• ప్రజాధనం దోచేసిన జగన్ పేదవాడు… సొంత డబ్బును పంచిన నేను పెత్తందారుడినా..?
• మద్య నిషేధం అని చెప్పి, కల్తీ మద్యం మరణాల్లో రాష్ట్రాన్ని ప్రథమం చేశారు
• మద్యం అమ్మకాల్లో డిజిటల్ కరెన్సీ తీసేసి రూ.20 వేల కోట్లు లూటీ
• వైసీపీ అవినీతిపై గత నాలుగేళ్లలో 8 లక్షలకు పైగా ప్రజా ఫిర్యాదులు
• మంత్రులు, వారి పేషీలపై 2 లక్షలకుపైగా ఫిర్యాదులు
• కాకినాడ పోర్టులో ఎన్నికల కోసం కంటైనర్లలో డబ్బులు దాచారనే ప్రచారం నడుస్తోంది
• దేవాలయాలపై దాడులు చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదో ప్రజలు నిలదీయాలి
• ఉమ్మడి ప్రభుత్వంలో యువతను నైపుణ్య సారథులుగా తయారు చేస్తాం
• పిఠాపురాన్ని ఆధ్యాత్మిక సర్య్కూట్ గా తయారు చేస్తా
• పిఠాపురం రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటా
• పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ తరహా ఆస్పత్రి
• వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్ చేతిలో మోసపోవద్దు
• పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో వారాహి విజయభేరీ సభలో శ్రీ పవన్ కళ్యాణ్
‘సిద్ధం పేరిట కేవలం ప్రచార హోర్డింగులకే రూ.600 కోట్లు ప్రజాధనం లూటీ చేసిన జగన్ పేదవాడు… ఒక్క ఎమ్మెల్యే లేకుండానే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకున్న నేను పెత్తందారుడినా..? మద్యం అమ్మకాల్లో డిజిటల్ కరెన్సీ లేకుండా చేసి రూ.20 వేల కోట్లు జేబులో వేసుకున్న వైసీపీ నాయకుడు పేదవాడు.. అయిదేళ్లు అధికారం లేకున్నా ప్రజల తరఫున పోరాడిన నేను పెత్తందారుడినా..? జేపీ వెంచర్స్ పేరుతో బినామీ కంపెనీకి ఇసుక కాంట్రాక్టు కట్టబెట్టి అడ్డగోలుగా దోచుకున్న ఈ ప్రభుత్వ పాలకుడు పేదవాడు… సొంత డబ్బును ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పంచిన నేను పెత్తందారుడినా..? ఆలయంలో పూజలు చేస్తున్న అర్చకుడిని కాలితో తన్ని, పరమపవిత్రంగా భావించే యజ్ఞోపవీతాన్ని మదమెక్కి తెంచేసిన వైసీపీ నాయకులు పేదవాళ్ళు… కష్టాల్లో ఉన్న ప్రజల వేదనను మనసుతో విన్న జనసేన పార్టీ పెత్తందారి పార్టీనా..? ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాల’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరారు. సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ ఇచ్చే వైసీపీ ఫ్యానును పూర్తిగా పక్కన పడేయాల్సిన సమయం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో జగన్ ను నమ్మి మళ్లీ మోసపోవద్దని పిలుపునిచ్చారు. వారాహి విజయభేరి యాత్రలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో శనివారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “జగన్ పదేపదే ఈ ఎన్నికలు పేదవారికి, పెత్తందారులకు మధ్య యుద్ధం అని మాట్లాడుతున్నాడు. ఆయన పార్టీ తరఫున ఎన్నికల్లో దిగుతున్న అభ్యర్థులు ఒక్కోక్కరికి రూ.400, రూ.600 కోట్ల మేర ఆస్తులున్నాయి. జగన్ మాత్రం మా వారికి అంతంత మాత్రం ఆస్తి మాత్రమే ఉందని చెబుతాడు తప్ప.. ఎంత ఉందో పూర్తిగా చెప్పడు. జగన్ ఆధ్వర్యంలో నడిచే సాక్షి పేపరు కడుపేద… భారతీ సిమెంట్స్ పేద సిమెంటు కంపెనీ.. జగన్ బినామీ కంపెనీలన్నీ పేద కంపెనీలే. సజ్జల గారు బాగా నిరుపేద, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారు పేదలే. కానీ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ గాని లేని నేను మాత్రం జగన్ దృష్టిలో పెత్తందారుడిని. నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ, ఎక్కడికి వెళ్లినా నన్ను కుటుంబసభ్యుడిలా భావించే నా అభిమానులు, జనసైనికులు, వీర మహిళల ఉప్పొంగే ఉత్సాహం చూసి జగన్ నన్ను ధనవంతుడిని అనుకుంటున్నారేమో. జన బలమే ధనమైతే నా అంత ధనవంతుడు ఇంకెవరూ ఉండరు.
