• రైతులకు న్యాయం చేయమని కోరితే నోటికొచ్చిన బూతులు తిట్టారు
• ప్రజాధనం దోచుకుంటున్నాడు కాబట్టే జగన్ ను జగ్గూభాయ్ అని పిలుస్తాం
• నాలుగేళ్లలో రూ.లక్ష కోట్లు దోచేసిన జగన్
• రూ. 30 వేల కోట్లు ఎన్నికల్లో పంచడానికి దాచాడు
• హిందూ ధర్మాన్ని కించపరిచే హక్కు వైసీపీకి లేదు
• అర్చకుల వేలం రాజ్యాంగ విరుద్ధం
• ప్రజాధనం దోచుకునే జగన్ ను జగ్గూభాయ్ అనే దొంగగానే పిలుస్తాం
• కొత్తగా జగన్ పెట్టిన పథకాలు ఏవీ లేవు
• పాత పథకాలకే పేరు మార్చాడు.. నిధులను మళ్లించి పంచుతున్నాడు
• వారాహి విజయయాత్ర తణుకు బహిరంగసభలో శ్రీ పవన్ కళ్యాణ్
పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతు తన బాధ చెప్పుకుంటే ఎర్రిపప్ప అంటున్నారు… మొలకలు వచ్చాయని మీ మంత్రుల వద్ద గోడు వెళ్లబోసుకుంటే ఎర్రిపప్ప అని తిడుతున్నారు. కడుపు నింపే రైతును గౌరవించడం వైసీపీకి తెలీదు. మీరు మాత్రం గతంలో ఎన్నడూ లేని చెత్త పేరుతో ఎర్రిపప్ప పన్నులు మాత్రం వేయొచ్చు. ఇంటి ముందు కంకర పెట్టుకుంటే టాక్స్.. ఇంటిపై పై ఫ్లోర్ వేసుకోవాలంటే మున్సిపాలిటీతో పాటు స్థానిక ఎర్రిపప్ప నాయకులకు టాక్స్.. గట్టిగా అడిగితే సంక్షేమం నిలిపేస్తామని ఎర్రిపప్పలతో బెదిరింపులు. ఇలా జగన్ ఎర్రిపప్ప పన్నులు వేస్తూ, ఎర్రిపప్ప ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. జనసేన వారాహి విజయయాత్ర రెండో షెడ్యూలులో చివరిదైన తణుకు బహిరంగసభలో శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ వైసీపీ నాయకులు ఎవర్ని ఎన్ని మాటలైనా అనొచ్చు. వారికి తాడేపల్లి ప్రచురణలు పేరుతో ప్రత్యేక తెలుగు నిఘంటువు ఉంది. అక్కడ వారి ఇష్టం ప్రకారం ఎవర్ని తిట్టినా మళ్లీ దాన్ని వారే సరిచేసుకొని కొత్త అర్ధాలు చెబుతారు. రైతుల్ని బూతులు తిట్టి, తాడేపల్లి నిఘంటువులో బుజ్జినాన్న అని కొత్త అర్ధం తెచ్చారు కదా..? అందుకే మేం కూడా వైసీపీ ప్రభుత్వాన్ని మీ పరిభాషలోనే ఎర్రిపప్ప ప్రభుత్వంగానే పిలుస్తాం.
• హిందువులను ఇంకెంతకాలం కించపరుస్తారు?
వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 219 హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. రామతీర్థంలో శ్రీరాముని విగ్రహానికి శిరచ్ఛేదనం చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేశారు. ఇప్పటి వరకు ఒక్క నిందితుడిని కూడా ఈ ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు అన్నవరంలో అర్చకులను వేలం పెట్టాడు ఈ పెద్దమనిషి. దేవాలయ ఆవరణలో ఉన్న దుకాణాలు, ప్రసాదాల తయారీ, కళ్యాణ కట్ట వంటి వాటిని వేలం వేయవచ్చు తప్ప అర్చకులను వేలం వేయకూడదని ఏపీ ఎండోమెంట్ యాక్ట్ చెబుతోంది. జగన్ ఇందుకు విరుద్ధంగా హిందు దేవాలయాలపై ఎందుకు పడ్డాడు? అర్చకులను ఎందుకు వేలం వేస్తున్నాడు. ఇతర మతాల్లో మత ధర్మం బోధించేవారిని అలా వేలం వేయగలరా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? రాజ్యాంగ పీఠికలోనే రాజ్యం ఎప్పుడు మతానికి సంబంధించిన అంశాల్లో తలదూర్చకూడదని స్పష్టంగా చెప్పారు కదా. దీనిపై జనసేన న్యాయపరమైన పోరాటం చేస్తుంది. కొంతమంది వైసీపీ ప్రజాప్రతినిధులు హిందు ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాతం కాకుండా చూడాల్సిన వారే, వాటిని మింగేస్తున్నారు.
