• ఈ నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ది బాధ్యత నాది
• కూటమి అధికారంలోకి రాబోతోంది
• వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ.. జనసేన గ్లాసుకి పదునెక్కువ
• జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
• జనసేనలో చేరిన పిఠాపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు, ప్రముఖులు
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నాం. కూటమి అధికారంలోకి రాబోతోందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు జనసేన అభ్యర్ధులతోపాటు కూటమి పోటీ చేసిన స్థానాల్లో మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. సోమవారం సాయంత్రం పిఠాపురం నియోజక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. న్యాయవాదులు, ప్రముఖ వైద్యులు, వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు, పలువురు ప్రముఖులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. సుమారు 100 మందికి పైగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “జనసేన పార్టీని అర్ధం చేసుకుని బలోపేతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరినీ సాదరంగా జనసేన కుటుంబలోకి ఆహ్వానిస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం మొత్తాన్ని కలవాలన్న ఆశ ఉన్నప్పటికీ కొన్ని భద్రతాపరమైన కారణాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కిరాయి మూకలు సన్నటి బ్లేడులతో వచ్చి జనంలో కలసిపోయి మన మీద దాడులు చేస్తున్నారు. ప్రత్యర్ధుల పన్నాగాలు గమనిస్తూ మనమంతా ముందుకు వెళ్లాలి. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా, బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా, బాప్టిస్ట్ చర్చి సాక్షిగా పిఠాపురం ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. నన్ను ఒక్కసారి గెలిపించమని భగవంతుడిని కోరితే పిఠాపురం పిలిచింది. ఆ తల్లి.. పురుహూతికా అమ్మ వారు అనుమతి ఇస్తే ఇక్కడే ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటాను. అందర్నీ ప్రత్యేకించి కలుస్తాను. ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటాను. ఈ నియోజక వర్గ ప్రజలకి అందుబాటులో ఉంటాను. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి బాధ్యత నాది.
• కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుర్తిస్తాం
పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. అందుకు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ నిదర్శనం. వచ్చే 25 సంవత్సరాల కాలంలో కొత్తతరం నాయకులు ముందుకు రావాలి. ఇప్పటి నుంచి నిలబడితేనే రేపటి రోజున నాయకులు తయారవుతారు. జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నుంచి మండల, గ్రామ స్థాయి వరకు నాయకుల్ని తయారు చేస్తుంది. వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ.. జనసేన గ్లాసుకి పదునెక్కువ” అన్నారు. కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్ధి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి. మహేందర్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్, శ్రీ పి.హరిప్రసాద్, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ కె.శరత్, కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, తెలంగాణ ఇంఛార్జి శ్రీ ఎన్.శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.