సత్యం, అహింస అనే ఆయుధాలతో యుద్ధం చేయడం ఎలాగో ప్రపంచ మానవాళికి ఆచరించి చూపిన మహాత్ముడు మన గాంధీజీ. మహాత్ముడి బాటలోనే నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లాంటివారు నడిచారు. మన దేశ స్వతంత్ర పోరాటాన్నీ, గాంధీజీ జీవితాన్నీ వేర్వేరుగా చూడలేము. అహింసాయుత ప్రజా పోరుతో పరాయి పాలన నుంచి భారత దేశాన్ని విముక్తం చేశారు. బాపూజీ జయంతి సందర్భంగా మహాత్ముణ్ణి స్మరించుకొంటూ మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రిటిషర్ల లక్షణాలు పుణికి పుచ్చుకున్న పాలకులు రాష్ట్రంలో ఉన్నారు. ప్రజలను వర్గాలుగా విభజించి పాలించే ధోరణిలో వెళ్తున్నారు. ఓటు, సత్యాగ్రహం విలువను గాంధీజీ తెలియచెప్పారు. ఆ ఆయుధాలు ఉపయోగించి నయా బ్రిటిష్ పాలకులను రాష్ట్రం నుంచి పంపించడం మన ధర్మంగా రాష్ట్ర ప్రజలు భావించాలని జనసేనాని పిలుపునిచ్చారు.