట్రంలో అంతిమదశలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని బలంగా కాపాడాలనే గట్టి ఆశయంతోనే ఈ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న మాటకు కట్టుబడి రాజకీయం చేస్తున్నాను. కాస్త వెనక్కు తగ్గి రాజకీయం చేసినా, ప్రజల్ని గెలిపించాలనే ఆశతోనే పని చేస్తున్నాను. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను అని గొప్పలు చెప్పిన వ్యక్తి నేడు సారా వ్యాపారిగా మారిపోయాడు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తున్నాడు. 16 మద్యం కంపెనీల నుంచి మద్యం రాష్ట్రంలో సరఫరా అవుతుంటే, దానిలో 3 కంపెనీలు సొంత మనుషుల కంపెనీలే. కల్తీ మద్యం తయారు చేసి 40 వేల మంది చావులకు కారణమయ్యాడు. మద్యం తాగితే 10 సంవత్సరాల్లో పాడవ్వాల్సిన ఆరోగ్యం వైసీపీ అమ్ముతున్న విష మద్యం తాగితే ఏడాదిలోనే పూర్తిగా క్షీణిస్తోంది. మద్యం తీసిన ప్రాణాలకు బాధ్యత ఎవరిదీ..? జెపీ వెంచర్స్ పేరుతో ఇసుక రీచ్ లను స్వాధీనం చేసుకొని తన సామాజిక వర్గ పరివారంతో ఇసుకను బహిరంగంగా దోచుకుతింటున్నారు. గతంలో రీచ్ లలో కొందరు స్థానికులు పనిచేసేవారు. వారు కూడా సొంతంగా సంపాదించుకునే వారు. వైసీపీ హయాంలో ఇసుక రీచ్ లన్నీ వైసీపీ నాయకుల ఆధీనంలోకి వెళ్లాయి. మొత్తం సంపద ఒకరి వద్దనే ఉండిపోతోంది. దీంతో బలిసి కొట్టుకుంటున్నారు. ప్రజల స్వేచ్ఛతో ఆటలాడుతున్నారు. స్వేచ్ఛను కాలరాస్తే తొక్కిపడేస్తాం అని ప్రజలంతా చెప్పాల్సిన సమయం వచ్చింది.
• ఉద్యోగులతో సఖ్యత… సకాలంలో జీతాలు
       జగన్ మాయ మాటలు చెప్పినట్లుగా సీపీఎస్ ను వెంటనే రద్దు చేస్తాం.. అందరికీ న్యాయం చేస్తాం అని చెప్పను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు పైనా చట్టసభల్లో చర్చిస్తాం. దానిని రద్దు చేసేందుకు ఉన్న దారులు, తీసుకోవాల్సిన చర్యలపై అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకుంటాం. సంవత్సరం లోపు బలమైన నిర్ణయం, సంతోషకరమైన నిర్ణయంతో ముందుకు వస్తాం. ఉద్యోగులకు పింఛను ఎంత ముఖ్యమైందో నాకు తెలుసు. అద్భుతాలు చేస్తానని చెప్పడం లేదు కాని, ఓ సగటు ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగులకు తగిన విధంగా పింఛను భద్రత కల్పించే బాధ్యతను నేను తీసుకుంటాను. పని చేసే ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో ప్రజలు చూసేలా పాలన చేస్తాం. ఉద్యోగులతో సఖ్యంగా ఉంటాము. పోలీసులకు సరెండరు లీవులు, టీఏ, డీఏలు లేకుండా చేసిన వ్యక్తి జగన్. పోలీసుల కష్టాలు నాకు తెలుసు. వారి విధులను దుర్వినియోగపరచం. పోలీసు రిక్రూట్మెంట్ పూర్తి చేసి ఖాళీలు భర్తీ చేస్తాము.
