కూటమి జట్టు.. సూపర్ హిట్టు

• రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం రావాలి
• ప్రజాగ్రహ పెను తుఫానులో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం
• గతంలో ఏ ప్రభుత్వానికీ లేనంత ప్రజా వ్యతిరేకత వైసీపీకి కనిపిస్తోంది
• కోనసీమను పులివెందుల చేయాలని జగన్ భావించారు
• ఈ రోజు శ్రీ పవన్ కళ్యాణ్ వచ్చే హెలికాప్టర్ ఎగరకుండా ఆటంకాలు కల్పించారు
• ప్రజల మెడ మీద కత్తులు పెట్టి ఆస్తులు రాయించుకునే దౌర్భాగ్య పరిస్థితి ఉంది
• ప్రచార యావ తప్ప వైసీపీ ప్రభుత్వంలో పనుల్లేవు
• అమలాపురం ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
“జగన్ అన్నం తినడం మానేశాడు. ఉదయం ఇసుక, మధ్యాహ్నం మద్యం, రాత్రి మైన్స్ తినడం మొదలుపెట్టాడు. జగన్ తో పాటు అతని అనుచరులు ఇదే మెనూ ఫాలో అవుతున్నారు. రాష్ట్రాన్ని ఐదేళ్లలో దొరికిన కాడికి దోచుకు తిన్నారు. ఈ అహంకారి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. అవినీతితో సర్వనాశనం చేశాడ”ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. రూపాయి ప్రజలకు ఇచ్చి వెయ్యి రూపాయలు ప్రచారం చేసుకునే జగన్ చేసింది – గోరంత, ప్రచారం కొండంత అనే స్థాయిలో జగన్మోహన మాయ గత ఐదేళ్లుగా ప్రదర్శిస్తూనే ఉన్నాడని అన్నారు. ఈ రోజు సభలకు వచ్చేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వెళ్ళాక ఆయన హెలికాప్టర్ ఎగరకుండా ఆటంకాలు కల్పించారు అని తెలిపారు. గురువారం రాత్రి అమలాపురం ప్రజాగళం సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ “ప్రజలు ప్రభుత్వం నడపమని అధికారం ఇస్తే జగన్ మాఫియా నడిపాడు. రాష్ట్రాన్ని దోపిడీకి అడ్డాగా మార్చుకున్నాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఇలా అన్ని రంగాలను పూర్తి స్థాయిలో నాశనం చేశాడు. ఆఖరికి ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకునే స్థాయికి తీసుకువచ్చాడు. సహజ వనరులను అడ్డంగా దోచేశారు.
• రంగుల పిచ్చోడు ఈ ముఖ్యమంత్రి
ప్రచార యావ, తన చిత్రాల ప్రమోషన్ తప్ప జగన్ చేసింది ఏమీ లేదు. మన భూమి పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫోటోలు ఎందుకు? సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు ఎందుకు? ఇష్టానుసారం భవనాలకు రంగులు వేసిన రంగుల పిచ్చోడు ఈ ముఖ్యమంత్రి. అహంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. తాజాగా వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూపరిరక్షణ చట్టంతో కనీసం ప్రజలకు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ పట్టాల ఒరిజినల్స్ ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకునేలా చట్టం తెచ్చారు. అంటే ప్రభుత్వం అమ్ముకున్నా అడగలేని పరిస్థితి తీసుకువచ్చారు. మేనిఫెస్టోలో 99 శాతం పనులు చేశామని జగన్ నాటకం ఆడుతున్నాడు. యాత్రలో రకరకాల వ్యక్తులతో కొత్త నాటకానికి తెరలేపారు. ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో పూర్తిగా పడకేసింది. ఆసుపత్రుల్లో మందులు లేవు.
• బటన్ నొక్కిందెంత? నువ్వు బొక్కిందెంత?
