• వారాహి విజయ యాత్రకు తరలి వచ్చిన ఆశేష జనవాహిని
• జన సైనికులు, వీర మహిళల కోలాహలం
• మద్దతుగా వచ్చిన టీడీపీ శ్రేణులు
• మచిలీపట్నం నుంచి బంటుమిల్లి మీదుగా భారీ ర్యాలీ
• గ్రామ గ్రామాన జనసేనానికి హారతులతో స్వాగతం
వారాహి విజయ యాత్రకు తరలివచ్చిన జన ప్రవాహం ముదినేపల్లి గురజా రోడ్డు ప్రాంతాన్ని ముంచెత్తింది. కైకలూరు నియోజక వర్గంతోపాటు గుడివాడ, పెడన నియోజక వర్గాల నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఆశేష జనవాహని కదలి వచ్చింది. జన సైనికులు, వీర మహిళలతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారాహి యాత్రకు మద్దతుగా తరలి వచ్చాయి. వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణుల నినాదాల మధ్య వారాహి రథం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కైకలూరు నియోజకవర్గ సమస్యలపై, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పారు. పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం సాగినంతసేపూ జనసైనికులు హర్షద్వానాలతో హోరెత్తించారు. కైకలూరు నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర నిమిత్తం మచిలీపట్నం నుంచి బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పెడన, కైకలూరు నియోజకవర్గాల ప్రజలు దారిపొడుగునా హారతుల స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలో మహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హారతులు పట్టేందుకు బారులు తీరారు. పెడన నియోజకవర్గం ముంజులూరు, మల్లేశ్వరం, బంటుమిల్లి, పెద్ద తుమ్మిడిల్లో వందలాది మంది జనసైనికులు, మహిళలు రోడ్ల మీదకి వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పూల వర్షంతో స్వాగతం పలికారు. ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రం అయిన సింగరాయపాలెంలో జనసేన-టీడీపీ శ్రేణులు వారాహి యాత్రకు మద్దతుగా జనప్రవాహంగా మారి రోడ్లను ముంచెత్తాయి. బంటుమిల్లి అడ్డరోడ్డు నుంచి ముదినేపల్లి వారాహి విజయ యాత్ర సభా స్థలి వరకు వందలాది బైకులు, కార్లతో ర్యాలీగా జనసేన శ్రేణులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనుసరించాయి. దారి పొడుగునా హారతులు పట్టిన ప్రతి ఆడపడుచుకీ అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు. ప్రతి గ్రామంలో రోడ్ షో నిర్వహించారు.
• కొల్లేటికి నువ్వే దిక్కు పవనన్నా..
కాలుష్యపు కోరల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న కొల్లేటి వాసులు తమను కాపాడమంటూ సభ వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. కొల్లేరులో పక్షుల్ని మాత్రమే కాదు మనుషుల్నీ గుర్తించండి.. కొల్లేరు ప్రజలకు మీ వల్లే న్యాయం
జరుగుతుంది.. కొల్లేరుకి నువ్వేదిక్కన్నా అంటూ ప్రదర్శించిన ప్లకార్డులు ఆలోచింప చేశాయి. కొల్లేటి బాధితులకి అండగా ఉంటామని శ్రీ పవన్ కళ్యణ్ గారు భరోసా ఇచ్చారు. వారాహి విజయ యాత్రకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు దారి పొడవునా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. జనసేన పార్టీ సిద్ధాంతాలతో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలతో కూడిన ఫ్లెక్సీలు ఆలోచింపచేశాయి.
• ప్లకార్డులతో వచ్చిన హీరోల అభిమానులు
జనసేనకు మద్దతు తెలిపేందుకు స్టార్ హీరోల అభిమానులంతా వారాహి యాత్రకు తరలివచ్చారు. శ్రీ ప్రభాస్, శ్రీ జూనియర్ ఎన్టీఆర్, శ్రీ మహేష్, శ్రీ అల్లు అర్జున్, శ్రీ రామ్ చరణ్, శ్రీ రజినీకాంత్ ల ఫ్లెక్సీలతో వచ్చిన అభిమానులు మా అందరి మద్దతు జనసేనకేనంటూ నినదించారు. తరలివచ్చిన ప్రతి హీరో అభిమానికి పేరు పేరునా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలిపారు.
• నమాజ్ విని ఆపిన ప్రసంగం
వారాహి సభ ప్రసంగం మధ్యలో 7.45 నిమిషాలకు మసీద్ నుంచి ముస్లిం సోదరుల నమాజ్ శబ్దం వినబడడంతో నమాజ్ పూర్తయ్యేంత వరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాన్ని నిలిపివేశారు. సర్వమత సమానత్వంపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
• పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన వారాహి యాత్ర
అవనిగడ్డ సభతో ప్రారంభం అయిన 4వ విడత వారాహి విజయ యాత్ర ముదినేపల్లి సభతో ముగిసింది. కృష్ణా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల పరిధిలో జరిగిన వారాహి యాత్రలో భాగంగా మూడు బహిరంగ సభల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలపై గళం విప్పారు. మచిలీపట్నంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలపై నేరుగా అర్జీలు స్వీకరించారు. ప్రతి సమస్య పరిష్కారినికి హామీ ఇచ్చారు. 4వ విడత వారాహి యాత్ర ఆద్యంతం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.