• ఇవి హిస్టీరియా రోగం లక్షణాలు
ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం… అధికారంలోకి వచ్చాక వాటిని మరిచిపోవడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు దాటుతున్నా హామీ నెరవేర్చలేదు. ఉద్యోగులు ఆందోళనలు చేస్తే జగన్ చిన్నపిల్లాడు తెలియకుండా హామీ ఇచ్చేశాడని సలహాదారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇంటికి ఒక్క పిల్లాడికే అమ్మఒడి అని మెలిక పెట్టారు. కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని మాట ఇచ్చారు. ప్రతి ఏడాది రకరకాల నిబంధనలు పెట్టి లబ్ధిదారుల జాబితాను తగ్గించేస్తున్నారు. సంపూర్ణ మద్యపానం అని చెప్పి ఒక్క మద్యం మీదే 1.30 లక్షల కోట్లు ఆదాయం ఆర్జించాడు. అబద్దాలు చెప్పడం దానిని సమర్ధించుకోవడం జగన్ కు అలవాటు అయిపోయింది. ఇది ఓ హిస్టీరియా తాలుకా మానసిక వ్యాధి లక్షణాలు. జగన్ ఒక్కసారి చెక్ చేసుకుంటే మంచిది.
• జగన్ కుటుంబంలో తాతల నుంచి దోచుకోవడం అలవాటే
వైసీపీ హయాంలో అవినీతి తారస్థాయికి చేరిపోయింది. ప్రతి పనికి రేటు కట్టి దోచేస్తున్నారు. దాదాపు రూ. 8వేల కోట్ల ప్రైవేటు ఆస్తులు కాజేశారు. వీళ్ల దోపిడీని భరించలేక పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం విడిచి పారిపోతున్నారు. వైజాగ్ లో అన్నకు నచ్చిందని ప్రేమ అనే హెల్త్ కేర్ సెంటర్ ను బలవంతంగా లాక్కున్నారు. వీళ్ల తాతలు నుంచి దోచుకోవడమే అలవాటు చేసుకున్నారు. బలిజల నుంచి బైరెటిస్ గనులు లాక్కున్నారు. జగన్ లాంటి దోపిడీ దారులను ఎలా ఎదుర్కోవాలో జనసేనకు తెలుసు. వైసీపీ ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వాలంటీర్లతో దిష్టిబొమ్మలు తగలబెట్టినా, వైసీపీ నాయకులతో బూతులు తిట్టించినా భయపడేది లేదు. జగన్ ఇంతవరకు ఫ్యాక్షనిస్టులతో, రాజకీయ నాయకులతో గొడవలు పెట్టుకున్నాడు. విప్లవకారులను ప్రేరణగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన వారితో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను.
• మహిళా కమిషన్ అప్పుడెందుకు మాట్లాడలేదు?
