• రాజకీయ కక్ష సాధింపులకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని వాడుకుంటున్న వైసీపీ సర్కార్
• ప్రశ్నించిన ఎస్సీలపైనే ఆ చట్టాని ప్రయోగించి వేధిస్తున్నారు
• దళిత మేధావులు, అధికారులు, యువత దీనిపై చర్చించాలి
• ఉత్తరాంధ్రను విషతుల్యం చేస్తున్న వైసీపీ
• సహజ సంపదను గంపగుత్తగా కొట్టేసే ప్రణాళిక
• గంగవరం పోర్టు కార్మికులకు, నిర్వాసితులకు న్యాయం జరగాలి
• ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇప్పటికీ న్యాయం చేయలేకపోయిన జగన్
• ముఖ్యమంత్రి రుషికొండపై కాదు తాడి గ్రామంలో ఇల్లు నిర్మించుకుంటే జనం బాధలు తెలుస్తాయి
• విశాఖ జనవాణిలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
• ఉదయం 11గం. నుంచి 6 గం. వరకూ నిలబడి సమస్యలు విన్న జనసేనాని
‘ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వైసీపీ పాలనలో పూర్తిస్థాయిలో దుర్వినియోగం అవుతోంది. ఎస్సీలకు రక్షణగా నిలవాల్సిన చట్టాన్ని వైసీపీ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటోంది. తమకు అడ్డువచ్చే వారిపై, తమ అక్రమాలను ప్రశ్నించేవారిపై చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఏకంగా తమను ప్రశ్నించిన ఎస్సీలపైనే వైసీపీ నేతలు తప్పుడు కేసులుపెడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎస్సీ వర్గాలకు చెందిన యువతను అన్యాయంగా వాడుకొని, బీసీలపై కేసులు పెట్టిస్తున్నారు. ఎస్సీ, బీసీల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేసి వైసీపీ పబ్బం గడుపుకుంటోంది’ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. విశాఖపట్నంలో గురువారం నిర్వహించిన జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉత్తరాంధ్రలోని అన్నీ జిల్లాల నుంచి జనం తండోపతండాలుగా వచ్చారు. అందరి సమస్యలను సావధానంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు విన్నారు. ఈ సందర్భంగా దువ్వాడ నియోజకవర్గానికి చెందిన శ్రీ శ్రీనివాసరావు అనే రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తన 84 సెంట్ల స్థలాన్ని స్థానికంగా ఉండే దేవల వెంటకరమణ కబ్జా చేసిన వైనాన్ని, అడిగితే కొందరు ఎస్సీ యువకులను ఇంటి మీదకు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసును పెడతానని బెదిరిస్తున్న వైనాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందుంచారు. శ్రీనివాసరావుకు తీవ్ర అనారోగ్యంగా ఉన్నా, ఆక్సిజన్ మాస్కుతో వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తన వేదన చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సమస్యను విన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘ఎస్సీ, ఎస్టీలు నిజంగా అన్యాయానికి గురైనపుడు చట్టం వల్ల న్యాయం జరగడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామంలో బోదకాలు వ్యాధి ప్రబలితే పైనున్న ఎస్సీ కుటుంబాల వారు వదిలే వాడుక నీరు కిందకు రాకుండా కిందనున్న వారు అడ్డుకొన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అలాంటి వారికి అండగా నిలబడాలి. చట్టాన్ని వైసీపీ కేవలం రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి, ఇబ్బందిపెట్టడానికి వాడుకుంటోంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా బెదిరింపులకు, వేధింపులకు అస్త్రం కాకూడదు. తప్పుడు కేసులు పెట్టమని దళిత యువకులకు రాజకీయ పార్టీల నాయకులు చెబితే దాన్ని యువత నిలదీయండి. మా రక్షణ కోసం ఉన్న చట్టాన్ని అనైతికంగా ఉపయోగించి ఎందుకు కేసులుపెట్టాలని ప్రశ్నించండి. దీనిపై దళిత మేధావులు, అధికారులు, యువత కూడా మేధో మథనం చేయాలి. చట్టం దుర్వినియోగం అవుతున్న తీరు మీద స్పందించాలి. తప్పు జరిగితే కచ్చితంగా ఎస్సీ, ఎస్టీలకు చట్టం ప్రకారం న్యాయం జరగాలి. అంతేకాని చట్టం అడ్డు పెట్టుకొని దురాగతాలు జరగకూడదు. అద్భుతమైన చట్టం దుర్వినియోగం చేస్తాం… దీన్ని ఇతరులను వేధించడానికి అన్యాయంగా వాడుకుంటాం అని వైసీపీ భావిస్తే దాన్ని కచ్చితంగా జనసేన వ్యతిరేకిస్తుంది.
