• వైసీపీ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రజల బాధ్యత
• రూ.10 ఇచ్చి రూ.100 దోచుకునే వైసీపీ పాలన కావాలా..?
• రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి కూటమి ప్రభుత్వం అవసరం
• చీకటి పాలన అంతానికి ఓటు చీలకూడదని సంకల్పించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
• తణుకు ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
‘టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వేసే ప్రతి ఓటు రాష్ట్రాన్ని రక్షించుకునే ఓటు. వైసీపీ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మరోసారి మూడు పార్టీలు చేతులు కలిపాయి. నాడు విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు మూడు పార్టీలు కలిశాయి. జగన్ కబంధ హస్తాల నుంచి కాపాడేందుకు మరోసారి చేతులు కలిపినట్టు’ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. జగన్ ఇష్టానుసారం విధ్వంస రచన చేసి రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీదకు తెచ్చాడని, కొన ఊపిరి మీద ఉన్న రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం ఆక్సిజన్ లా పని చేస్తుందని తెలిపారు. శక్తినిచ్చి బతికించుకోవాలని ప్రజలను కోరారు. రాష్ట్రాన్ని బతికించుకోవడం కోసమే పవర్ ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ మోదీ గారు, అనుభవం ఉన్న తాను కలిశామన్నారు. బుధవారం సాయంత్రం తణుకు నరేంద్ర మోదీ సెంటర్ లో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ.. “2019లో అధికారం ఇస్తే అభివృద్ధి చేశాం. ప్రతి క్షణం రాష్ట్రం కోసం తపించాం. రాజధాని కావాలని అమరావతిని మొదలు పెట్టాం. సాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. పోలవరాన్ని 72 శాతం పూర్తి చేశాం. 11 కేంద్ర విద్యా సంస్థలు తెచ్చి పనులు చేశాం. 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాం. ప్రతి కుటుంబానికి బాసటగా నిలిచాం. పెట్టుబడులు తెచ్చి ప్రతి కుటుంబానికి అండగా నిలిచాం. ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్ ప్రజల తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు. ముద్దులు పెట్టాడు. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ఇప్పుడు రాష్ట్రాన్ని బతికించుకోవాల్సిన పరిస్థితులు ఆసన్నమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చుకోవాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్రంలోని శ్రీ మోదీ గారి సహకారం అవసరం. అప్పుడే శిధిలమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టగలం. రాష్ట్రం కోసమే కూటమిగా ఒక్కటయ్యాం. ఇందులో మాకు ఎలాంటి స్వార్ధం లేదు.
• గంజాయి పాలన కావాలా? యువతకు ఉద్యోగాలు కావాలా?
ప్రతి ఇల్లు, ప్రతి పౌరుడు ఆలోచించాలి. మీకు విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి కావాలా? సంక్షేమ పాలన కావాలా? సంక్షోభ పాలన కావాలా? బిడ్డలకు ఉద్యోగాలు కావాలా? గంజాయి పాలన కావాలా? ఆస్తులకు రక్షణ కావాలా? నడుములు విరిగే రోడ్లు కావాలా? రహదారుల భద్రత కావాలా? పది ఇచ్చి వంద దోచేసే దొంగలు కావాలా? మీ సంపద పెంచే కూటమి కావాలా? సచివాలయాలు తాకట్టు పెట్టి అప్పులు చేసే పార్టీలు కావాలా? సంపద సృష్టించే పార్టీలు కావాలా? ధరల బాదుడు కావాలా? దోపిడి లేని పథకాలు కావాలా? ఆడపడుచులు ఆలోచించండి. మందు బాబులు మీరు అనారోగ్యం పాలు కావాలో ఆలోచించుకోండి. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసే నాయకులు కావాలా? ఎస్సీలకు ఇన్నోవా కార్లు ఇచ్చి ఆర్ధిక చేయూత ఇచ్చే పాలన కావాలా? ప్రతి అంశంపై ప్రతి ఇంటిలో చర్చ జరగాలి.
• రాష్ట్రంలో బాగుపడింది ఒక్క జగన్ మాత్రమే
పేదల మనిషిని అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి.. పేదల ఆస్తులు దొంగిలించిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఒక్క పేదవాడైనా బాగు పడ్డాడా? ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ఆదాయం పెరిగిందా? అప్పులు పెరిగాయా? ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒక్క జగన్ మాత్రమే. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలిచే బాధ్యత ఇస్తే.. ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ఆలోచనలు జగన్ చేశాడు. ప్రతిపక్షాల గొంతునొక్కేయడానికి జీవో నంబర్ 1 తెచ్చాడు. గడచిన ఐదేళ్లలో అక్రమ కేసులు, అరెస్టులు, కూల్చివేతలు, దాడులు, కబ్జాలతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన వైసీపీని బూడిద చేసే సమయం ఆసన్నమైంది. మే 13వ తేదీన మీరంతా స్వేచ్చగా ఓటు వేయండి. ఆలోచన చేసి మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటు వేయండి. కులం, మతం కాదు రాష్ట్రమే ముఖ్యంగా ఓటు వేయండి. మీరిచ్చే తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి. జగన్ ఒక ఫేక్ ఫెలో. సోషల్ మీడియాని చూస్తే అది అర్ధం అవుతుంది. ఇంత అన్యోన్యంగా ఉంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మాకు మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేశాడు. రాష్ట్రంలోకి ఫేక్ ఫెల్లోస్ బోగస్ వ్యక్తులు వచ్చారు. వారిని నమ్మితే ఇబ్బంది పడతాం. వాస్తవాలు మాత్రమే నమ్మండి.