మద్యం మత్తులో 52 వేల మంది ఆడపడుచులపై దాడులు జరిగాయి. ఇవి మేము చెబుతున్న లెక్కలు కాదు సాక్షాత్తు పార్లమెంటులో హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన లెక్కలు. బూమ్ బూమ్, ఆంధ్ర గోల్డ్ వంటి నాసిరకం మందు తాగి చాలా మంది నాడి వ్యవస్థ దెబ్బతిని, మానసిక గందరగోళానికి గురై చనిపోతున్నారు. కల్తీ మద్యం తాగి 32 మంది చనిపోయారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి 3 లక్షల బెల్ట్ షాపులు నడిపిస్తున్నాడు. 32 మంది ఆడపడుచుల తాళిబొట్లు తెంపేశాడు. మద్యం మీద వచ్చిన ఆదాయంలో దాదాపు రూ. 30వేల కోట్లు దోచేశాడు. వాటిని మళ్లీ మన ఓట్లు కొనడానికే ఉపయోగిస్తాడు. వైసీపీ హయాంలో 3,372 మానభంగాలు జరిగాయి. ఇంతమంది ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళ కమిషన్ ఏమైపోయింది? మహిళ మంత్రులు ఏమైపోయారు? ఎందుకు దీనిపై మాట్లాడటం లేదు. కడపలో దళిత బిడ్డపై పదిమంది కలిసి పలుమార్లు అత్యాచారం చేస్తే ఫిర్యాదు చేయడానికి దగ్గరలో ఉన్న సచివాలయంకు వెళితే పట్టించుకోలేదు. పట్టించుకోనికాడికి అసలు చట్టమే లేని దిశాచట్టం, దిశా పోలీస్ స్టేషన్లు ఎందుకు?
• జగన్ వల్ల బిహార్ హ్యాపీ
దేశంలో ఏ మూల గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో కనిపిస్తున్నాయి. గంజాయి స్మగ్లింగ్ లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారు. ఇదివరకు బిహార్ ను నేరాల్లో ప్రధాన స్థానంలో చూసేవారు. జగన్ దయవల్ల రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోవడంతో ఏపీ కంటే బిహారే నయం అంటున్నారు. ఎక్కడో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వస్తున్న హెరాయిన్ మార్గ మధ్యలో పట్టుబడితే దాని మూలాలు ఇక్కడ విజయవాడలో దొరికాయి. ఇలాంటి క్రిమినల్స్ రాజ్యాలు ఏలుతుంటే ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడుంటుంది? యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? లంచాలతో పీడీస్తుంటే పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తారు? ఈ నాలుగేళ్ల వ్యవధిలోనే జగన్ లక్ష కోట్లు దోచుకున్నారు. మద్యం మీద రూ. 30వేల కోట్లు, ఇసుక, గనుల మాఫియా ద్వారా రూ. 40 వేల కోట్లు, భారతీ సిమెంట్ ద్వారా రూ. 20 వేల కోట్లు, చిన్నా చితక అక్రమాలు రూ. 10వేల కోట్లు ఇలా లక్ష కోట్లు జగన్ దోచుకున్నారు.
• వాలంటీర్లకు తెలియకుండా వారితోనే క్రైమ్ చేయిస్తున్నారు
వాలంటీర్లకు ఒకటే చెబుతున్నాను. మీరు జాగ్రత్తగా ఉండడి. మిమ్మల్ని రక్షించడానికే మాట్లాడుతున్నాను. మీకు తెలియకుండానే వైసీపీ నాయకులు మీతో క్రైమ్ చేయిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం చెబితే ఉన్నతాధికారులు అదే చేశారు. దాని నుంచి లబ్ధిపొందిన జగన్ బాగానే ఉన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ చెప్పింది చేసినందుకు శ్రీలక్ష్మీ వంటి ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లారు. చిన్న చిన్న తప్పులు చేసినందుకే లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత వంటి వారు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. చట్టం ఎవరిని వదిలిపెట్టదు. వ్యక్తిగత వివరాలు సేకరించడానికి, దానిని ఇంకో ప్రభుత్వ శాఖకు ఇవ్వడానికి చాలా పర్మిషన్లు తీసుకోవాలి. అలాంటిది వాలంటీర్లు ఏం పర్మిషన్లు లేకుండానే వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. వాటిని ఎక్కడికి పంపిస్తున్నారు? ఎవరికి పంపిస్తున్నారో వారికి తెలియదు. వ్యక్తిగత సమాచారం సేకరించడం వల్ల డేటా ప్రొటాక్షన్ యాక్ట్ కింద క్రిమినల్ చర్యలకు బాధ్యులు అవుతారు. తప్పులు చేసిన రాజకీయ నాయకులు బాగానే ఉంటారు. రూ.164.33 పైసల కోసం మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.