• జగన్ మద్యం తాగడం వల్ల రాష్ట్రంలో వేలాది మరణాలు
రాష్ట్రంలో దొరికే రకరకాల వింత మద్యం తాగి గత అయిదేళ్లలో భారీగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఎందరో రకరకాల వ్యాధుల బారిన పడి జీవితాలను నాశనం చేసుకున్నారు. జాతీయ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్లలో లివర్ సిరోసిస్, బాంక్రియాటిక్ సమస్యలు, పేగులు పాడవడం, ఇతర ఆరోగ్య సమస్యలు అధికమైనట్లు నివేదికలు వచ్చాయి. నాసిరకం మద్యం తాగడం వల్ల రకరకాల జబ్బుల బారిన పడి ఎందరో మృతి చెందారు. ఇంకెన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. 2 వేల లీటర్లు మద్యం తయారయ్యే ముడి సరకులతో, 6 వేల లీటర్ల మద్యం తయారు చేస్తున్నారు. కేవలం అల్కాహాల్, నిషేధిత రసాయనాలు వాడి విషపూరిత మద్యం తయారుచేసి జనం మీదకు వదులుతున్నారు. దీంతో మద్యం పూర్తి విషకారకంగా మారింది. ఇన్ని చావులకు కారణమైన జగన్ చెప్పే పెత్తందారీ సూత్రం ప్రకారం ఎవరు పేదల జీవితాలను చిధ్రం చేస్తున్నారో, ఎవరు పెత్తాందారుడో తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం మరణాలకు కారణం జగన్. రాష్ట్రంలో దొరుకుతున్న మద్యం తాగి మతిస్థిమితం, చూపు కోల్పోయిన వారు, మూర్చ, లివర్ ఫెయిల్యూర్ అయిన వారు చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ లో మద్య నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చేసిన విధ్వంసం ఇదీ. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు రావడంతో పేదలు, పెత్తందారులంటూ కథలు చెబుతున్నాడు.
• డిజిటల్ కరెన్సీ తీసేసి రూ.20 వేల కోట్లు జేబులో వేసుకున్న జగన్
కేంద్రం డిజిటల్ కరెన్సీని అన్ని రంగాల్లో ప్రొత్సహిస్తుంటే జగన్ మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో డిజిటల్ కరెన్సీను తీసేశారు. రోజూ రూ.70 కోట్ల మేర ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరుగుతుంటే, కేవలం రూ.1.50 కోట్లు మాత్రమే డిజిటల్ కరెన్సీ ద్వారా లెక్కల్లోకి వస్తోంది. ప్రతి రూ.700 అమ్మకాల్లో కేవలం 0.07 శాతం మాత్రమే లెక్కల్లోకి వెళ్తోంది. 74 శాతం అమ్మకాలకు లెక్కల్లేవు. పూర్తిస్థాయిలో కరెన్సీ ఆధారంగా జరుగుతున్న లావాదేవీల్లో జగన్ రూ.40 వేల కోట్లు తన జేబులో వేసుకున్నాడు. మద్యం నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి ఇంత భారీ మొత్తంలో ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేసి వెనకేసుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు పేదల గురించి పెత్తందారుల గురించి నీతులు చెబుతున్నాడు. వైజాగ్ హోటల్ నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్న వ్యక్తి, తెలంగాణ సరిహద్దులో నా కార్యాలయానికి రాకుండా అడ్డుకున్న వ్యక్తి, మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ ను హింసించిన వ్యక్తి, దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యంను చంపి డోర్ డెలవరీ చేసిన వారిని వెనక తిప్పుకునే వ్యక్తి పెత్తందారుడు అవుతాడు కానీ… దశాబ్దకాలంగా ఒంటరిగా ప్రజల కోసం పోరాడుతున్న నేను ఎలా పెత్తందారుడినో జగన్ చెప్పాలి. మనకు చట్టసభల్లో ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా మనకు జగన్ ఎందుకు భయపడుతున్నాడో తెలుసా..? భవిష్యత్తు మనది. తప్పు జరిగితే ప్రశ్నించేది, పోరాడేది మనమే. ప్రజల కోసం నిలబడేది మనమే కాబట్టి జగన్ కు భయం.
