• మంత్రి దాడిశెట్టి రాజావి హత్యా రాజకీయాలు
• కాకినాడ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ ని బీజేపీ, టీడీపీ శ్రేణుల సహకారంతో భారీ మెజారిటీతో గెలిపిద్దాం
• తుని నియోజకవర్గ జనసేన సర్వ సభ్య సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు
“దుర్మార్గపు, రాక్షస పరిపాలనతో ప్రజలను పట్టి పీడిస్తోన్న వైసీపీని తుంగలో తొక్క బోతున్నాం.. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమిగా మనం గెలవబోతోన్నామ”ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. కాకినాడ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు నేతృత్వంలో తునిలో శుక్రవారం జరిగిన తుని నియోజకవర్గం పార్టీ సర్వసభ్య ఆత్మీయ సమావేశంలో శ్రీ నాగబాబు గారు ముఖ్య అతిథిగా హాజరై వందలాది మంది కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ మాట్లాడారు. స్థానిక తుని నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ర్ట మంత్రి దాడిశెట్టి రాజా నెం 1 క్రిమినల్ అని శ్రీ నాగబాబు గారు ఆరోపించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా నోరు పారేసుకొని మాట్లాడడం, అసత్యపు ఆరోపణలు చేయడం, అనరాని మాటలు అనడం తప్ప నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన చేసినది ఏది లేదని దుయ్యబట్టారు. హత్యా రాజకీయాలు చేసే దాడిశెట్టి రాజాను ఓడించాలని పిలుపునిచ్చారు. ముద్దులు పెట్టి మోసాలు చేసే వైసీపీ నాయకులు కావాలా, మధ్య తరగతి కుటుంబాల సమస్యలు తెలిసిన జనసేన పార్టీ కావాలా అని ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఇది అని అన్నారు. కొత్తగా నిర్మించిన కర్మాగారాలు లేవు, ఉద్యోగ నియామకాలు లేవు, మధ్య తరగతి కుటుంబాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల మీదనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన ఘనులు వైసీపీ నాయకులు అని విమర్శించారు. వైసీపీ పాలనలో ఒక్క అవినీతి కూడా జరగలేదు అని జగన్ రెడ్డి అతి పెద్ద జోక్ చెప్పిన మరుసటి రోజే – రాష్ట్రంలో 8 లక్షల అవినీతి ఫిర్యాదులు నమోదు అయ్యాయనే రిపోర్టును జనసేన బయటపెట్టింది అన్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి నిరుపేద కుటుంబాల ప్రజలు మరణిస్తే, సాధారణ మరణాలు అని సాక్షాత్తు దేవాలయం లాంటి శాసనసభలో అబద్దం చెప్పిన ఘనత జగన్ రెడ్డికి దక్కిందని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి సానుభూతితో ఓటు వేస్తే సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని చెప్పారు. ఈసారి మాత్రం మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని ప్రజలను కోరారు. పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, కాకినాడ లోక్ సభ సభ్యుడిగా శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి భాగస్వామ్య పార్టీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు తీసుకొచ్చి కాకినాడ జిల్లాను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
• పొత్తు కోసం నా సీటునే త్యాగం చేశాను..
అనకాపల్లి లోక్ సభ స్థానానికి పోటీ చేసేందుకు తాను సిద్ధమైన సంగతి వాస్తవం అని వెల్లడించారు. పోటీకి సిద్దంగా ఉండమని జనసేన అధ్యక్షులు చెప్పారని, తరువాత పొత్తు పరిణామాలతో బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మరుక్షణమే తప్పుకున్నానని అన్నారు. ఒక జన సైనికుడిగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నేను ఇచ్చిన గౌరవం అది అని పునరుద్ఘాటించారు. ప్రతీ జన సైనికుడు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యూహానికి అనుగుణంగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
• జనం మొహాల మీద కూడా జగన్ బొమ్మ గుద్దుతాడేమో..?
జగన్ రెడ్డికి తన ఫోటోలను ప్రచారం చేసుకోవాలనే మతి భ్రమించిన ఆలోచన తారాస్థాయికి వెళ్లిపోయిందని, ఇంకోసారి అవకాశం ఇస్తే ప్రజల మొహాలపైన జగన్ రెడ్డి బొమ్మను పచ్చ బొట్టు పొడుస్తారేమోననే సందేహాన్ని శ్రీ నాగబాబు గారు వ్యక్తం చేశారు. కోటి రూపాయలు కూడా విలువ లేని పని చేసి పదికోట్ల రూపాయల ప్రజా ధనంతో పబ్లిసిటీ చేసుకోవడం జగన్ రెడ్డికి సర్వ సాధారణం అయిపోయిందని అన్నారు. ప్రభుత్వ నిధులతో ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు జగన్ రెడ్డి పేరు పెట్టుకొని ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటున్నారని శ్రీ నాగబాబు గారు ఆరోపించారు. దేశానికే దిక్సూచి, మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న సంక్షేమ పథకాలకు పేరు మార్చి జగన్ రెడ్డి పేరు పెట్టుకోవడం ఏమిటో అన్నారు.
• కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో కూడిన సంక్షేమ పథకాలు
రానున్న కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో కూడిన సంక్షేమ పథకాలపై ప్రధాన దృష్టి ఉంటుందని శ్రీ నాగబాబు గారు వెల్లడించారు. ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం, రహదారుల అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉంటుందని చెప్పారు. వృద్దులు, దివ్యాంగులు, సంక్షేమానికి అర్హులైన ప్రతీ ఒక్కరి దగ్గరికి సంక్షేమ పథకాలు చేరే విధంగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రణాళికలు చేస్తోందని తెలిపారు.
• చలమలశెట్టి సునీల్ కాకినాడలో కోట్లు దోచుకుంటున్నారు
చలమలశెట్టి సునీల్ అనే వ్యక్తి ఎంపీ కాకుండానే కాకినాడలో మైనింగ్ మాఫియాను నడుపుతూ కోట్లు దోచుకుంటున్నారని, ఆయనకు అవకాశం ఇస్తే మరింత దోచుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి పొత్తులో భాగంగా శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటే స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్, కాకినాడ లోక్ సభ కూటమి అభ్యర్థి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ప్రముఖ సినీ దర్శకులు శ్రీ మెహర్ రమేష్, జనసేన ఎన్.అర్.ఐ. విభాగం ఆస్ట్రేలియా కన్వీనర్ శ్రీ కొలికొండ శశిధర్, జనసేన అధికార ప్రతినిధి శ్రీ దాసరి కిరణ్ గారు, తుని నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ చోడిశెట్టి గణేష్, జిల్లా కార్యదర్శి శ్రీ వంగలపుడి నాగేంద్ర, వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ ప్రతినిధులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.