• నిన్ను జగన్ అని పిలిస్తే ఉలుకెందుకు..?
మీ మంత్రులు ఒక్కొక్కరూ ఒక్కో డైమండ్. వారి భాష, మాట్లాడే పద్ధతి గురించి చెప్పక్కర్లేదు. జగన్ తో పాటు వారి మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను కానీ, ప్రజలను కానీ ఏమైనా అనొచ్చా? నేను మాత్రం పేరు పెట్టి పిలిస్తే మీకు మండుతోందా..? ఇంకా మండుద్ది. అదే మంటను భరించండి. నన్ను జగన్ పేరు పెట్టి పిలవొచ్చు… దత్తపుత్రుడు అనొచ్చు.. ప్యాకేజీ స్టార్ అని కూడా నిందించొచ్చు. మేం మాత్రం మిమ్మల్ని ఏమి అనకూడదు. మీరు ఎన్ని మాటలన్నా .. అయ్యా అని గౌరవంగా మాట్లాడాలంటే కుదరదు. మీ ఇల్లు మాకెంత దూరమో.. మా ఇల్లు మీకు అంతే దూరం. అది గుర్తుంచుకోండి. ఇప్పటికే జగన్ నుంచి జగ్గుభాయ్ కి వచ్చాం.. ఇంకా మాట్లాడితే జగ్గూ అంటాం.. అప్పటికీ మీరు మారకపోతే కొత్త పేరు, మీరు వినలేని పేరు పెడతాను చూసుకోండి. జగన్ జాగ్రత్తగా మాట్లాడితే అంతకంటే జాగ్రత్తగా మేం మాట్లాడతాం. ఆయన మాకు గౌరవం ఇస్తే… అంతకంటే ఎక్కువగా ఆయనకు మేం గౌరవం ఇచ్చి సంబోధిస్తాం. అంతేగానీ ఇష్టానుసారం పెళ్లాలు.. పెళ్లిల్లు అంటూ సంస్కారం లేకుండా మాట్లాడితే మా భాష కూడా ఇలాగే ఉంటుంది. శివశివానీ స్కూల్లో పేపర్లు కొట్టేసిన వాడి దగ్గర మేం సంస్కారం ఆశించడం కూడా తప్పే అవుతుందేమో… వైసీపీ నాయకులే మీ నాయకుడికి చెప్పండి. లేదా కడుపుమండితే మరింత మండిపోవడానికి సిద్ధంగా ఉండండి. మేం ఇలాగే మాట్లాడతాం. మీరు మారితే మేము మారతాం.
• జగన్ వచ్చాక పెట్టిన పథకాలు కావివి.. ఎప్పటి నుంచో ఉన్నవే
జగన్ ప్రజలకు కొత్తగా చేసిందేమీ లేదు. నేను వారాహియాత్రలో కాకినాడలో ఓ మహిళా న్యాయవాదితో మాట్లాడితే ఆమె చెప్పింది ఇదే. కేంద్రంలో ఉన్న పథకాలకు, కేంద్రం నుంచి వచ్చే వివిధ పథకాల నిధులకు జగన్ పేర్లు మార్చి తానేదో డబ్బులు పంచుతున్నట్లు నటిస్తున్నాడు. పింఛను దగ్గర నుంచి ఫీజు రియంబర్సుమెంటు వరకు కేంద్రం చేయూతనిస్తున్న పథకాలే అధికం. శ్రీ దామోదరం సంజీవయ్య సమయంలోనే వృద్ధులకు ఆసరాగా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా జగన్ చేసేందేమీ లేదు. గతంలో వివిధ పథకాల నిధులను మళ్లించి, వాటిని డబ్బు రూపంలో పంచుతున్నాడు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మాయం