• భారతి గారూ… ఆ తల్లి వేదన మనసుతో వినండి
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అలా ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్నారి గ్రీష్మ ఒకరు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కంటిపాప చనిపోయిందన్న బాధలో తల్లి దానికి కారకులైన వారిని చొక్కపట్టుకొని నిలదీయాలని ఆమె నిరసనలో భాగంగా గోడ దూకితే తల్లిపై కేసులు పెట్టారు. కోటి రూపాయలు ఇచ్చాం ఎందుకు గొడవ చేస్తున్నావని స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడం సిగ్గుచేటు. ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాలు తీసుకురాలేరని వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. ఇలా చులకనగా మాట్లాడే వైసీపీ నాయకులు బయట తిరగకుండా కొత్త చట్టాలు తీసుకురావాలి. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం చేసిన తప్పు వల్ల బిడ్డను ఆఖరి చూపు కూడా ఆ తల్లి చూసుకోలేకపోయింది. ఆమె ఆవేదనకు సమాధానం ఎవరు చెబుతారు? ముఖ్యమంత్రి జగన్ చెబుతారా? లేక సలహాదారులు చెబుతారా? వైసీపీ నాయకులు- పోయిన ప్రాణాలు ఎలాగు తీసుకురాలేరు… కనీసం కేసులైనా ఉపసంహరించుకోండి. ఓ తల్లి ఆవేదన ముఖ్యమంత్రి సతీమణి శ్రీ భారతి గారు పెద్ద మనసుతో అర్ధం చేసుకొని న్యాయం జరిగేలా చూడండి. మీకు బిడ్డలున్నారు కదా..? ఆ తల్లి వేదన మనసుతో వినండి.
• విశాఖను విషతుల్య రహిత నగరంగా మార్చు జగన్
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 1800 కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. బాధిత 350 కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదు. వారికి ఉపాధి కల్పించలేదు. వైసీపీ నాయకులు బాధితులను మోసం చేసి పరిహారం కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటున్నారు. చాలామందికి పూర్తి స్థాయి పరిహారం ఇవ్వలేదు. ప్రమాద స్థలంలో రక్షిత మంచినీరు, ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అతీగతి లేదు. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత అలాంటివి చిన్నాపెద్దా కలిపి మరో ఏడు, ఎనిమిది ఘటనలు జరిగాయి. దీనిపై సేఫ్టీ ఆడిట్, గ్రీన్ ఆడిట్, పొల్యూషన్ ఆడిట్ ఇప్పటి వరకు జరగలేదు. దీనికోసం బాధితులు అధికారులను అడిగితే అధికారుల స్పందన బాగా లేదు. ఘటన ఎప్పుడో జరిగిపోయింది కదా, పరిహారం వచ్చింది కదా అని మాట్లాడటం దారుణం. మాట్లాడితే విశాఖను రాజధాని చేసేస్తున్నాం అని చెప్పే ముఖ్యమంత్రి గారు మొదట విశాఖపట్నం నగరాన్ని విషతుల్య రహిత నగరంగా చేయండి. మళ్లీ ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్పిన ప్రభుత్వం దాన్ని తర్వాత పట్టించుకోలేదు. ఉత్తరాంధ్రను కాలుష్యంతో నింపేస్తున్నారు. ఈ నాటికీ ఎల్జీ పాలిమర్స్ ఘటన మీద న్యాయం చేయలేని జగన్ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు..? ఎప్పుడు ఏ విష వాయువు కమ్మేస్తుందో, ఏం జరుగుతుందోనన్న భయంతో విశాఖ ప్రజలు బతుకుతున్నారు.
