• జనసేనకు రూ.ఐదు కోట్ల విరాళం
జనసేనకు విజయోస్తు…. విజయీభవ అని పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారు తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు, తన తమ్ముడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు శ్రీ నాగబాబు గారు చెంతనుండగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకొంటున్న ‘విశ్వంభర’ షూటింగ్ లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి వేదిక అయింది. సోమవారం ఉదయం పది గంటలకు లొకేషన్ కు చిన్నన్న శ్రీ నాగబాబు గారితో కలసి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ చిరంజీవి గారు ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు. శ్రీ చిరంజీవి గారి ఆశీర్వచనం అందుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీ చిరంజీవి పాదాలకు నమస్కరించారు. పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా అన్న చిరంజీవి గారి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి – అన్నయ్య ఆశీస్సులు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. నీ వెనుక నేనున్నాను అనే భరోసా దక్కింది. అనంతరం సోదరులు ముగ్గురూ కొంత సేపు సంభాషించుకున్నారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో లోకపావని నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టి.వి.లో ఆ దృశ్యాన్ని చూసిన శ్రీ చిరంజీవి గారు తన తమ్మునికి తన ఆశీర్వాద బలంతోపాటూ ఆర్థికంగానూ అండగా నిలబడాలని ఐదు కోట్ల రూపాయలకు చెక్కును శ్రీ చిరంజీవి గారు సిద్ధం చేసి మరునాడే అందచేశారు. శ్రీ చిరంజీవి గారి తనయుడు, గ్లోబల్ స్టార్ గా పేరుగాంచిన శ్రీ రామ్ చరణ్ గారు సైతం తండ్రి మాదిరిగానే జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. శ్రీ చిరంజీవి గారు చెక్కును అందించిన తరుణంలో జనసేన ప్రధాన కార్యదర్శులు శ్రీ నాగబాబు గారు, శ్రీ టి.శివశంకర్ గారు, కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం గారు, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధి శ్రీ వి.అజేయ కుమార్ గారు, అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరి ప్రసాద్ గారు పాల్గొన్నారు.