చేశాడు.. బీసీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించాడు.. వివిధ రకాల పేదల రాయితీలను ఎత్తివేసి ఆ డబ్బులను వివిధ పథకాలకు డబ్బుల రూపంలో ఇస్తున్నాడు. మిగిలిన పథకాలకు నిధులేవి అని అడిగితే… నేను మొత్తం ప్రజలకే పంచుతున్నాను అని దబాయిస్తాడు. జగన్ పథకాలన్నీ 70:30 నిష్పత్తి పథకాలే. అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి, తర్వాత ఇంట్లో ఒక్కరికే ఇస్తానని చెబుతాడు. కరెంటు బిల్లు ఎక్కువ అంటూ కొందరికీ పథకాలు నిలిపేస్తాడు. తనకు అనుకూలంగా ఉన్నవారికి తప్పితే మిగిలిన వారికి ఈ ప్రభుత్వంలో మేలు జరగదు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫండ్స్ కింద కేంద్రం ఇచ్చిన రూ.1100 కోట్లను పీడీఏ అంకౌంట్ కి జగన్ మళ్లించాడు. దీనిపై సుప్రీంకోర్టు వరకు వ్యవహారం వెళ్లి విషయం బయటపడే వరకు దీన్ని బయటపెట్టలేదు. ప్రజా ప్రభుత్వం నడుపుతూ ప్రజలకు తెలియకుండా ఇలాంటివి చేస్తుంటాడు కాబట్టే ఈ వ్యక్తికి ఓ బుగ్గపై నల్ల మచ్చ… గళ్ల లుంగీ, ఎర్ర చొక్కా వేసి జగ్గుభాయ్ గా నామకరణం చేశాం.
• సైబర్ నేరగాడు జగన్
ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగుల కష్టార్జితం. ప్రతి నెలా దాచుకునే సొమ్ము. ప్రభుత్వం దాన్ని భద్రంగా పీఎఫ్ ఖాతాకు తన వంతు నిధులను వేసి జమ చేస్తుందని ఉద్యోగులు భావిస్తారు. పీఎఫ్ సొమ్ము పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, ఇతర అవసరాలకు పనికొస్తాయని భావిస్తారు. జగన్ మధ్య తరగతి నుంచి వస్తే ఇవన్నీ తెలిసేవి. జగన్ కుటుంబీకులదంతా మైనింగ్ సామ్రాజ్యం కదా..? ఆయనకు పీఎఫ్ గురించి తెలీదు. అందుకే ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ సొమ్మును జగన్ దారి మళ్లించాడు. దీనిపై కాగ్ లెక్కలు బయటపెట్టే వరకు ప్రభుత్వం సమాధానమే చెప్పలేదు. తర్వాత సాంకేతిక తప్పిదం కారణంగా నిధులను దారి మళ్లించినట్లు ఒప్పుకున్నాడు. సాంకేతిక తప్పిదం అంటే ఉద్యోగులు దాచుకున్న డబ్బును ఇంటర్నెట్ ట్రాన్సఫర్ ద్వారా నువ్వు వేరే ఖాతాకు మళ్లించావు. అంటే జగన్ సైబర్ నేరగాడు అని ఎందుకు అనకూడదు..? ఉద్యోగుల సీపీఎస్ రద్దు గురించి అడిగితే వారికి ఏదో కథ చెప్పి తప్పించుకుంటారు. ఒకటో తారీఖున జీతాలు అందుకోవడం ఉద్యోగులు ఏనాడో మర్చిపోయారు. ఉద్యోగులపై నానా రకాలుగా జగన్ కక్ష తీర్చుకుంటున్నారు.