• మహిళలు, యువతుల అదృశ్యంలో నమ్మలేని నిజాలివిగో…
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో దాదాపు 30వేల మంది మహిళలు, యువతులు అదృశ్యమైపోయారని నేను చెబితే వైసీపీ నాయకులు నన్ను విమర్శించారు. అయితే నేను మాట్లాడింది నిజమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు దానికి ఊదాహరణగా అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామానికి చెందిన శ్రీ నడిగట్ల శ్రీనివాసరావు దంపతులు తమ 16 ఏళ్ల కుమార్తె రెండేళ్ల క్రితం కిడ్నాప్ అయిందని చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. పోలీసులు ఫోన్ కాల్స్ ట్రేస్ చేశారు. కిడ్నాప్ కు ఉపయోగించిన కారును ఇచ్ఛాపురంలో గుర్తించారు. కిడ్నాప్ చేసింది గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు అని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇన్ని తెలిసినా ఆ మైనర్ బాలికను ఎందుకు గుర్తించలేకపోయారు? పోలీసులకు ఫోన్ చేసి చేతులు కట్టేస్తోంది ఎవరు? అదృశ్యమైన మహిళల్లో అందరూ తిరిగి వచ్చేశారని వైసీపీ నాయకులు, పోలీసులు చెబుతున్నారు. నిజంగా తిరిగి వచ్చేస్తే శ్రీనివాసరావు దంపతులు ఈ రోజు నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది..? ఏపీలో 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే అందులో 65 శాతం మంది 18 ఏళ్ల లోపు వారే. అదృశ్యమైన ఆడపిల్ల రెండు రోజులు దాటితే ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారో తెలియడం లేదు. పోలీస్ వ్యవస్థగానీ, నాయకులుగానీ పట్టించుకోలేదు సరికదా తల్లిదండ్రులను హైకోర్టులో వేసిన రిట్ పిటీషన్ ఉపసంహరించుకోమని బెదిరించడం ఏంటి? కనీసం స్పందించని ఈ వ్యవస్థపై ఆ తల్లిదండ్రులకు ఆవేశం రాక ఏమొస్తుంది..? న్యాయ పోరాటం కూడా చేయొద్దని ఆ తల్లిదండ్రులను బెదిరిస్తున్న వారిపై రాష్ట్ర డీజీపీ గారు స్పందించాలి.
• గంగవరం సమస్యను కేంద్రానికి తెలియజేస్తాం
గంగవరం పోర్టు నిర్మాణంలో రెండు మత్స్యకార గ్రామాల ప్రజలకు తీరని అన్యాయం చేశారు. గంగవరం పోర్టు నిర్వాసితులకు కాలుష్యం కానుకగా వదిలేసి, వారికి కనీస వేతనాలు ఇవ్వకపోవడం అత్యంత దుర్మార్గం. 40 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికుల వేదన వినకుండా వేధిస్తోంది. పీపీపీ మోడల్లో నిర్మించిన పోర్టులో 10 శాతం వాటా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం అమ్మేసింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న బతుకులను కూలదోసి కేవలం వారిని రూ.15 వేలకు సగటు కార్మికులుగా చేస్తే, వారి బతుకుకి భరోసా ఏది..? వారికి కనీస వేతనాలు ఇవ్వకపోతే పోరాటం చేయక ఏం చేస్తారు..? గంగవరం పోర్టు సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. గంగవరం పోర్టు సమస్య మీద ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేద్దామని అనుకున్నాను. అయితే లేనిపోని కొత్త సమస్య వస్తుందని నేను రాలేదు. కచ్చితంగా మత్స్యకారులకు జనసేన మద్దతు ఎల్లపుడూ ఉంటుంది. వారికి ప్రభుత్వం, పోర్టు యాజమాన్యం తగిన న్యాయం చేయాలి.
• నియంత నిర్ణయాలు ఎలా పని చేస్తాయి..?