• యువత దేహీ అనకుండా… పదిమందికి దారి చూపేలా తయారు చేస్తా
మనం ఎప్పుడూ చేయి చాచేలా ఉంచాలనేదే జగన్ ప్లాన్. యువత వృద్ధికి దారి చూపకుండా డబ్బులు వేశానని చెబుతాడు. నేను యువతకు పాతికేళ్ల భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పంతో రాజకీయాలు చేస్తాను. పిఠాపురం యువతకు 20 సెక్టార్లలో నైపుణ్యం సాధించేందుకు అవసరమయ్యే నైపుణ్య కేంద్రాన్ని తీసుకొస్తాను. రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ శ్రీ రఘురామరాజన్ మాటల ప్రకారం 2047 నాటికి బంగారు భారతం సాకారం కావాలంటే నైపుణ్యం గల యువత అవసరం. దాన్ని నేను బాధ్యతగా తీసుకొని పిఠాపురం యువతకు సరైన నైపుణ్యాన్ని అందించేలా, వారు భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకునేలా చూస్తాను. యువత చేతికి చేపలు తెచ్చి ఇవ్వడం కాదు.. వారు చేపలు పట్టేలా చూడటమే నా లక్ష్యం. యువత దేహీ అనే స్థాయి నుంచి పదిమందికి దారి చూపించే స్థాయికి తీసుకొస్తాను. యువత ఆలోచనలు నావి ఒక్కటే. నేనేమీ ముఖ్యమంత్రి కొడుకును కాదు. ఓ సగటు ఉద్యోగి కొడుకుని. నాకు సైతం నటనలో నైపుణ్యం సాధించేలా శ్రీ చిరంజీవి గారు నన్ను ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేర్పించారు. అలాగే యువతకు కూడా వారికి నచ్చిన సెక్టార్ లో నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దితే అద్భుతాలు సాధ్యం. అది పిఠాపురం నుంచి మొదలుపెడదాం.
• జగన్ పాలనపై లక్షలాది అవినీతి ఫిర్యాదులు
జగన్ చెబుతున్నట్లు తన పాలనలో అవినీతి లేదు అని చెప్పడం శుద్ధ అబద్ధం. ఏసీబీ నిర్వహించిన కాల్ సెంటర్ లో వైసీపీ పాలనలోని అవినీతిపై గత 4 ఏళ్లలో 8 లక్షలకు పైబడి ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. అన్ని రాజకీయపరమైన అవినీతికి సంబంధించినవే ఉన్నాయి. మంత్రులు, వీరి పరివారం తాలుకా అవినీతి మీద 2 లక్షల ఫిర్యాదులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవినీతి మీద 4 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో, అన్ని శాఖల్లో అవినీతి కొండలా పేరుకుపోయింది. ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఈ లక్షలాది ఫిర్యాదులే అందుకు నిదర్శనం. జగన్ పాలన బాగుంటే ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయి..? జగన్ పాలన చక్కగా ఉంటే ప్రజలెందుకు అతడ్ని ఇంటింకి పంపేయడానికి సిద్దమై ఉన్నారు..? జగన్ సత్యపురుషుడు అయితే ఈ పీఠికాపురం నుంచే అడుగుతున్నా… జగన్ పాలనలో అవినీతి ఎంత పేరుకుపోయిందో గుండెలపై చేయి వేసుకొని చెప్పు.
• 219 ఆలయాలు ధ్వంసం అయితే నిందితులెక్కడ..?