• ఉపాధ్యాయులను మద్యం షాపుల దగ్గర ఉంచిన వ్యక్తి జగన్
        టీచర్లను లిక్కర్ షాపుల వద్ద ఉంచిన వ్యక్తి, వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోని వ్యక్తి జగన్. శివశివానీ స్కూలులో పదో తరగతి పేపర్ లీకేజీ చేసిన వ్యక్తికి ఉపాధ్యాయులను ఎలా గౌరవించుకోవాలో ఎలా తెలుస్తుంది. అంగన్ వాడీలు తమ సమస్యలు తీర్చాలని కోరితే తీవ్రంగా కొట్టించిన వ్యక్తి. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో సఖ్యతగా ఉంటుంది. వారి సమస్యలను తీర్చేందుకు చొరవ తీసుకుంటుంది. ప్రతి నెలా 1 నుంచి 5 వ తేదీ లోపు జీతాలు అందేలా మేం చూసుకుంటాం. ఈజిప్టులో కొన్ని దశాబ్దాల పాటు తన ఇష్టానుసారం పాలించిన హోస్ని ముబారక్ ఆగడాలను భరించలేక ఓ టైలర్ మొదట అతడ్ని వ్యతిరేకించి బలంగా నిలబడ్డాడు. తర్వాత ప్రజాగ్రహం ముబారక్ ను గద్దె దిగేలా చేసింది. పొరుగున ఉన్న శ్రీలంకలో ప్రజాగ్రహం అధ్యక్ష భవానాన్ని ఎలా ఆక్రమించిందో, రాష్ట్రంలో సైతం తాడేపల్లి ప్యాలెన్ ను ప్రజాగ్రహం చుట్టముట్టడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ తన జాగీరు అని, ప్రజలంతా తన బానిసలు అని జగన్ భావిస్తున్నాడు. అహం తలకెక్కి రాష్ట్రంలో గుత్తాధిపత్యం తన జన్మహక్కుగా జగన్ భావిస్తున్నాడు. పట్టాదారుల పాస్ పుస్తకాల్లో, సర్వే రాళ్లలో, ఆఖరికి ఇంటి పట్టాలోనూ జగన్ చిత్రాలే కనిపిస్తున్నాయి. ప్రజల ఆస్తి, అధికారం తన సొంతం అన్నట్లు అహంకారం తలకెక్కి, ప్రతి ఒక్కరినీ తన కింద బతకాలన్నట్లు చూస్తున్న జగన్ కు బుద్ధి చెప్పే రోజు తొందర్లోనే రాబోతోంది. ఆ దెబ్బకు జగన్ ఎక్కడికి వెళ్తాడో కూడా తెలీదు.
• తెనాలి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
       తెనాలి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గెలిచిన వెంటనే పెండింగ్ లో ఉన్న సమస్యలను తీర్చే బాధ్యత తీసుకుంటారు. చివరి దశలో ఉన్న రక్షిత మంచినీటి పథకం నుంచి పైపులైన్లు వేసి కుళాయి కనెక్షన్లు బిగిస్తాం. తెనాలి – విజయవాడ రహదారి, తెనాలి – గుంటూరు రహదారి విస్తరణ బాధ్యతలు తీసుకుంటాం. కాలువల సుందరీకరణ చేసి, చెత్త దుర్గంధం నుంచి తెనాలిని బయటకు తీసుకొస్తాం. కొల్లిపరలో చెక్ డ్యాంల నిర్మాణం చేస్తాం. ఆర్య వైశ్య సమాజానికి, విశ్వ బ్రాహ్మణులకు తగిన విధంగా రక్షణ కల్పించే బాధ్యతను తీసుకుంటాం. వారిపై దాడులు చేసే వారిని తగిన విధంగా శిక్షిస్తాం. వరద ముంపు గ్రామాల్లో రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం. ట్రాఫిక్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించి, సిబ్బందిని నియమించేలా చూస్తాం.
• ఓ అంబటి రాయుడు… ఓ నితీశ్ రెడ్డి కావచ్చు
     యువతలో మనకు తెలియని అపూర్వమైన స్కిల్స్ దాగి ఉండొచ్చు. ఓ అంబటి రాయుడులా, ఓ నితీష్ రెడ్డిలా క్రీడాకారులు కావొచ్చు. అద్భుతమైన స్టార్టప్స్ మొదలుపెట్టే ఆలోచనలు దాగి ఉండొచ్చు. నేను నా టీనేజీలో నటన అనే నైపుణ్యం నేర్చుకోవడం ద్వారానే మీ మధ్య ఉన్నాను. యువతలో ఎంతో ప్రతిభ దాగి ఉంటుంది. వారు ఏదో చేయాలనే అభిరుచి, ఉత్సాహంతో ఉంటారు. దాన్ని గుర్తించాలి. యువతతోపాటు మహిళలకు సైతం ఆర్థిక పరిపుష్టి సాధించాలి. రూ.5 వేలకు యువత ప్రతిభ, సామర్థ్యం తొక్కిపట్టి, చాకిరీ చేయించాలనే మనస్తత్వం నాది కాదు. యువతలో ఉన్న అపార శక్తిని బయటకు తీస్తే గొప్ప వ్యక్తులు మన నుంచి వస్తారని బలంగా నమ్ముతాను. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని యువత ప్రతిభ, నైపుణ్యం, అభిరుచి అంశాలపై పూర్తిస్థాయి సర్వే చేస్తాం. దానికి అనుగుణంగా పక్కా ప్రణాళికతో నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మహిళలు సైతం తమకు ఇష్టమైన రంగాల్లో ముందుకు వెళ్లేందుకు తగిన విధంగా నైపుణ్య కేంద్రాలను అందుబాటులోనే ఏర్పాటు చేసే బాధ్యతను తీసుకుంటాం. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా చేస్తాము.