గిరిజన చట్టాలు, హక్కులను ఉల్లంఘిస్తూ పాడేరు నియోజకవర్గం, చింతపల్లి మండలంలో నిర్మిస్తున్న యర్రవరం ప్రాజెక్టు వల్ల దాదాపు 32 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. 3,240 గిరిజన కుటుంబాలు నిరాశ్రయులు అవుతున్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టు నిర్మాణంపై నిర్ణయం తీసుకోవడం సరికాదు. స్థానిక ప్రజాప్రతినిధిగా గిరిజన వ్యక్తి ఉండి కూడా నియంత నిర్ణయాలకు వత్తాసు పలకడం ఏంటి? 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరిస్తే దానికి తగ్గ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. ఉత్తరాంధ్ర విధ్వంసం, దోపిడీ మీద నేను ప్రతిసారి ఎందుకు మాట్లాడతాను అంటే కేవలం రుషికొండ దోపిడీ మాత్రమే బయటకు కనిపిస్తోంది. పెందుర్తిలో రుషికొండలాంటి నాలుగైదు కొండలను వైసీపీ నాయకులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గ్రావెల్ అమ్మేసుకుంటున్నారు. ఇది బయటకు కనిపించని మరో విధ్వసకర దోపిడీకి నిదర్శనం.
• ప్రచార యావలో వైసీపీ నాయకుడు
పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్నట్లుంది వైసీపీ తీరు. పిల్లలకు నాడు నేడు బడులు అని అద్భుతాలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో కనీసం కూర్చొవడానికి బడులు కూడా కట్టలేకపోతోంది. మక్కువ గ్రామంలో కనీసం పిల్లలకు బడి లేకుండా పోయింది. కనీసం పైకప్పు లేని పాఠశాలలో చదువులు ఎలా సాగుతాయి..? ఆంగ్ల మీడియంలోనా, తెలుగు మీడియంలో బోధిస్తారా అనేది తర్వాత చూడొచ్చు. కనీసం కూర్చొని, మౌలిక వసతులు ఉండే స్కూళ్లను పిల్లలకు నిర్మించాలి. 16 ఏళ్ల వరకు చదువుకోవడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. గిరిజన గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో పిల్లలు కూర్చొనేందుకు పాఠశాలలు, సిబ్బంది లేకపోతే గిరిజన ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించకపోతే ఎలా..? అడవితల్లి బిడ్డలకు అన్యాయం జరిగితే అండగా నేను ఉంటాను.
• నోటికొచ్చిన హామీ ఇచ్చి మోసం చేసిన జగన్
ఎన్నికల ముందు అధికారం కోసం నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చిన పెద్ద మనిషి తర్వాత అవన్నీ గాలిలో కలిపేశాడు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన జగన్ తర్వాత అన్నీ రంగాలను ప్రైవేటు వారికి కట్టబెడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగ భద్రత వస్తుందని, అన్నీ రంగాల వారు ఆశగా ఎదురు చూశారు. ఈ-సేవ కేంద్రాల సిబ్బందికి సైతం మేలు చేస్తానని చెప్పి, సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికైనా అన్నీ వర్గాలు ఆలోచించాలి. రకరకాల మోసాల మాటలు చెప్పిన వ్యక్తికి ప్రజలు బలంగా బుద్ధి చెప్పాలి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు జనసేన ప్రభుత్వంలో బలమైన ప్రయత్నం జరుగుతుంది.
• ఆంధ్రా యూనివర్సిటీ ఏమైనా వైసీపీ విశ్వవిద్యాలయమా?