మాట్లాడితే అన్ని పథకాలకు బటన్లు నొక్కానని జగన్ బిల్డప్ ఇస్తున్నాడు. ఈ బటన్ల మాటున జగన్ ఎంత బొక్కాడో ప్రజలకు తెలియాలి. జగన్ నొక్కని మద్యపాన నిషేధం బటన్, సీపీఎస్ బటన్, డీఎస్సీ బటన్ ఎందుకు నొక్కలేదో ప్రజలు ప్రశ్నించాలి. 27 దళిత సంక్షేమ పథకాలను తొలగించిన దళిత ద్రోహి జగన్. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన నాయకులను ప్రోత్సహించిన వ్యక్తి జగన్. రేపు మళ్లీ అధికారంలోకి వస్తే అడ్డొచ్చిన ప్రతి ఒక్కరినీ చంపి డోర్ డెలివరీలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. బంగారం లాంటి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు నెట్టిన దుర్మార్గపు పాలనకు చిరునామా జగన్.
• జే బ్రాండ్ మద్యం, గంజాయికి చిరునామాగా రాష్ట్రం
తెలుగుదేశం ప్రభుత్వంలో క్వార్టర్ బాటిల్ రూ. 60 ఉంటే దాన్ని రూ. 200 వైసీపీ ప్రభుత్వంలో చేశారు. అది కూడా నాశిరకం మద్యం ప్రజలకు తాగించి వారి ఆరోగ్యాలను హరించారు. కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలతో మందుబాబులు మృత్యువాత పడుతున్నారు. గంజాయి వీధి వీధినా, పల్లెపల్లెకు వచ్చేసింది. గంజాయిలో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా చేశాడు. చిన్న బిడ్డలు గంజాయికి అలవాటు పడితే వారి జీవితం నాశనం అవుతుంది. గంజాయి రాష్ట్రమంతా విస్తరించినా ఒక్కసారి కూడా ఈ ముఖ్యమంత్రి దానిపై సమీక్షించలేదు. అప్పుల్లో రాష్ట్రాన్ని నంబన్ వన్ గా తయారు చేశారు. మద్యం ఆదాయం తాకట్టు పెట్టి కూడా అప్పులు చేసుకున్నారు. కలెక్టర్ ఆఫీసులు, ఎమ్మార్వో ఆఫీసులు, ఆఖరికి రైతు బజారులు తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు. పోనీ అప్పులు తెస్తున్న డబ్బులు ప్రజలకు ఉపయోగిస్తున్నారా అంటే అదీ లేదు. ప్రజలను రకరకాల పన్నులతో బాదేస్తున్నారు.
• వాలంటీర్లను బానిసలు అనుకున్నారు
వాలంటీర్లను బానిసలుగా జగన్ భావించాడు. ఊడిగం చేయిస్తూ వారి నైపుణ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా రూ. 5 వేలతో చాకిరీ చేయించుకున్నాడు. వైసీపీ నాయకులు చెబుతున్నట్టు వాలంటీర్లు ఎవరూ రాజీనామాలు చేయకండి. మీ జీవన భృతిని పాడు చేసుకోకండి. వచ్చే ప్రభుత్వంలో మీకు రూ. 10 వేలు వేతనం అందించి లక్షలు సంపాదించుకునే నైపుణ్య మార్గాలు చూపిస్తాం. వచ్చే కూటమి ప్రభుత్వంలో వికలాంగులకు రూ. 6 వేలు పింఛన్ ఇస్తాం. ప్రజాగ్రహ పెను తుఫానులో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం. జగన్ కు దింపుడు కల్లం ఆశ ఇంకా ఉంది. బీసీ కులగణనతో పాటు యువత స్కిల్ సర్వే కూడా చేసి వారి అభిరుచి మేరకు నైపుణ్య కేంద్రాలు పెడతాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. కోనసీమలో కూడా హైటెక్ టవర్ నిర్మించే బాధ్యత తీసుకుంటాం. నా భవిష్యత్ ఆలోచనలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి లాంటి క్రియేటివ్ ఆలోచనలు తోడైతే అద్భుతాలు సాధించగలం. మళ్లీ మంచి రోజులు రావాలని రాష్ట్ర ప్రజలంతా వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. కూటమిలోని మూడు పార్టీలు పోటీ చేసే చోట్ల మూడు పార్టీల కార్యకర్తలు, నాయకులు కలసి పని చేయాలి. ఓట్ల బదిలీ పక్కాగా జరగాలి” అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్