శాంతి, సహనాలతో ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చనే మహాత్ముడి స్ఫూర్తిని భావితరాలకు అందిద్దాం

మహాత్ముడి

* వైసీపీ నాయకుల దోపిడీని నిలువరించాలి
* సమష్టిగా పోరాడితేనే మార్పు తీసుకురాగలం
* గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని వైసీపీ చంపేసింది
* మచిలీపట్నంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
* మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు అంజలి ఘటించిన శ్రీ పవన్ కళ్యాణ్

           ‘అహింస, శాంతి, సహనాలను పాటిస్తూ ఎన్ని కష్టాలెదురైనా ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చు అనే మహాత్ముడి స్ఫూర్తి చాలా గొప్పది. ఆయన దివంగతులై ఇన్ని దశాబ్ధాలు అయినా దేశం యావత్తు ఆ మహనీయుడికి అంజలి ఘటిస్తోంది అంటే దేశానికి ఆయన చేసిన నిస్వార్థ సేవే కారణమ’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి జనసేన పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. 154వ గాంధీ జయంతి వేడుకలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వారాహి విజయయాత్రలో భాగంగా మచిలీపట్నం పర్యటనలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోమవారం పరాసుపేటలోని సువర్ణ కళ్యాణ మండపంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “స్వాతంత్ర్య ఉద్యమంలో మచిలీపట్నంకు చాలా పత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో ఉద్యమాలు ఈ గడ్డ మీద పురుడు పోసుకున్నాయి. జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారు ఇక్కడే జన్మించారు. ఇలాంటి నేల మీద గాంధీ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.
* ఆంధ్ర జాతీయ కళాశాల అభివృద్ధి మన బాధ్యత
ఆంధ్ర జాతీయ కళాశాల చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పాటు చేశారు. స్వరాజ్యం కోసం దేశవ్యాప్తంగా నినాదాలు జోరందుకుంటున్న సమయంలో మనందరిలో ప్రేరణ నింపడానికి ఈ కళాశాలను నిర్మించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా మహాత్ముడు ఈ కళాశాలను సందర్శించారు. సర్వేపల్లి రాధాకృష్ణ, పింగళి వెంకయ్య, అడవి బాపిరాజు, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, నోరి దత్తాత్రేయుడు వంటి ఎంతోమంది మేధావులను సమాజానికి అందించిన గొప్ప చరిత్ర ఈ కళాశాలకు ఉంది. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన కళాశాల శిథిలావస్థకు చేరుకోవడం బాధాకరం. పాలకులు గాంధీ జయంతిని మొక్కుబడిగా కాకుండా శిథిలావస్థకు చేరుకున్న కళాశాల అభివృద్ధికి కృషి చేయాలి. మహాత్ముడు నడయాడిన ఆంధ్ర కళాశాలను అతి త్వరలోనే సందర్శిస్తాను.
* అన్ని ధర్మాలను కలిపేది సనాతన ధర్మమే
భారతదేశం పాటిస్తున్న సనాతన ధర్మం చాలా గొప్పది. అన్ని మతాలు, అన్ని ధర్మాలను గుండెల్లో పెట్టుకుంటుంది ఈ నేల. దానికి నిదర్శనమే ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే శ్రీరాముని పాటను గాంధీ గారు ‘ఈశ్వర్ అల్లా తేరోనాం.. సబ్‌కో సన్మతి దే భగవా న్” అని రెండో లైన్ చేర్చి పాడినపుడు దేశం మొత్తం అంగీకరించింది. ఏ దేశం కూడా వారి భక్తి పాటలు మార్చడానికి అంగీకరించవు. కానీ భారతదేశంలో మనం అంగీకరించాం. అంత గొప్ప ఔన్నత్యం ఈ దేశానికి మాత్రమే ఉంది. ఇలాంటి దేశంలో జన్మించినందుకు మనందరం గర్వపడాలి. దేశ గొప్పదనాన్ని మరింత పెంచిన గాంధీ గారికి రుణపడి ఉండాలి. మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జాతీయ గీతం వినిపించగానే దాదాపు 10 లక్షల మంది ఒకేసారి నిలబడి వందనం తెలిపారు. నిశబ్ధంగా నిలబడి జాతీయ గీతాలాపనలో అంతమంది ఒకేసారి పాల్గొనడం నన్ను కదిలించింది. బందరు నేల గొప్పతనం అది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి బందరు నేల మీదే మళ్లీ గాంధీ జయంతి జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
* గాంధీజీ గొప్పతనం అర్థం చేసుకోండి
మహాత్ముడి గొప్పతనం, ఔన్నత్యం మనందరం తెలుసుకోవాలి. ఆయనకు ఎవరితో ఎన్ని అభిప్రాయభేదాలు ఉన్నా దేశ ప్రజల ప్రయోజనాల కోసం వారితో కచ్చితంగా కలుస్తారు. అందుకు ఉదాహరణే.. మేధావి అయిన అంబేద్కర్ గారితో గాంధీ గారికి కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నా ఆయన సేవలు వినియోగించుకోవడం కోసం రాజ్యాంగ నిర్మాత స్థానానికి ప్రతిపాదించారు. గాంధీ గారి గొప్పతనాన్ని ఈతరం రాజకీయ నాయకులు అర్ధం చేసుకోవాలి. అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టడం, వేధించడం సరైన పద్ధతి కాదు. రాజకీయాల్లో అభిప్రాయభేదాలు సర్వసాధారణం. లోతైన అవగాహనతో వాటిని అధిగమించాలి. అంతే తప్ప కేసులు పెట్టి వేధించడం సరికాదు.
* సీఎం ఎంత సంపద తరలించారో అందరికీ తెలుసు
అవినీతి, దౌర్జన్యం, రౌడీయిజాలతో రాజకీయాలు నిండిపోయాయి. దేశంలో ఎంతోమంది నాయకులు ప్రజాధనాన్ని దోచుకొని విదేశాల్లో దాచుకున్నారు. మన ముఖ్యమంత్రి కూడా విదేశాలకు ఎంత సంపద తరలించారో మీకు తెలుసు. ఆ సంపద దేశానికి తిరిగి వస్తుందో? రాదో? తెలియదుగానీ నాయకుల దోపిడీని ఎక్కడోచోట నిలువరించాలి. అది మనం ఒక్కరమే చేయలేం. సమష్టిగా కలిస్తేనే మార్పులు తీసుకురాగలం. వైసీపీ నాయకుల మీద నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. వారి పాలసీల మీద మాత్రమే విభేదించాను. వైసీపీ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా చంపేసింది. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చినప్పుడు మాత్రమే మనం గాంధీగారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్లం అవుతాం. వచ్చే తరాలకు విలువలతో కూడిన రాజకీయాలు అందించాలి. బురద నుంచి కమలం ఎలా పుడుతుంటే కలుషితమైన ఈ రాజకీయాల నుంచి జనసేన అనే కమలం రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
* మహాత్మునికి ఘనంగా నివాళులు
అంతకు ముందు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. మహాత్ముడి చిత్రపటానికి నమస్కరించి పుష్పాంజలి ఘటించారు. మాజీ ప్రధాన మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా కావడంతో ఆయన చిత్రపటానికి కూడా నమస్కరించి నివాళులు అర్పించారు. జిల్లా కార్యవర్గంతో కలసి వేదిక మీద ఆశీనులై జాతి నేతలను స్మరించుకున్నారు. సుమారు 30 నిమిషాల పాటు మౌనముద్రలో పుస్తకపఠనం గావించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ , మచిలీపట్నం ఇంచార్జ్ శ్రీ బండి రామకృష్ణతోపాటు జిల్లాకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్