ఆంధ్రా యూనివర్సిటీ ఉత్తరాంధ్రకు చదువుల పట్టుగొమ్మ. ఈ విశ్వవిద్యాలయాన్ని వైసీపీ విశ్వవిద్యాలయంగా మార్చేస్తే చూస్తూ సహించేది లేదు. వీసీ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన యూనివర్శిటీలో నియామకాలు దగ్గర నుంచి నిధుల వినియోగం, ఫీజుల పెంపుదల వరకు లెక్కలేనన్ని ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై కేంద్ర మానవ వనరుల శాఖకు ఫిర్యాదు చేస్తాం. వీసీ చేస్తున్న అన్ని పనుల మీద పక్కా ఆధారాలను విద్యార్థులు తీసుకొస్తున్నారు. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలకే కాదు… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకానికి దశదిశా చూపించాల్సిన ఆంధ్రా యూనివర్సిటీ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. యూనివర్సిటీల పాలన మీద జనసేన ప్రభుత్వంలో పారదర్శక నిర్ణయాలు తీసుకుంటాం. భావి భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణయాలు ఉంటాయి. ఇటీవల కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో రెండో పేపర్ లో కొన్ని తప్పులు వచ్చాయి. దీంతో సుమారు 50 వేల మందికి మార్కులు తగ్గి పోస్టులకు అనర్హులు అయ్యారు. ప్రభుత్వం పేపర్ లో చేసిన తప్పులకు యువత బలికావడం దారుణం. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. యువత కోర్టులో కేసులు వేశారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రభుత్వం చేసిన తప్పులకు బలైపోయిన యువతకు న్యాయం చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రవణం ప్రాజెక్టు ద్వారా బధిరులైన చిన్నారులకు ఉచితంగా హియరింగ్ ఎయిడ్ లను ఇవ్వాలి. అలాగే శ్రవణం ప్రాజెక్టును బలోపేతం చేసి, బధిరులకు లాంగ్వేజీ థెరపీ ద్వారా అన్నీ జిల్లాల్లో మాటలు నేర్పించే ప్రాజెక్టులు ప్రారంభించాలి. టీటీడీకు భక్తుల నుంచి బోలెడు ఆదాయం వస్తోంది. శ్రీవాణి ట్రస్టు నిధులు సైతం అన్యాక్రాంతం అవుతున్నాయన్న సమాచారం ఉంది. బధిర చిన్నారులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేసే కాంక్లియర్ ఈయర్ ప్లాంటు సర్జరీ వయస్సును మూడు సంవత్సరాలకు తగ్గించారు. దీంతో చాలామంది చిన్నారులు దీన్ని వినియోగించుకోలేకపోతున్నారు.
• నకిలీ మద్యం ప్రాణాలను తీస్తోంది.. నేరాలను పెంచుతోంది
రాష్ట్రంలో దొరుకుతున్న నకిలీ మద్యం తాగిన వారి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెదడులో కలిగే కొన్ని రసాయన చర్యల వల్ల నేరాలకు పురిగొల్పుతోంది. నకిలీ మద్యం తాగిన వారికి ఆరోగ్యం పూర్తిగా పాడైతే, అది మిగిలిన వారి భద్రతకు హాని చేకూరుస్తోంది. నకిలీ మద్యం దెబ్బకు నేరాలు ఎక్కువవుతున్నాయి. మరోపక్క విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి సైతం ఆంధ్రాలో నేరాలకు కారణం. ఆ మత్తులో రౌడియిజం, గుండాయిజం చెలాయిస్తున్న వారికి వైసీపీ నేతలు వత్తాసు పలుకుతున్నారు.
• రూపాయి వేసినందుకు థ్యాంక్యూ జగన్