• ఎస్సీ యువత, ముస్లిం పెద్దలు ఏది మంచో ఆలోచించాలి
    ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను తీసేసిన వ్యక్తి. అంబేద్కర్ వంటి మహనీయుడి పేరును అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి తీసేసి, తన పేరు పెట్టుకున్న అహంకారి ఎవరో దళితులు ఆలోచించాలి. రూ.4,163 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను అడ్డంగా వేరే అవసరాలకు మళ్లించిన వ్యక్తి ఎవరో, దళితుడ్ని చంపి డోర్ డెలవరీ చేసిన వ్యక్తికి వంత పాడింది ఎవరో ఎస్సీ యువత, పెద్దలు ఆలోచించాలి. మేం మీకు పూర్తిస్థాయిలో అండగా నిలబడేలా పాలన చేస్తాం. జగన్ పాలనలో తీసేసిన పథకాలను మళ్లీ మొదలుపెట్టే బాధ్యత తీసుకుంటాం. ముస్లిం పెద్దలను కూడా నేను కోరేదే ఒక్కటే. బీజేపీతో కలిశానని మీరు నన్ను దూరం పెట్టొద్దు. మీకు ఎలాంటి కష్టం వచ్చినా, మీ ఇంట్లో పెద్ద కొడుకులా స్పందిస్తాను. మీ భద్రత, సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడను. ఏ కష్టం వచ్చినా అక్కును చేర్చుకునేలా మీ కోసం ముందుంటాను. ప్రతి సమస్యను గుండెతో ఆలకిస్తాను.
• బీసీలకు చేయూతనివ్వడంలో విఫలమయ్యారు
  రాష్ట్రంలో బీసీల జనాభా దాదాపు 2.14 కోట్ల మంది ఉన్నారు. 153 కులాలు ఉన్నట్లు 2019లో వైసీపీ గుర్తించింది. వారికి ఆర్థిక చేయూత ఇవ్వడానికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లు వైసీపీ నేతల రాజకీయ పునరావాసానికే పరిమితమయ్యాయి తప్ప పైసా పని కాకుండానే.. వీటి ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీ కాలం ముగిసిపోయింది. 2.14 కోట్ల జనాభా ఉన్న బీసీల్లో కేవలం 44 లక్షల మందికే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మిగిలిన 1.70 కోట్ల మందికి ఎలాంటి పథకాలు అందడం లేదు. మాట్లాడితే నా ఎస్సీ… నా ఎస్టీ… నా బీసీలు అని మాట్లాడే ముఖ్యమంత్రి దీనికి సమాధానం ఏం చెబుతారు. జగన్ ఐదేళ్ల పాలనలో 26వేల మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారు. వందలాది మందిని చంపేశారు. 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడం ద్వారా దాదాపు 16వేల మంది బీసీలు రాజకీయ అవకాశాలు కోల్పోయారు.
• ప్రజల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా
          ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో చెప్పాను. దానికి కట్టుబడే పొత్తు పెట్టుకున్నాం. ప్రజలు గెలవడం కోసం నన్ను నేను తగ్గించుకున్నాను. ఇస్లాం సమాజానికి ఒకటే చెబుతున్నాను. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు చాలా కీలకమైనవి… విజ్ఞతతో ఓటెయ్యండి. మిమ్మల్ని ఓట్లు బ్యాంకుగా చూసే వ్యక్తులం కాదు. మీ మీద ఈగ వాలితే అండగా నిలబడే వ్యక్తులం. మీ అభివృద్ధి, సంక్షేమం బాధ్యత మాది. గుంటూరు లోక్ సభ స్థానం నుంచి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. విదేశాల్లో సంపాదించి.. మన ప్రాంతంపై మమకారంతో వచ్చారు. ఆయనకు ప్రజల కోసం పనిచేయడం తప్ప వేరే ఆలోచన లేదు, ఆయనకు మన సర్వస్వం ధార పొసైనా సరే గెలుపు ఇవ్వాలి. అలాగే తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెనాలి సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. చర్చిలు, షాదిఖానాలు, వంతెనలు నిర్మించిన వ్యక్తి. తెనాలిలో అంతర్గత రోడ్లతో పాటు మెయిన్ రోడ్లను నిర్మించారు. మనోహర్ గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్. అందుకే ఆయన క్రీడలను, యువతను ప్రోత్సాహించేందుకు ఇండోర్ స్టేడియంను నిర్మించారు. 40 ఎకరాలు సేకరించి పేదలకు ఇళ్లు నిర్మించారు. అర్హులైన అందరికి సంక్షేమ పథకాలు అందేలా చేశారు. పార్టీకి, నాకు వెన్నెముకగా ఉన్న శ్రీ మనోహర్ గారు లాంటి వ్యక్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. పోలవరం గురించి మాట్లాడకుండా… అబ్బనీ తియ్యని దెబ్బ అని రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే వ్యక్తి ఇరిగేషన్ మంత్రిగా ఉండటం దౌర్భాగ్యం. అలాంటి వ్యక్తులు, బూతులు తిట్టే వ్యక్తులను ఓడిద్దాం. 10 ఏళ్లుగా నేను ఏ విజయం లేకుండా తిట్లు, అవమానాలు పడుతూ ఉన్న వాడిని.. ఒక్కసారి గెలుపును చూపించండి. మీకు ఏ స్థాయిలో పని చేయగలనో చేసి చూపిస్తాను’’ అని అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్