• కేసులు, కాంట్రాక్టుల మీదే మాట్లాడుతారు
• గోల్డ్ కవరింగ్ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి
• గోల్డ్ కవరింగ్ అసోసియేషన్ సభ్యులతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
‘వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టే వారిని వదిలేస్తారు.. కష్టపడి పని చేసే సమూహాలకు మాత్రం చేయగలిగింది కూడా చేయలేర’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. మన ఎంపీల మీద కేసులు లేకపోతే ప్రజల సమస్యల మీద మాట్లాడుతారన్నారు. రాష్ట్ర సమస్యలని కేంద్రంలో పెద్దల దృష్టికి తీసుకువెళ్తే.. మీ ఎంపీలు ఢిల్లీ వెళ్లి కేసులు, కాంట్రాక్టుల గురించి మాత్రమే మాట్లాడుతారని వారు చెబుతారన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ అసోసియేషన్ సభ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. వారి సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. 20 వేల కుటుంబాలకు ఈ వృత్తే జీవనాధారం అనీ, మౌలికవసతులు, పన్నుల చెల్లింపుల అంశాల్లో సమస్యలు తమను ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. చేనేతల వ్యవహారంలో కూడా జీఎస్టీ తాలూకు సమస్యలు ఉన్నాయన్నారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం ఇంఛార్జ్ శ్రీ బండి రామకృష్ణ, గోల్డ్ కవరింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు శ్రీ చలమలశెట్టి నరసింహారావు, అధ్యక్షులు శ్రీ పి.వి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.