• 2014లో తండ్రి లేని బిడ్డనన్నాడు
• 2019లో బాబాయిని చంపేశారంటూ వచ్చాడు
• ఇప్పుడు వృద్దులను పింఛన్లు ఇవ్వకుండా చంపి శవ రాజకీయాలు చేస్తున్నాడు
• అన్ని రంగాలనీ ఆదుకునే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటుంది
• ఆంధ్రప్రదేశ్ పురోగమనానికి కేంద్రంలోని ఎన్డీఏ సహకారం అవసరం
• వైసీపీ విధ్వంసంలో నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం
• నిడదవోలు వారాహి విజయభేరీ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు
‘దుర్మార్గ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ సింహం సింగిల్ గా వస్తుందంటూ ప్రచారం చేస్తున్నాడు. జగన్ ఎప్పుడూ సింగిల్ గా రాలేదు. శవాలతోనే రాజకీయాలు చేశాడు. 2014లో తండ్రి మరణాన్ని అడ్డుపెట్టుకుని తండ్రి లేని బిడ్డను ఆదరించమని అడిగాడు. 2019లో బాబాయ్ హత్యను చూపించి.. రాజకీయ ప్రత్యర్ధులు చంపేశారని సానుభూతి పొందాడు. ఇప్పుడు వృద్ధులకు ఇవ్వాల్సిన పింఛన్లను కావాలని నిలిపివేసి వారి చావులకు కారణమై మళ్లీ శవ రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచార’ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. చివరికి ఈ ముఖ్యమంత్రి దెబ్బకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా భయపడుతున్నారు.. సీటు ఇస్తామంటే ఎంపీలు భయపడి పారిపోతున్నారు అన్నారు. నాలుగేళ్ల పదవీ కాలం ఉన్నా ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి మరీ పార్టీలు మారుతున్నారని తెలిపారు. బుధవారం రాత్రి నిడదవోలు గణేష్ చౌక్ లో జరిగిన వారాహి విజయభేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ..”రాష్ట్రంలో బాగుపడింది, న్యాయం జరిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. రాష్ట్రాన్ని నలుగురే పాలిస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల లాంటి వారే బాగుపడ్డారు. ఎవ్వరికీ న్యాయం జరగలేదు. జగన్ రెడ్డి రాష్ట్రం మొత్తం సిద్ధం.. సిద్ధం అని తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధమయ్యారు. మూడు పార్టీల కలయిక మనందరి భవిష్యత్తు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసమే. 2014లో టీడీపీ, బీజేపీ కలసి పోరాడాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. పశ్చిమలో స్వీప్ చేశాం. మరోసారి అదే రిపీట్ కావాలి. ప్రజస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా మూడు పార్టీలు త్యాగాలు చేసి మీ ముందుకు వచ్చాం. నిండు మనసుతో ఆశీర్వదించండి. కొనఊపిరిపై ఉన్న రాష్ట్రాన్ని ఎన్డీఏ బతికిస్తుంది. మనం రాజధాని కట్టుకోవాలి, పోలవరం సహా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. ఇండస్ట్రియల్ కారిడార్లు నిర్మించుకోవాలి. అందుకు శ్రీ మోదీ గారి సహకారం కావాలి. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను గాడిన పెట్టే శక్తి యుక్తి ఎన్డీఏకి ఉన్నాయి. శ్రీ మోదీ గారి నాయకత్వంలో 2047 నాటికి 100 ఏళ్ల స్వతంత్ర భారతం సూపర్ పవర్ గా తయారవుతుంది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉండకూడదు.
