మీ కుటుంబ సభ్యుడిలా సేవలందిస్తా

కుటుంబ

• ఉప్పాడ కొత్తపల్లి మండల మత్స్యకార మహిళల సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్
‘నేను మీ ఇంట్లో మనిషిని అనుకోండి. మీ కుటుంబ సభ్యుడిలా పని చేస్తాను. పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకుంటాను. పిఠాపురం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ఈ నియోజకర్గంలోని ప్రతి సమస్య నా సమస్య అనుకొని పరిష్కరించే బాధ్యత తీసుకుంటాన’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని మత్స్యకార మహిళలతో మంగళవారం ఆయన ప్రత్యేకంగా సమావేశం కావాలని భావించారు. అయితే చివరి నిమిషం వరకు సమావేశానికి అనుమతులు రాకపోవడంతో పాటు, రాజకీయ ప్రసంగాలు చేయవద్దని అధికారులు చెప్పడంతో రాజకీయ వ్యాఖ్యలకు తావు లేకుండా కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ఉంది. ప్రతి సమస్యను తెలుసుకోవాలని భావిస్తున్నాను. సమస్యలు లేని ఓ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. అయితే కొన్ని కారణాల రీత్యా జిల్లా అధికారులు ఈ సమావేశానికి అనుమతి ఇవ్వలేదు. అయితే ఒకటి మాత్రం చెబుతున్నాను. నేను పిఠాపురంలోనే ఉంటాను. మీ అందరికీ అండగా నిలుస్తాను. ప్రతి ఒక్కరినీ కలిసేలా, కష్టాల్లో భరోసానిచ్చేలా పని చేస్తాను. నన్ను ఇంట్లో వాడిగా అర్థం చేసుకోండి. మరోసారి కలిసి అన్ని విషయాల మీద మాట్లాడతాను. ఎన్నికల కోడ్ దృష్ట్యా అధికారులు చెప్పినట్లుగా వినక తప్పదు. వారికి మనం సహకరించాలి.’’ అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ కాకినాడ పార్లమెంటు అభ్యర్థి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పార్టీ నాయకులు డా.జ్యోతుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
• 48 గంటల ముందే దరఖాస్తు చేసినా రాని అనుమతి
ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని పార్టీ వీర మహిళలతో మంగళవారం స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాలులో సమావేశం ఏర్పాటు నిమిత్తం జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు 48 గంటల ముందే జిల్లా అధికారులకు అనుమతి కోసం దరఖాస్తు చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశంలో పాల్గొంటారని, అనుమతి మంజూరు చేయాలని కోరినా జిల్లా అధికారులు దాన్ని తాత్సారం చేశారు. పోలీసులు స్పందిస్తారని చివరి నిమిషం వరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వేచి చూశారు. సమావేశానికి అనుమతి వస్తుందని భావించి, ఉప్పాడ కొత్తపల్లి కి చేరుకొని స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. గంటకు పైగా ఆయన బయటే వేచి చూసినా చివరికి అనుమతి రాలేదు. అయితే సమావేశానికి వీర మహిళలు భారీ సంఖ్యలో తరలిరావడం, చాలాసేపు వేచి చూస్తున్నారని తెలిసి వారితో రాజకీయ వ్యాఖ్యలు లేకుండా కొద్దిసేపు మాట్లాడతానని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేవలం 4 నిమిషాల పాటు ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు లేకుండా మాట్లాడారు. అధికారులకు, వ్యవస్థలకు జనసేన పార్టీ గౌరవం ఇస్తుందని, అనుమతి ఇవ్వకపోవడానికి కారణాలేమిటో మాత్రం తెలియడం లేదని శ్రీ పవన్ కళ్యాణ్ గారు జిల్లా యంత్రాంగం తీరుపై వాపోయారు. ఎన్నికల నియమావళిని పూర్తిస్థాయిలో గౌరవిస్తామని చెప్పారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్