వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టడమే ఏకైక లక్ష్యం

వైసీపీ

• రాబోయే 40 రోజులు మండల దీక్ష చేసినట్లుగా నిష్టగా పని చేద్దాం
• రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తు కోసం తపించాను
• రాబోయేది కూటమి ప్రభుత్వమే.. భారీ మెజార్టీతో ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం
• మూడు పార్టీల కార్యకర్తలు సమష్టిగా గెలుపు కోసం ముందుకు
• పిఠాపురం నియోజకవర్గ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమన్వయ సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్

‘మూడు పార్టీల సమన్వయంతో, పొత్తుల మీద ఎన్నికలను ఎదుర్కొవాలంటే సీట్ల కేటాయింపుల్లో ఎన్నో షరతులు, ఎన్నో అలకలు, మరెన్నో సంఘర్షణలు ఉంటాయి. కానీ వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఏర్పడిన జనసేన-తెలుగుదేశం-బీజేపీ పార్టీల పొత్తు విషయంలో ఎలాంటి అరమరికలు లేకుండా పొత్తు కుదిరింది. జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ లెక్క వేయలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, వైసీపీ కీచక పాలన నుంచి ప్రజలను బయటపడేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పొత్తులకు ఎలాంటి షరతులు పెట్టకుండానే ముందుకు వెళ్లాం. రాష్ట్రం కోసం, ప్రజల బాగు కోసం వెనక్కు తగ్గేవాడిని కాదు ‘ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆదివారం పిఠాపురంలో జనసేన- తెలుగుదేశం- బీజేపీ నాయకుల ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పిఠాపురం నియోజక వర్గం టిడిపి ఇంచార్జ్ శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ గారు, కాకినాడ లోక్ సభ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, పిఠాపురం నియోజక వర్గం బీజెపీ ఇంచార్జ్ శ్రీ బి. కృష్ణంరాజు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “పొత్తుల వల్ల మా పార్టీ నాయకులు కూడా చాలా నలిగిపోయారు. చాలా మంది రాజకీయంగా పోటీ చేయలేకపోయామని బాధపడ్డారు. కానీ రాష్ట్రం కోసం మనసుతో స్పందించాను. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గొప్పగా ఉండాలంటే కచ్చితంగా మూడు పార్టీలు కలిసి రాష్ట్రంలో పాలన సాగించాలని భావించాను. బీజేపీ కేంద్ర పెద్దలు తమకు ఎంపీ స్థానాలు ఎక్కువ కావాలని కోరితే రెండు ఎంపీ స్థానాలకే జనసేన పరిమితమైనా, బీజేపీ పెద్దల మనోభీష్టాన్ని కాదనకుండా ముందుకు వెళ్లాం. అందరినీ కలుపుకొని వెళ్లాలన్నదే నా ఆకాంక్ష.
• 80 శాతం మంది పొత్తుకు అంగీకరించారు
ఒక పార్టీలో విభిన్నమైన వ్యక్తులు, ఆలోచనలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఏకాభిప్రాయం రాకపోవచ్చు. కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎక్కువ మంది దేనివైపు మొగ్గు చూపుతున్నారో ఆ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. పొత్తు విషయంలో కూడా జనసేన, టీడీపీ పార్టీల్లో మొదటే 70 నుంచి 80 శాతం మంది పొత్తుకు అంగీకరించారు. దీంతోనే పొత్తుకు ముందడుగు పడింది. 2014లో ఎలాంటి షరతులు, డిమాండ్లు లేకుండా అప్పటి తెలుగుదేశం, బీజేపీ పొత్తుకు జనసేన సంపూర్ణంగా మద్దతు తెలిపింది. అప్పటి పరిస్థితుల్లో 10 మందిని ఎన్నికల్లో నిలబెట్టే సత్తా ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం సుస్థిరమైన పాలన కోసం సంపూర్ణంగా మద్దతు ఇచ్చాం. ఎలాంటి డిమాండ్లు, పదవులు ఆశించలేదు. ఇప్పుడు.. 2024లో సైతం జనసేన బలం పెరిగింది అని తెలిసినా గందరగోళం లేకుండా ముందడుగు వేయాలనే తలంపుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతోనే పొత్తులకు మనమే చొరవచూపాం. బీజేపీ-టీడీపీ పార్టీల వంటి బలమైన పునాదులు, సమూహాన్ని క్రమశిక్షణతో నడిపించే మెకానిజం జనసేన పార్టీ ఇంకా సంపాదించలేదు. మనకు యువబలం, పోరాడేతత్వం మెండుగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో దశాబ్ధాలుగా రాజకీయం చేస్తున్న పార్టీల ఎత్తుగడలు, ఎలక్షనీరింగ్, సమన్వయం చాలా కీలకం. జనసేన పార్టీ ఎల్లప్పుడు మంచిని స్వీకరిస్తునే ఉంటుంది. కొత్త విషయాలను, పార్టీ నిర్మాణాన్ని ఇతర పార్టీల నుంచి తెలుసుకుంటూ ముందుకు కదులుతాం.
• శ్రీ చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు బాధేసింది