వైసీపీ పాలనలో రాష్ట్రం మొత్తం మీద 219 ఆలయాలు విధ్వంసం, అపవిత్రం అయ్యాయి. మొట్టమొదట పిఠాపురం నుంచే విధ్వంసం మొదలైంది. మరీ రాష్ట్రంలో ఇంత అలజడి జరిగితే ఆలయాల మీద దాడులు చేసిన నిందుతులు ఎందుకు బయటకు రాలేదు. వారిని ఎందుకు పట్టుకోలేదు అనేది ఓటు అడగానికి వస్తున్న వైసీపీ నాయకుల్ని అడగండి. కాకినాడలో, భీమవరంలో అర్చకులను అవమానించిన వైసీపీ నాయకుల దుశ్చర్యలపై నిలదీయండి. మదం తలకెక్కి ప్రవర్తించిన వైసీపీ నాయకులను నిలదీయండి. ఇలాంటి వైసీపీ పాలనను ఇంటికి పంపడానికి సంకల్పం చేసుకోండి. ఓటు అడగానికి వచ్చిన వైసీపీ నాయకులను ప్రజలతా నిలదీయాల్సిన అవసరం ఉంది.
• 54 గ్రామాల ప్రజలకు అండగా నిలుస్తాను
ఇప్పటి వరకు నేను నా దేశం, నా రాష్ట్రం అని ఆలోచించాను. నాకు పూర్తిస్థాయి సొంత నియోజకవర్గం అనే దానిపై ఆలోచించలేదు. నేను పిఠాపురం నియోజకవర్గాన్ని నా సొంత నియోజకవర్గంగా చేసుకుంటాను. 54 గ్రామాల ప్రజలకు అందుబాటులో సొంత కార్యాలయం, ఇల్లు తీసుకుంటాను. జాషువా విశ్వనరుడి లాంటి వాడిని నన్ను అంతా గుండెల్లో పెట్టుకుంటారు. పిఠాపురం ఖ్యాతిని జాతీయస్థాయిలో తెలిసేలా ఓ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. ఒక ఎన్నిక కోసం పిఠాపురం రాలేదు. ఈ నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుంటాను. సర్వమతాలకు నిలయమైన పిఠాపురం నేలను సుందరంగా తీర్చిదిద్దుతాను.
• కంటైనర్లలో డబ్బులు దాచారని జనం మాట్లాడుకుంటున్నారు
కాకినాడ పోర్టును డీజిల్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, అక్రమ బియ్యం ఎగుమతులకు హబ్ గా వైసీపీ నాయకులు మార్చేశారు. ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి పోర్టులో కొన్ని కంటైనర్లలో డబ్బులు దాచిపెట్టారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వైసీపీ నాయకులు ఓట్లు అడగటానికి మీ ఇంటికి వస్తే… కంటైనర్లలో దాచిపెట్టిన డబ్బు ఇప్పించండి… ఆ డబ్బుతో వ్యాపారాలు, జెట్టీలు, కొత్తపల్లి ఎస్.ఈ.జెడ్.లో పరిశ్రమలు పెట్టుకుంటామని అడగండి. కాకినాడ పార్లమెంట్ పరిధిలో మాఫియా డాన్ అరాచకాలు పెరిగిపోతున్నాయి. అక్రమంగా మట్టి, ఇసుకను తరలించి కోట్లు గడిస్తున్నాడు. జల్లేరు, దుర్గాడ, చేబ్రోలు, తాటిపర్తి చెరువుల్లో మట్టి మొత్తం తవ్వేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా లారీల్లో తరలిస్తున్నారు. ఒక లారీ లోడ్ రూ. 6వేలకు అమ్ముకుంటున్నాడు. అలాగే ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తవ్వేస్తున్నారు. జేపీ వెంచర్స్ తో పాటు వైసీపీ నుంచి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి కంపెనీ ఇష్టానుసారం దోచుకుంటున్నారు. రోజుకు 20 వేల క్యూబిక్ మీటర్లు చొప్పున ఇప్పటి వరకు 5 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేశారు. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఏర్పడిన గోతుల్లో చాలా మంది మత్యువాత పడుతున్నారు. నేను పిఠాపురంలో గెలిచాక ఈ మాఫియా డాన్ ఆటలు కట్టిస్తాను. ఆయన తాటాకుచప్పుళ్లకు బెదిరిపోయే వ్యక్తిని కాదు. మత్స్యకారులను నోటికొచ్చినట్లు తూలనాడిన డాన్ ని ఇంటికి పంపించే తీరుతాం.
• దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
పిఠాపురం నియోజకవర్గం ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాంతం. దీనిని దక్షిణ కాశీ, పాదగయగా పిలుస్తారు. జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందింది. అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠం పురుహూతిక దేవి నెలవైన ప్రాంతం. దత్తాత్రేయుడు శ్రీ పాద శ్రీ వల్లభుడిగా, పరమశివుడు కుక్కుటేశ్వరుడిగా ప్రజలకు దర్శినమిస్తున్న ప్రాంతం. ఇలాంటి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేస్తాం. నేషనల్ టూరిజం డెస్టినేషన్ గా మారుస్తాం. అయోధ్యకు మనమంతా ఎలా వెళ్తున్నామో… పిఠాపురానికి అలా తరలివచ్చేలా అభివృద్ధి చేస్తాం. పిఠాపురం నుంచి గొల్లప్రోలు వెళ్లే దారిలో పెద్దదూడ పశువుల సంత ఉంది. ఏళ్లుగా ట్యాక్సులు కట్టించుకుంటున్నారు కానీ కనీస వసతులు ఏర్పాటు చేయలేదు. అక్కడ షెడ్లు నిర్మించే బాధ్యత తీసుకుంటాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటాం. ఉప్పాడ కోతకు గురవ్వకుండా శాశ్వత చర్యలు చేపడతాం. మత్స్యకారులకు జెట్టీలు, కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తాం. ప్రతి మండలానికి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తాం. ఏలేరు, సుద్దగడ్డ రిజర్వాయర్లను ఆదునికీకరిస్తాం. కోటగుమ్మం సెంటర్ లో ఫ్లైఓవర్ నిర్మించి ట్రాఫిక్ సమస్యలు తీరుస్తాం. ఉప్పాడ బీచ్ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. పిఠాపురాన్ని సీడ్ హబ్ గా మార్చడంతో పాటు సెరీ, హర్టికల్చర్ రైతులను ఆదుకుంటాం. కొత్తపల్లి ఎస్.ఈ.జెడ్ లో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా బాధ్యత తీసుకుంటాం. ఈ సారి రాష్ట్రానికి పీడగా మారిన వైసీపీని ఇంటికి పంపాలి. జగన్ మాటలను మరోసారి నమ్మి మోసపోవద్దు. రాష్ట్రానికి భవిష్యత్తును ఇచ్చే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పొత్తును గెలిపించాలి’’ అని కోరారు.
• 40 రోజులే సమయం ఉంది ఆలోచించి ఓటు వేయండి
ఎన్నికలకు 40 రోజుల సమయం మాత్రమే ఉంది, మీ కోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మన యువత భవిష్యత్తు కోసం వచ్చాను. అన్ని వర్గాల కష్టాలు తెలిసిన వాడిని, కౌలు రైతులకు కష్టం వస్తే సినిమా నుంచి వచ్చిన డబ్బులు ఇచ్చాను, అలోచించి ఓటు వేయండి. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఇక్కడ ఇంటి స్థలం తీసుకుంటాను. మీ భావోద్వేగాలు గౌరవించే వ్యక్తిని. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు చేస్తాను. కేంద్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక పథకం ఉంది, కానీ మన పిఠాపురం కోసం వైసీపీ ఆ పథకాన్ని ఉపయోగించలేదు, కేంద్ర పెద్దలతో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకొని పిఠాపురంలో దేవాలయాల అభివృద్ది కోసం రూ.70 నుండి రూ. 100 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ది చేస్తాను, జాతీయ పర్యాటక ప్రాంతంగా చేస్తాను. తద్వారా వేలాది మంది యువతకు ఉపాధి కల్పించవచ్చు. సనాతన ధర్మానికి, సూఫీ విధానానికి వేదిక పిఠాపురం , నిజమైన భారతీయతకు చిహ్నం పిఠాపురం. పిఠాపురం జాతీయ రహదారి, పోర్ట్, రైలు మార్గం ఉన్న ప్రాంతం, సంపూర్ణ అభివృద్ది చేసే భాధ్యత తీసుకుంటాను. జనసేనను గెలిపించండి. పొత్తులో ఉన్న ప్రతీ అభ్యర్థిని గెలిపించండి. ముగింపు వ్యాఖ్యాలుగా జనసేనకు జయం.. జయం. జనసేన – బీజేపి – టీడీపి కూటమికి జయం…జయం. ప్రజలందరికీ జయం జయం కలగాలని కోరుకుంటున్నాను” అన్నారు.