• సర్వమతాలు, సర్వ ధర్మాల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తా
• జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
• పిఠాపురం చారిత్రక బాప్టిస్టు సెంటినరీ చర్చి సందర్శన.. ప్రత్యేక ప్రార్ధనలు
‘నా దేశం నాకు సర్వ మతాల పట్ల సమాన విశ్వాసం కలిగి ఉండడాన్ని నేర్పింది. రాజకీయ పార్టీ అధినేతగా సర్వ మతాలు, సర్వ ధర్మాల పట్ల సమాన బాధ్యతతో వ్యవహరిస్తాను. అన్ని మతాలు, ధర్మాలు బాగుండాలి” అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. మంగళవారం ఉదయం పిఠాపురం పట్టణంలోని చారిత్రక ఆంధ్ర బాప్టిస్ట్ సెంటినరీ చర్చిని సందర్శించారు. క్రైస్తవ మత పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి క్షేమం కోరుతూ, ఆయనకు ఉన్నత స్థానం ప్రాప్తించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బైబిల్ వాక్యాలు చదివి వినిపించి ఆశీర్వాదాలు అందించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు అన్న బైబిల్ సూక్తి నాకు దిక్సూచి. బైబిల్ స్ఫూర్తి నన్ను ముందుకు నడిపిస్తుంది. సర్వ మతాలు, సర్వ ధర్మాలకు గౌరవం ఇచ్చే కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను. ఏ మతం కూడా చెడు చేయమని చెప్పదు. దుర్మార్గాన్ని ప్రోత్సహించమని చెప్పదు. చారిత్రక ప్రసిద్ధి కలిగిన పిఠాపురం చర్చిలో ప్రార్ధనలు జరిపి ప్రభువు పట్ల వినమ్రత ప్రకటించేందుకు వచ్చాను. అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు. పార్టీ కాకినాడ పార్లమెంటు అభ్యర్ధి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, క్రైస్తవ మత పెద్దలు శ్రీ ఎలీషా బాబు, శ్రీ తమోఫిలిన్, శ్రీ గువ్వల సాల్మన్ రాజు తదితరులు ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.