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి, సైబరాబాద్ వంటి ప్రత్యేక నగరాన్ని తయారు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు గారిని వైసీపీ ప్రభుత్వం అకారణంగా జైల్లో పెట్టినప్పుడు చాలా బాధపడ్డాను. రాజమండ్రి వెళ్తున్నపుడు దారి పొడవునా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ నాయకుడి కోసం పడిన తపన కదిలించింది. అందుకే రాజమండ్రి జైల్లో శ్రీ చంద్రబాబు గారిని కలిసిన తరువాత నా వంతుగా ఏదైనా చేయాలి అనుకున్న సమయంలో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించాను. అప్పుడు ఆశించినట్లుగానే బీజేపీ కూడా తరువాత పొత్తులోకి రావడం ఆనందం కలిగించింది. నేను పొత్తు కోసం ఎంతగా తపించానో… పొత్తును గెలిపించడం కోసం మూడు పార్టీల నాయకులు అంతే కష్టపడాలి. అందరం కలిసి ఈ వైసీపీ పాలనను తరిమికొట్టాలి.
• శ్రీ వర్మ గౌరవానికి భంగం కలగనివ్వబోము
శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ గారి నాయకత్వ పటిమ, సమర్ధత, ప్రతిభ నేను పూర్తిగా అర్ధం చేసుకున్న వాడిని. శ్రీ చంద్రబాబు గారు గీసిన గీత దాటను అని వర్మ గారు చెప్పడం నాకు ఆనందం కలిగించింది. పిఠాపురంలో నా గెలుపు బాధ్యత తీసుకున్న శ్రీ వర్మ గారికి … నేను గెలిచిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లో ఆయన మర్యాద తగ్గకుండా, గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటాను. ఒంటెద్దు పోకడలకు పోను. పిఠాపురం నియోజకవర్గంలోని మూడు పార్టీల మండల నాయకులకు, నియోజకవర్గ నాయకులను తగిన విధంగా సమన్వయం చేసుకుంటాం. పిఠాపురం అభివృద్ధికి ఏం చేయాలి అన్నదానిపై మూడు పార్టీల నాయకులు ఎప్పటికప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుందాం. బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు రక్షణగా ఉండాలనే ఏకైక కోరికనే కేంద్ర పెద్దల వద్ద కోరాను. అలాంటి బీజేపీ నాయకులను కూడా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తాం. జనసేన పార్టీ నుంచి కాకినాడ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కష్టపడి పైకి ఎదిగిన యువకుడు. 2017లో రూ. 10 లక్షల పెట్టుబడితో మొదలు పెట్టిన టీ టైం వ్యాపార ప్రస్థానం దేశం దాటి నేపాల్ లో కూడా విస్తరించింది. యువత తెలివితేటలకు ఉదయ్ శ్రీనివాస్ ప్రత్యక్ష తార్కాణం. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ మంచి వ్యక్తే అయితే తప్పడు పార్టీలను ఎంచుకుంటారు. ఆయన ఇక్కడ సంపదను పట్టుకుపోతే… ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడ నుంచి సంపద సృష్టించి యువతకు దారి చూపుతాడు. అలాంటి యువకుడికి మీరంతా అండగా నిలబడాలి.
• పింఛన్లు అందరికీ అందేలా కృషి చేద్దాం
ప్రతి నెల అందాల్సిన సామాజిక పింఛన్లు ఎన్నికల కోడ్ వల్ల ఈ నెల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వాలంటీర్లు లేకుండా పింఛన్లు పక్కాగా పంపిణీ చేయడంలో అధికారులకు తగిన విధంగా మూడు పార్టీల నాయకులు తోడ్పాడాలి. ఎన్నికల నియమావళిని అనుసరించి తగిన విధంగా ప్రభుత్వ యంత్రాంగానికి సహాయం చేద్దాం. వచ్చే కూటమి ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోదని ప్రజలకు చెప్పండి. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు నేను సహాయం చేశాను అంటే సొంతంగా సినిమాలు చేసి సంపద సృష్టించి ఆ డబ్బును ఆపదలో ఉన్న వారికి పంచాను. వచ్చే కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టించి కచ్చితంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తాం. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇస్తున్న దానికంటే ఎక్కువగానే ఇస్తాం తప్ప ఏ మాత్రం పథకాలు నిలిపివేసేది లేదు. వైసీపీ పాలనలో మద్యం, గంజాయి, ఇసుక, ల్యాండ్ మాఫియా వంటి వాటిని అరికడితే అన్ని పథకాలకు కచ్చితంగా డబ్బులు సర్దుబాటు అవుతాయి. వైసీపీ దోపిడీ అరికడితే సంక్షేమ పథకాలు అప్పులు లేకుండానే అమలు చేయొచ్చు. నేను మరోసారి గట్టిగా చెబుతున్నాను.. వచ్చేది కూటమి ప్రభుత్వమే. మనం కచ్చితంగా గెలుస్తున్నాం. భారీ మెజార్టీతో ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం. మూడు పార్టీల్లోని ప్రతి కార్యకర్త నాయకుడు 40 రోజుల మండల దీక్ష చేసినట్లు, రంజాన్ రోజా రోజులు ఉపవాసం ఉన్నట్లు నిష్టగా మన ప్రభుత్వ స్థాపనకు పని చేద్దాం. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా క్షేమం అనే రెండే అజెండాలుగా సమష్టిగా ఎన్నికలను ఎదుర్కొందాం. ఘన విజయం సాధిద్దాం” అన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్