• గొడ్డలి వేటు
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గొడ్డలి వేటుకు బలికాని వాళ్లు ఎవరూ లేరు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. కాలువల్లో పూడిక తీసే పరిస్థితి లేదు. వరదలు వస్తే సాయం చేయలేదు. దేశంలోనే అప్పులు ఎక్కువ చేసిన రైతులు రాష్ట్రంలో ఉండడం, ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం. ఇక యువతకు జాబు రావాలి అంటే కూటమి గెలవాలి. మెగా డీఎస్సీపైనే మొదటి సంతకం పెడతాం. రాష్ట్రంలో ఆడబిడ్డలకు న్యాయం జరగడం లేదు. పెట్రోలు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. బీసీలకు, ఎస్సీలకు ఒక్క పని జరిగింది లేదు. ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ పంపుతాడు. మళ్లీ ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అందర్నీ చంపి డోర్ డెలివరీ చేస్తారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేశాడు. నేను తలచుకుంటే ఒక్క అడుగు వేసేవాడు కాదు. ఈ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు అడుగడుగునా ఆటంకాలే. విశాఖ వెళ్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి వస్తుంటే అడ్డుకున్నారు. ఎన్నడూ చూడనన్ని కేసులు విపక్షాలపై పెట్టారు. జగన్ అన్యోన్యంగా ఉన్న కులాల మధ్య రాజకీయ చిచ్చు రేపాలని చూస్తున్నాడు. కుల రాజకీయాలు చేస్తున్న నిన్ను ఆ చిచ్చులోనే దగ్దం చేస్తాం. మత రాజకీయాలు చేస్తున్నాడు. విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. ఇలాంటి రాజకీయాలు చేస్తే నీ అడ్రెస్ గల్లంతవుతుంది. చివరికి ప్రాంతాల మధ్యచిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. అన్నింటిని అధిగమించేందుకు కలసి ముందుకు రావాలి.
• మెరుగైన సంక్షేమం అందిస్తాం
కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అసలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన వ్యక్తి శ్రీ ఎన్టీఆర్ గారు. మా ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన కార్యక్రమాలు ఇచ్చి ఆదుకుంటాం. సూపర్ సిక్స్ కి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలు కలిపి పది పాయింట్లతో మ్యానిఫెస్టో అమలు చేస్తాం. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం. అన్నదాతను ఆదుకుంటాం. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ ఇస్తాం. నిడదవోలు సమస్యలన్నీ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. భవన నిర్మాణ కార్మికుల బాధ్యత స్వీకరిస్తాం. రాజమండ్రి పార్లమెంటు బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న శ్రీమతి పురంధేశ్వరి గారిని, నిడదవోలు జనసేన అభ్యర్ధి శ్రీ దుర్గేష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి కూటమిని బలపర్చండి” అని కోరారు.
• హుదూద్, మిచాంగ్ తుపానులను మించినది వైసీపీ విపత్తు : శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు కూటమి అభ్యర్ధి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు మాట్లాడుతూ.. “రాష్ట్రాన్ని దెబ్బ తీసిన ప్రకృతి వైపరీత్యాలు హుదూద్, మిచాంగ్ తుపానులకి మించి ప్రమాదకరమైన వైపరీత్యం ఐదేళ్లుగా రాష్ట్రాన్ని వైసీపీ రూపంలో కుదిపేస్తోంది. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలయ్యింది. అన్ని విధాలా కుదేలయ్యింది. ఒకప్పుడు అభివృద్ధికి మారుపేరుగా ఉన్న రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా తలలేని మొండెంలా తయారయ్యింది. ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనమంతా నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల ఆకాంక్షల మేరకు రాజు పాలన అందించాలన్న పెద్దల మాట రాష్ట్రంలో అమల్లోకి తేవాల్సిన అవసరం ఉంది. తమ జేబులు నింపుకునేందుకు నాణ్యతలేని మద్యం తాగించి ఆడపడుచుల పుస్తెలు తెగినా ఫర్వా లేదు అన్నట్టు పరిస్థితులు తయారయ్యాయి. రాష్ట్రంలో బీసీ కమిషన్ కి చట్టబద్దత లేకుండా చేసింది. ఎస్సీ డ్రైవర్ ని ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరిగిన పరిస్థితి లేదు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గానికి కూడా న్యాయం జరిగిన పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా మార్పు అవసరం. శ్రీ మోదీ గారి స్ఫూర్తి, శ్రీ చంద్రబాబు నాయుడు గారి యుక్తి, శ్రీ పవన్ కళ్యాణ్ గారి శక్తి ఇక్కడ కనబడుతోంది. మన సత్తా ఏంటో మే 13వ తేదీన వైసీపీ నాయకులకు చూపించాలి” అన్నారు.