• వాలంటీర్లు.. రాజీనామా చేయొద్దు
మేము కూటమి తరఫున నిర్ధిష్టమైన అజెండాతో వస్తున్నాం. మా ఆడబిడ్డల్ని శక్తివంతంగా చేసే బాధ్యత మాది. సూపర్ సిక్స్ తీసుకువచ్చాం. ఆడబిడ్డ నిధి ఏర్పాటు చేసి ఇంట్లో ఎంత మంది ఆడపడుచులు ఉంటే అంత మందికి నెలకు రూ.1500 చొప్పున ఇస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తాం. అన్నదాతకు ఏడాదికి రూ. 20 వేలు ఇచ్చి ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. యువత మొత్తం మా వైపే ఉన్నారు. మీ రుణం తీర్చుకుంటాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తీసుకుంటాం. జగన్ వస్తున్నాడంటే పారిశ్రామికవేత్తలు పారిపోతారు. మేము వస్తున్నామంటే రాష్ట్రానికి తిరిగి వస్తారు. తణుకులో హైటెక్ సిటీ లాంటి టవర్ నిర్మాణం చేస్తాం. ఇంటింటికీ మంచినీరు, బీసీలకు రక్షణ చట్టం తెస్తాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా పేదలకు రూ. 4 వేల ఫించన్ ఇచ్చే బాధ్యత మాది. ఒక నెల తీసుకోకపోతే మరుసటి నెలలో ఇస్తాం. బీసీలకు 50 సంవత్సరాలకే ఫించన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. వికలాంగులకు రూ. 6 వేల ఫించన్ ఇస్తాం. కూటమి ప్రభుత్వంలోనూ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. ఎవ్వరూ తప్పుడు పనులు చేయవద్దు. మీ జీతం రూ. 10 వేలకు పెంచే బాధ్యత మాది. రాష్ట్రంలో వాలంటర్ వ్యవస్థే లేదని ధర్మాన చెబుతున్నారు. ఎవరూ రాజీనామా చేయొద్దు మీకు మేము అండగా నిలుస్తాం. మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం పెడతాం. యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం.
• కారుమూరి లాంటి ముదుర్ని జీవితంలో చూడలేదు
స్థానిక మంత్రి కారుమూరి లాంటి ముదురును నా జీవితంలో చూడలేదు. టీడీఆర్ బాండ్స్ స్కాములో రూ. 850 కోట్ల స్కామ్ చేశాడు. మరికొంత మంది వైసిపి వాళ్లు దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు. పేదల ఇళ్ల పేరిట స్థలాలు కొని అవే స్థలాలు ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఇంటికి రూ. 30 వేల కొట్టేశారు. పూడిక, చదును పేరిట డబ్బు దోచేశారు. పౌరసరఫరాల మంత్రిగా బియ్యం కాకినాడ పోర్టుకు దొంగ రవాణా చేసి డబ్బులు కొట్టేస్తాడు. వారాహి యాత్ర విజయాన్ని జీర్ణించుకోలేక జనసైనికుల మీద దాడి చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేస్తే నువ్వు ఎక్కడుంటావు. నువ్వు చేసిన తప్పులన్ని ఎక్కడున్నా పట్టుకొస్తాం. తడిచిన ధాన్యం కొనమంటే రైతుల్ని దుర్భాషలాడతాడు ఈ ఎర్రిపప్ప. ఈ ఎర్రిపప్పకు బుద్ది చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉండాలి. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తే జిల్లాలో 15కి 15 సీట్లు గెలిపించారు. ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, బీజేపీ కలసి మరోసారి వచ్చాం. వైసీపీకి డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. ఈ సారి యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్ పారిపోతాడు. మూడు పార్టీల కార్యకర్తలు 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్తానాల్లో మూడు పార్టీల అభ్యర్ధులను సొంత అభ్యర్ధులుగా భావించి గెలిపించాలి” అన్నారు. ఈ సభలో తణుకు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ, నరసాపురం లోక్ సభ అభ్యర్థి శ్రీ శ్రీనివాస్ వర్మ మూడు పార్టీల నాయకులు పాల్గొన్నారు.