పెళ్లికానుక పథకం అందరికీ ఇస్తున్నామని, దుల్హన్ పథకంలో భాగంగా ముస్లిం నూతన వధూవరులకు రూ.50 వేలు ఇచ్చేస్తున్నామని చెప్పిన జగన్… పెళ్లి చేసుకున్న వారికి పెళ్లికానుక కింద డబ్బు ఎగ్గొడుతున్నారు. వారికి న్యాయంగా చెందాల్సిన రూ.50 వేలు ఇవ్వడానికి మనసు రావడం లేదు. వందల కోట్లను ఖర్చు చేస్తున్నామని చెబుతున్న జగన్ రూపాయి అకౌంట్లో వేసి, మొత్తం డబ్బు వేశామని చెప్పడం సిగ్గుచేటు. దుల్హాన్ లో రూపాయి వేసినందుకు థ్యాంక్యూ జగన్.. ఇంతకంటే ఏం చెప్పగలం..? రాష్ట్ర ప్రభుత్వం లారీలపై వేసిన హరితపన్ను విషయంలో త్వరలోనే మంగళగిరి పార్టీ కార్యాలయంలో మొత్తం లారీ ట్రాన్స్పోర్టు యజమానులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తాం. హరిత పన్ను ఇష్టానుసారం పెంచిన వైనంపై అందరి అభిప్రాయాల మేరకు దీనిపై ఓ నిర్ణయం తీసుకుందాం. ఏ పరిశ్రమ అయినా కచ్చితంగా తమ ఫాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలోకి వదలాలి. దాన్ని ఏ పరిశ్రమ పాటించడం లేదు. ముఖ్యమంత్రి ప్రతి పరిశ్రమలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామన్న మాటలు కూడా అమలు కాలేదు. అధికారంలోకి రాగానే దివీస్ ను బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక దాన్ని మర్చిపోయారు. ముందుగా దివీస్ పరిశ్రమ కాలుష్యం మీద ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి. ఆ ఫాక్టరీ నుంచి వచ్చే రసాయనాల దెబ్బకు స్థానికంగా ఉన్న ఆక్వారంగం దెబ్బతింటోంది. దీనిపై వెంటనే జగన్ స్పందించాలి. అధికారంలోకి వస్తే ఫార్మా కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలిస్తామని హామీ ఇచ్చిన జగన్ దానిని మరిచిపోయాడు. 2018లో తాడి గ్రామానికి వెళ్లాను. ఫార్మా కాలుష్యం వల్ల చర్మ వ్యాధులు, గర్భకోశ వ్యాధులు, రకరకాల క్యాన్సర్లతో స్థానికులు ఇబ్బందులు పడటం ప్రత్యక్షంగా చూశాను. తాడి గ్రామం తరలించనోడు విశాఖను రాజధాని ఏం చేస్తాడు. ఉత్తరాంధ్రను కాలుష్య రహిత ప్రాంతంగా మార్చి క్రైమ్ రేటు తగ్గిన తరువాత రాజధాని గురించి మాట్లాడు. ముఖ్యమంత్రి రుషికొండలో కాకుండా తాడి గ్రామంలో ఇల్లు నిర్మించుకుంటే వారు పడుతున్న బాధలు తెలుస్తాయి. చిట్టివలస మిల్లు సమస్య దగ్గర నుంచి సహకార సంఘాలతో నడుస్తున్న పరిశ్రమల వరకు అన్నీ మూతపడుతున్న ఈ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలి. ట్రాన్స్ జెండర్లకు సైతం జనసేన ప్రభుత్వంలో బతుకు భద్రతను కల్పిస్తాం. వారికి తగిన విధంగా గర్వంగా బతికే స్వేచ్ఛను ఇస్తాం’’ అన్నారు.
• ఏకధాటిగా సమస్యలు విన్న శ్రీ పవన్ కళ్యాణ్….
ఉదయం 11 గంటలకు జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏకధాటిగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను విన్నారు. రాత్రి 6గం.15ని. వరకూ వినతులు స్వీకరించారు. 340 వినతులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందుకున్నారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా వచ్చిన వారందరినీ కలవాలనే ఉద్దేశంతో వేదికపై అలా నిలబడే సమస్యలను విన్నారు. చెప్పిన ప్రతి సమస్యను అడిగి తెలుసుకొని, వాటి గురించి పూర్తి వివరాలు ఆరా తీశారు. వైసీపీ దోపిడీలు, దౌర్జానాలను ప్రజలు వేదనగా చెబుతుంటే, వారి కన్నీరు చూసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చలించిపోయారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అన్యాయాలకు ప్రజలు పడుతున్న బాధలు ఆయన ఆకలిని సైతం చంపేశాయి. మేధావులు, ఉద్యోగులు, నిపుణులు, కార్మికులు, కర్షకులు, మధ్య తరగతి ప్రజలు, పేదలు ఇలా అన్ని రంగాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సమస్యలు చెప్పుకునేందుకు తరలిరావడంతో భారీగా జనసందోహం కనిపించింది. విశాఖ సముద్రమే ముందుకొచ్చి సమస్యల కెరటంలా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తాకిందా అనేలా ప్రజా విజ్ఞాపనలు, వైసీపీ దాష్టీకాలు జనవాణి వేదికను బలంగా తాకాయి.