• జగన్ దెబ్బకు ‘‘ధూర్తుల సామ్రాజ్యంలో ఆర్తుల హాహాకారాలు’’
మొత్తం పంచేస్తున్నాం.. బటన్లు నొక్కేస్తున్నా అంటున్న జగన్ పాలనలో సామాన్యుడి బతుకు ఎంత దారుణంగా మారిందో అర్ధం చేసుకోండి. సగటు దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన నాకు పేదలు, మధ్య తరగతి వర్గాలు ధరల దెబ్బకు ఎలా విలవిల్లాడుతున్నాయో తెలుసు. ఇలా డబ్బులు మీ అకౌంట్లో వేసి, అలా లాక్కునే జగన్ మనస్తత్వం ఏమిటో ప్రజలు ఆలోచించాలి. జగన్ వచ్చిన తర్వాత ఇంటిపన్ను రూ.600 మేర పెంచాడు. కొత్తగా చెత్తపన్ను పేరుతో రూ.100లు నెలవారీ తీసుకుంటున్నాడు. ఇసుక ధర రూ.4 వేల నుంచి రూ.10 వేలకు తీసుకొచ్చాడు. ఇక పెట్రోలు, డీజిల్ ధర దేశంలో మన రాష్ట్రంలోనే అధికం. నిత్యావసరాల్లోని చింతపండు ధర కేజీ రూ.122 నుంచి రూ.310లకు వచ్చింది. నూనె రూ.90 నుంచి రూ.165లకు వచ్చింది. కందిపప్పు రూ.87 నుంచి రూ.146లకు, పంచదార రూ.26 నుంచి రూ.50, మినపప్పు రూ.79 నుంచి రూ.162లకు వచ్చింది. ఆఖరికి మద్యం ప్రియుల కడుపు కొట్టి రూ.60ల క్వార్టర్ బాటిల్ ను రూ.160లకు తీసుకొచ్చాడు. మద్యపాన నిషేధం అని చెప్పి, పిచ్చిబ్రాండ్ల మద్యం తాగిస్తూ రూ.30 వేల కోట్లను దోచేశాడు. ఆ డబ్బునే దాచిపెట్టి, వచ్చే ఎన్నికల్లో మన ఓట్లు కోనేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇన్ని పన్నులు, ధరలు పెంచబట్టే ప్రజలకు ముఖం చూపించలేక పరదాల మహారాణిలా, హెలికాప్టర్లలో తిరుగుతున్నాడు. జగన్ పాలన ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదు.
• టీడీఆర్ బాండ్లలోని అవినీతికి కమిషనర్ ను బలి చేశారు
తణుకులో జరిగిన టీడీఆర్ బాండ్ల అవినీతి విలువ రూ.309 కోట్లు. ఈ మాత్రం డబ్బులుంటే ఎంతమంది జీవితాలు బాగుపడేవో అర్ధం చేసుకోండి. తణుకు మున్సిపాలిటీకి అవసరం లేకున్నా పార్కుల పేరుతో భూములను కొందరు పెద్దల వద్ద తీసుకొని, వాటికి భారీ స్థాయిలో టీడీఆర్ బాండ్లను ఇచ్చారు. గ్రీన్ ఫీల్డ్ జోన్ పేరుతో సుమారు 9.05 ఎకరాలను మున్సిపాలిటీకు ఇచ్చి భారీ స్థాయిలో టీడీఆర్ బాండ్లను 1:4 నిష్పత్తిలో తీసుకొని లాభపడ్డారు. దీనిపై ఏసీబీ విచారణ చేస్తే వెనుకున్న పెద్ద తలకాయలు తప్పుకొని, మున్సిపల్ కమిషనర్ ను బాధ్యులను చేశారు. చివరకు ఆయన సస్పెండ్ అయ్యారు. అసలు దొంగలు మాత్రం అలాగే జనాల్లో తిరుగుతున్నారు. తణుకు నియోజకవర్గంలో చెత్తను డంప్ చేసే డంపింగ్ యార్డు లేకుండానే చెత్త పన్ను వేస్తున్నారు. ధాన్యం మద్దతు ధర ఇవ్వాలని ధర్నా చేసిన రైతులపై దువ్వ పోలీసులు పెట్టిన కేసులు దారుణం. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ భవనాలు నియోజకవర్గంలో మధ్యలోనే ఉండిపోయాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలోనే నిర్మాణాలు నిలిచిపోయాయి. అసాంఘిక శక్తులకు అవి అడ్డాగా మారిపోయాయి. తేమ శాతం పేరుతో గత రబీలో ప్రతి రైతు దగ్గర 5 కేజీల ధాన్యం అధికంగా తీసుకుని జేబులో వేసుకున్నారు. కాలువ ఆధారిత వ్యవసాయం అధికంగా జరిగే నియోజకవర్గంలో మూడు కాలువల్లో పూడిక తీయాలి. పోలవరం ఎలాగూ జగన్ కట్టలేని అసమర్ధుడు. కనీసం నాలుగు నియోజకవర్గాలను ముంచెత్తే ఎర్రకాలువ ఆధునికీకరణ పనులు అయినా చేసేందుకు నిధులు విడుదల చేయాలి. గోస్తని నది కాలుష్యం వల్ల 68 వేల ఎకరాలు దెబ్బతింటున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇల్లు లేని వారికి ఇళ్లు కట్టిస్తామని టిడ్కో ఇళ్ల పేరుతో జగన్ రూ.9,159 కోట్లును తీసుకున్నాడు. దీన్ని బడ్జెట్ లో చూపలేదు. దీనిపైనా లెక్కలు చెప్పాలి.
