• జనసేన, టీడీపీ సమన్వయంతో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి
• ఏ ఒక్క నాయకుడు… కార్యకర్త త్యాగాన్నీ, కష్టాన్నీ మరచిపోము
• వచ్చేది కూటమి ప్రభుత్వమే… నాయకులు, కార్యకర్తల బాధ్యతను సమష్టిగా తీసుకుంటాము
• తిరుపతిలో ఇరుపార్టీల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్
ధార్మిక క్షేత్రమైన తిరుపతి నగరాన్ని కాపాడుకోవాలి అంటే వైసీపీని ఓడించి, ఇంటికి పంపించేయడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పని చేయాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు సమన్వయంతో అడుగులు వేయాలని జనసేన ఆధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు బూత్ స్థాయి నుంచి ఒకే మాటగా, వ్యూహాత్మకంగా ఎలక్షనీరింగ్ చేయాలన్నారు. వైసీపీ ఓటమితోనే తిరుపతి నియోజకవర్గ ప్రజలు ఊపిరి తీసుకోగలరని తెలిపారు. శుక్రవారం రాత్రి తిరుపతికి విచ్చేసిన శ్రీ పవన్ కల్యాణ్ గారు తెలుగుదేశం, జనసేన నాయకులతో వేర్వేరుగా అంతర్గత సమావేశాలు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఇరుపార్టీలు అనుసరించాల్సిన విధానాలపై చర్చించేందుకు తిరుపతి వచ్చారు. అనుసరిచాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. తొలుత తెలుగుదేశం పార్టీ నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రజారాజ్యం పార్టీ తరఫున శ్రీ చిరంజీవి గారు పోటీ చేసిన సమయంలో అప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వ్యక్తి చేసిన దౌర్జన్యాన్ని ఎవరూ మరచిపోలేదు. అదే వ్యక్తి గత అయిదేళ్లుగా తిరుపతిలో, తిరుమల కొండపై ఏ స్థాయిలో తన నైజాన్ని చూపిస్తున్నాడో.. ఈ నియోజకవర్గ ప్రజలు ఎంత క్షోభ అనుభవిస్తున్నారో కూడా చూస్తున్నాము. ఇప్పుడు అతని వారసుడు, వైసీపీ చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను, గూండాగిరీని అడ్డుకోవలసిన సమయం వచ్చింది. ఇది మన అందరి సమష్టి బాధ్యత. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తున్నాము. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటులో ఎన్నో చర్చలు చేశాము. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు తిరుపతి విషయంలో ఎన్నో సూచనలు చేశారు. 2019 ఎన్నికల్లో దాదాపు గెలిచేసిన శ్రీమతి సుగుణమ్మ గారి విషయంలో వైసీపీ అనుసరించిన కుయుక్తులు కూడా ఎవరం మరచిపోలేదు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయానికి వచ్చాము. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అనుభవాన్ని… నాయకులు, కార్యకర్తల బలాన్నీ ఉత్సాహాన్నీ మా పార్టీకి జోడించడం చాలా అవసరం. ఇందుకోసం తెలుగుదేశం నాయకులు అన్ని విధాలా ప్రతి దశలో అండగా ఉండాలని కోరుకొంటున్నాను” అన్నారు.
• అంతా ఒకే లక్ష్యంతో పని చేయాలి
తదుపరి జనసేన నాయకులతో శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే ప్రధాన అజెండాగా కూటమి పని చేస్తుంది. ఇందుకోసం త్యాగాలు చేశాము. ఆంధ్ర ప్రదేశ్ ను ఇప్పుడు రక్షించుకోలేకపోతే నాయకులుగా మనం ప్రజలకు అన్యాయం చేసినవాళ్లం అవుతాము. జనసేన, తెలుగు దేశం కార్యకర్తలు ఒకే లక్ష్యంగా పని చేసి వైసీపీని సాగనంపాలి. తిరుపతి నగరంలో వైసీపీ ముఠాలు ఎన్ని రకాల దౌర్జన్యాలకు దిగాయో ప్రతి ఒక్కరికీ తెలుసు. చిన్నపాటి వ్యాపారులను, అంగళ్లు పెట్టుకొని బతికేవాళ్లను వేధించి వేధించి వదిలారు. ప్రతి ఒక్కరూ వాళ్ళకు జీ హుజూర్ అనాలి అనే పెత్తందారీ పోకడలు చూపిస్తున్నారు. ఈ దశలో జనసేన బాధ్యత తీసుకొని ముందడుగు వేసింది. తెలుగుదేశానికి ఉన్న సంస్థాగత నిర్మాణ బలాన్ని ఉపయోగించుకొని మనకు ఉన్న జనాదరణను జోడించి ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకుందాము” అన్నారు. ఇరు పార్టీల నాయకులకు శ్రీ పవన్ కల్యాణ్ గారు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది అని తెలిపారు. పార్టీ కోసం తొలి నుంచీ బాధ్యతగా వ్యవహరించిన ప్రతి నాయకుడికీ, కార్యకర్తకీ తగిన గుర్తింపు, ప్రాముఖ్యం ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో ఇరు పార్టీలు సమష్టిగా బాధ్యత తీసుకుంటాయని తెలిపారు.
• బోగస్ ఓట్ల దందాపై చర్చ
ఈ సందర్భంగా పలువురు నాయకులు వైసీపీ ఎన్నికల్లో అనుసరించే కుతంత్రలను వివరించారు. పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలో ఎన్ని అక్రమాలకు పాల్పడిందీ ఉదహరిస్తూ బోగస్ ఓట్లు భారీగా తిరుపతిలో చేర్చేసిన క్రమంలో వాటిని కట్టడి చేయడంపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ అంతర్గత సమావేశాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ కె.నాగబాబు గారు, శ్రీ టి.శివశంకర్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు, కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం గారు పాల్గొన్నారు. తిరుపతి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ఆరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు డా.పి.హరిప్రసాద్, నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు శ్రీ జె.రాజారెడ్డి, పార్టీ నేతలు శ్రీ పగడాల మురళీ, శ్రీ హరి, శ్రీ దినేష్ జైన్, శ్రీ మల్లి, శ్రీ వెంకట్ తదితరులు హాజరయ్యారు. తెలుగుదేశం నుంచి శ్రీమతి సుగుణమ్మ, శ్రీ నరసింహ యాదవ్, శ్రీ మోహన్, శ్రీ జె.బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
• నగర ప్రముఖులు… తటస్తులతో భేటీ
తిరుపతి పర్యటనలో భాగం తిరుపతి నగరానికి చెందిన ప్రముఖులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, వైద్యులు, తటస్తులతో సమావేశమయ్యారు. 2022లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ప్రకటన ఏ ఉద్దేశంతో చేసిందీ చెబుతూ కూటమి ఏర్పాటు, కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని ఏ విధంగా రక్షించుకుంటాము అనేది తెలిపారు.