తణుకులో జన గోదావరి

తణుకు

• జన ప్రభంజనం మధ్య జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జైత్ర యాత్ర
• హారతులు, గజమాలలతో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
• అడుగడుగునా స్వాగత ఫ్లెక్సీల తోరణాలు
• న భూతో న భవిష్యత్ అనేలా సాగిన వారాహి విజయ యాత్ర

          వారాహి విజయ యాత్రకు వచ్చిన అఖండ జనవాహినితో తణుకు పట్టణం జన గోదావరిని తలపించింది. జనసేన శ్రేణుల కోలాహలం మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు జైత్ర యాత్ర నిర్వహించారు. ఆడపడుచుల హారతులు.. జన సైనికుల పూలాభిషేకం.. ప్రజల హర్షాతిరేకాల మధ్య జనసేనాని రోడ్ షో నిర్వహించారు. వారాహి యాత్ర రోడ్ షో సందర్భంగా తణుకు చిట్టూరి హెరిటేజ్ హోటల్ నుంచి మెయిన్ బజార్ రాష్ట్రపతి రోడ్డు వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర జన ప్రవాహంలో మునిగిపోయింది. స్వాగత ఫ్లెక్సీలు తోరణాలుగా మారి ప్రతి అడుగులో జనసేనానికి స్వాగతం పలికాయి. తణుకు నియోజకవర్గం పరిధిలోని పల్లెలు, పట్టణాలు ఏకమై జనహో జనసేన అంటూ వారాహి విజయ యాత్రకు తరలివచ్చి మద్దతు తెలిపిన తీరు అద్భుతం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో ఆధ్యంతం న భూతో న భవిష్యత్ అనేలా సాగింది.
• ఆద్యంతం అభివాదాలు చేస్తూ..
         వారాహి విజయ యాత్ర సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచే జనసేన శ్రేణులతో కోలాహలంగా మారింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు బస చేసిన పరిసరాలు జనంతో నిండిపోయాయి. జనసేనాని యాత్రకు సూచికగా పార్టీ శ్రేణులు ఉదయం నుంచి బాణాసంచా పేలుళ్లతో పట్టణంలో పండుగ వాతావరణం సృష్టించారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో అభిమానుల జేజేల మధ్య మొదలైన రోడ్ షో గంటన్నరపాటు సాగింది. రోడ్ షో ఆధ్యంతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా వాహనంపై నిలబడి తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ సాగారు. జనసేన శ్రేణులతోపాటు స్టార్ హీరోల అభిమానులు, దళిత సోదరులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వారాహి విజయ యాత్రకు మద్దతు తెలిపారు. దళిత సోదరులు నీలి పతాకాలు చేతబూని జై భీమ్.. జై జనసేన అంటూ నినదించగా.. శ్రీ పవన్ కళ్యాణ్ గారు దళిత సోదరులకు గౌరవ సూచకంగా వారి చేతుల్లో పతాకాన్ని తన చేతుల్లోకి స్వీకరించి ఉత్తేజపరిచారు. ఆడపడుచులు పుష్పగుచ్చాలు, పూల దండలతో బారులు తీరగా ఎవర్నీ నిరుత్సాహపరచకుండా వాటిని స్వీకరించారు. రాష్ట్రపతి రోడ్డులోని నరేంద్ర సెంటర్, సభా ప్రాంగణం వద్ద పార్టీ నాయకులు భారీ గజమాలలతో ఘన స్వాగతం పలికారు. తణుకు ప్రధాన రహదారితో పాటు సభా ప్రాంగణానికి ఇరు వైపులా ఉన్న భవనాలు సైతం జనంతో కిక్కిరిశాయి.
• హల్లో తణుకు.. బైబై బుజ్జికన్నా..
           తణుకు పట్టణాన్ని ముంచెత్తిన స్వాగత హోర్డింగులు, ఫ్లెక్సీల్లోని సందేశాలు ఆకట్టుకున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నించాలన్నా, పోరాడాలన్నా శ్రీ పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమంటూ ఆయనపై తమకున్న నమ్మకాన్ని ప్రదర్శించారు. ‘హల్లో తణుకు.. బైబై బుజ్జి కన్నా..’, ‘ఒకటే మాట ఒకటే మార్పు.. మేమంతా మీ వెంటే..’, ‘హల్లో జగ్గూ భాయ్.. బాయ్ బాయ్ ఏపీ..’, ‘నా రెండు చెప్పులు బందరులో పోయాయి’ అంటూ రోడ్ షోలో అభిమానులు చేతబూనిన హ్యాండ్ ఫ్లెక్సీలు, ప్ల కార్డులు విశేషంగా ఆకర్షించాయి. మరి కొందరు వారాహి యాత్రకు విజయోస్తు అంటూ వారాహి అమ్మవారి చిత్రపటాలను ఫ్లెక్సీలుగా ముద్రించి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. ఆద్యంతం తణుకు పట్టణం బైబై వైసీపీ.. వెల్కమ్ ఏపీ నినాదాలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి గోవిందరావు, తణుకు ఇంఛార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేష్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
• ముగిసిన మలి విడత వారాహి విజయ యాత్ర
ఈ నెల 9వ తేదీన ఏలూరులో ప్రారంభం అయిన జనసేన పార్టీ వారాహి విజయ యాత్ర తణుకు పట్టణంలో ముగిసింది. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో ఆరు రోజుల పాటు సాగిన యాత్ర ఆద్యంతం జన ప్రభంజనం మధ్య సాగింది. యాత్రలో భాగంగా ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ఏలూరులో జరిగిన జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై నేరుగా అర్జీలు స్వీకరించారు. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి పార్టీలో నూతనోత్సాహం నింపారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్