• సత్కారాలు పేరుతో రూ. 705 కోట్లు ఇచ్చారు
పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలకు సకాలంలో జీతాలు ఇవ్వని ఈ ప్రభుత్వం వాలంటీర్లను సత్కరించడానికి మాత్రం రూ. 705 కోట్లు విడుదల చేసింది. జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు దానిని నిలబెట్టుకోండి అని అడిగినందుకు అంగన్ వాడీ టీచర్లపై దాడులు చేయించారు. తన హక్కులు అడిగినందుకు ఒంగోలులో హనుమయమ్మను వైసీపీ కార్యకర్తలు చంపేశారు. వాలంటీర్లు ప్రజా సేవకులు అయితే వైసీపీ కండువాలు ఎందుకు వేస్తున్నారు? వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నవారిని ఎందుకు బెదిరిస్తున్నారు? వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు రేషన్ కార్డు రాలేదా? పెన్షన్ అందలేదా? చేయాలన్న మనసు ఉన్నప్పుడు ఎలాగైన చేస్తాం. చేయకూడదు అనుకుంటే ఎలాంటి వ్యవస్థలు పెట్టినా నిష్ప్రయోజనం.
• జగన్ కొంపలు అంటిస్తాడు
జగన్ ప్రజల కొంపలు అంటిస్తాడు… జనసేన ప్రజల్ని చైతన్యవంతం చేసే గుండెలు అంటిస్తుంది. అన్నీ వర్గాలను జగన్ దెబ్బతీశాడు. రాజ్యంగబద్ధమైన పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వారికి కేంద్రం ఇచ్చిన 14, 15 ఆర్థిక సంఘం నిధులు నిలిపేశాడు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పేరుతో సొంత సైన్యం ఏర్పాటు చేసుకొని వారికి ప్రత్యేకంగా సత్కారాలు పేరుతో పంచాయతీ నిధులను దారి మళ్లించావు. రూ.1144 కోట్లు వాలంటీర్ల కోసం, రూ.207 కోట్లు సచివాలయాల కోసం మళ్లించావు. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, నీ కోసం కొత్త వ్యవస్థలను సృష్టించుకోవడంపైనే మా పోరాటం. పంచాయతీలకు కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లించుకోవడానికి కూడా నిధులు లేవు. నిర్వహణకు సైతం కనీస డబ్బులు లేవు. వారికి చెందాల్సిన డబ్బులను కొల్లగొడుతున్నాడు. రాజ్యంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న నీ తీరు మీదనే మా పోరాటం.
• విడివాడను గెలిపించుకుందాం
విడివాడ మన కోసం నిలబడినవాడు మన వాడు. గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల తణుకు నియోజకవర్గ టిక్కెట్ ను వేరే వ్యక్తులకు ఇవ్వాల్సి వచ్చింది. అయినా పార్టీ కోసం శ్రీ విడివాడ రామచంద్రరావు నిలబడ్డారు. ఇలాంటి వారిని కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిపించుకోవాలి. అప్పట్లో జరిగిన తప్పునకు మనస్ఫూర్తిగా ఆయనకు క్షమాపణ చెబుతున్నాను. వచ్చే ఎన్నికల్లో విడివాడ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. రోజూ యాతన పెడుతున్న నాయకుల్ని, వైసీపీ పెడుతున్న వెతలను ధైర్యంగా ఎదుర్కోండీ.. భయపడాల్సిన అవసరం లేదు. పోరాడితే పోయేది ఏమి లేదు. మీరు చైతన్యవంతులు అయితే మీలోనే మహాపర్వతమంత శక్తి దాగుందని గుర్తించండి’’ అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు నిచ్చారు.