• వారాహి విజయయాత్ర సభకు పోటెత్తిన జన సైనికులు, వీర మహిళలు
• మద్దతుగా తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు
• మచిలీపట్నం నుంచి పెడన తోటమూల జంక్షన్ వరకు భారీ ర్యాలీ
• మద్దతుగా పెడన వరకు మాజీ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర బైక్ ర్యాలీ
• మచిలీపట్నంలో భారీ రోడ్ షో
• దారి పొడవునా శ్రీ పవన్ కళ్యాణ్ కి ఆడపడుచుల హారతుల స్వాగతం
పెడనలో జనసేన శ్రేణులు గర్జించాయి. వారాహి విజయ యాత్ర సభకు వేలాదిగా తరలి వచ్చాయి. జన సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల ప్రజలు ప్రతి అడుగులో అపూర్వ స్వాగతం పలికారు. ఆశేష జనవాహిని సాక్షిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయనాదం చేశారు. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా.. ఆ ఆంక్షల కంచెలు దాటుకుంటూ తోటమూల జంక్షన్ వేదికగా నిర్వహించిన వారాహి సభకు పెడనతోపాటు మచిలీపట్నం, పామర్రు, గుడివాడ నియోజకవర్గాల నుంచి సైతం వేలాదిగా జనం తరలివచ్చారు. జనసైనికులు, వీర మహిళలు, ప్రజల జయజయధ్వానాల మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభను ఉద్దేశించి ప్రసంగించారు.
• మచిలీపట్నం పురవీధుల్లో భారీ రోడ్ షో
అంతకు ముందు పెడన సభకు బుధవారం సాయంత్రం 5గం.30 ని.లకు మచిలీపట్నం నుంచి భారీ ర్యాలీగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారు. మచిలీపట్నం ఇంఛార్జ్ శ్రీ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో వేలాది జనసైనికులు బైకులతో ర్యాలీగా తరలిరాగా పెడన బయలుదేరారు. రేవతి సెంటర్లో మాజీ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ర్యాలీగా వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం పలికాయి. అక్కడి నుంచి ర్యాలీగా బస్టాండ్ సెంటర్, జెడ్పీ సెంటర్, వలందపాలెం, పోతేపల్లి మీదుగా పెడన తరలి వెళ్లారు. ప్రతి కూడలిలో వీర మహిళలు హారతులు పట్టగా, జన సైనికులు పూల వర్షం కురిపించారు. పార్టీ శ్రేణుల కేరింతల మధ్య పుర వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. జెడ్పీ సెంటర్ లో బాణాసంచా పేలుళ్లతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి మచిలీపట్నం బైపాస్ కూడలి, పెడన బైపాస్ మీదుగా ర్యాలీగా తోటమూల జంక్షన్ కి చేరుకున్నారు. జనసేనాని ర్యాలీతో మచిలీపట్నం నుంచి పెడన వరకు రహదారులు జనంతో కిక్కిరిశాయి. బందరు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భవనాలు మొత్తం జనంతో కిటకిటలాడాయి. హారతులతో వచ్చిన ప్రతి ఆడపడుచుకి, తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగారు. దారి పొడుగునా అభిమానులు కరచాలనం చేస్తూ ఉత్సాహ పరిచారు.
• ఆకట్టుకున్న ఎల్ఈడీ బ్యానర్లు
వారాహి విజయ యాత్ర సభ నేపధ్యంలో పెడనలో జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశాయి. మచిలీపట్నం నుంచి తోట మూల జంక్షన్ వరకు పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేశారు. సభా స్థలి వద్ద ఏర్పాటు చేసిన ఎల్.ఈ.డీ స్క్రీన్లతో కూడిన బ్యానర్లు ఆకట్టుకున్నాయి. ప్రజల పక్షాన పోరాడే వాడే పాలకుడు కావాలి.. జనసేనకు అండగా నిలవండి.. మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అనే నినాదాలతో ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్లు ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచే నియోజకవర్గం మొత్తం స్థానిక నేతల ఆధ్వర్యంలో వారాహి యాత్రకు మద్దతుగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యవర్గం, పార్టీ ముఖ్య నేతలు కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు.
* పోలీస్ ఆంక్షలు దాటుకొని..
మచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు వారాహి యాత్రకు మద్దతుగా తరలివచ్చారు. టీడీపీ శ్రేణులు వారాహి యాత్రకు వచ్చాయి. సభకు మద్దతుగా తరలివచ్చిన టీడీపీ నేతలకు పేరు పేరునా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలిపారు. వారాహి విజయ యాత్ర సభ నేపధ్యంలో పోలీసులు పెడన పరిసరాల్లో మితిమీరిన ఆంక్షలు విధించారు. అడుగడుగునా చెక్ పోస్టులు పెడుతూ సభకు తరలివచ్చే పార్టీ శ్రేణులు, ప్రజలకు ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేశారు. బైకులు, వాహనాలు దూరంగా నిలిపివేసినప్పటికీ కార్యకర్తలు కాలి నడకన సభకు తరలివచ్చారు.
• ఆంజనేయస్వామి దర్శనం
సభ అనంతరం తోటమూల జంక్షన్ సభా ప్రాంగంణం వద్ద ఉన్న ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామి వారిని శ్రీ పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారి వస్త్రంతో సత్కరించారు. అర్చన చేసి హారతులు ఇచ్చారు.