• జనసంద్రమైన ఉంగుటూరు
•తాడేపల్లిగూడెంలో కోలాహలం
• ఆడపడుచుల హారతులు, పూలవర్షంలో తడిసిన శ్రీ పవన్ కళ్యాణ్
అడుగడుగునా ఆశేష జనవాహిని అపూర్వ స్వాగతం మధ్య జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయ యాత్ర ఏలూరు నుంచి ఉంగుటూరు మీదుగా తాడేపల్లిగూడెం చేరుకుంది. యాత్ర ఆద్యంతం ఆడపడుచుల హారతులు, జన సైనికుల కేరింతల మధ్య సాగింది. ఏలూరు నుంచి గుండుగొలను జంక్షన్, పాతూరు, భీమడోలు, పూళ్ల గ్రామాల్లో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఘనస్వాగతం పలికారు. గుండుగొలను జంక్షన్ నుంచి జనసైనికులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. వందల సంఖ్యలో మొదలైన ద్విచక్ర వాహనాలు ఉంగుటూరు చేరే సమయానికి వేల సంఖ్యకు పెరిగాయి. ఉంగుటూరు బాధ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జేజేలు పలికారు. వారాహి విజయ యాత్రకు విజయం కలగాలని కాంక్షిస్తూ ఆడపడుచులు హారతులతో క్యూ కట్టారు. వారాహి యాత్ర విజయోస్తు అంటూ దారి పొడుగునా బ్యానర్లు కట్టారు. తన కోసం తరలివచ్చిన ఆశేష జనవాహినికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలిపారు.
• తాడేపల్లిగూడెంలో జనహారతి
ఉంగుటూరు నుంచి వేలాది ద్విచక్ర వాహనాలు భారీ ర్యాలీగా అనుసరించగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం చేరుకున్నారు. తాడేపల్లిగూడెం బైపాస్ నుంచి అలంపురం విజయ గార్డెన్స్ వరకు జాతీయ రహదారి మొత్తం జనసేనానికి స్వాగతం పలికేందుకు వచ్చిన జనప్రవాహంతో నిండిపోయింది. ఇంఛార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్యర్యంలో పార్టీ శ్రేణులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పూల వర్షంలో ముంచెత్తాయి. బాణసంచా పేలుళ్లు, జనసేన శ్రేణుల జయజయధ్వానాల మధ్య భారీ రోడ్ షో నిర్వహించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సామాజిక మాధ్యమ నినాదం ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో నినాదంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు.