రుత్వికుల వేదనాదం.. హోమ జ్వాలలు.. దేవతామూర్తుల దేదీప్యమాన ప్రకాశంతో.. లోక కళ్యాణార్ధం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన యాగం తొలి రోజు క్రతువు రాత్రి 8.30 గంటలకు ముగిసింది. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు యాగం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ రోజు ఉదయం గం. 6.50 నిమిషాలకు అంకురార్పణతో ప్రారంభమైన యాగం మహా గణపతి పూజ, పార్టీ కేంద్ర కార్యాలయ భవన శంకుస్థాపన అనంతరం గణపతి హోమాన్ని రుత్వికులు సంధ్యా సమయం వరకు నిర్వర్తించారు. తదనంతరం కైలాస యంత్రస్థితి జ్యోతిర్లింగార్చన.. దీపాల సమాహార కాంతులలో దేదీప్యమానంగా జరిగింది. శంకరుని ప్రతిరూపమైన శివలింగాకృతిలో జ్యోతులు ప్రజ్వరిల్లగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేత నియమనిష్టలతో రుత్వికులు జ్యోతిర్లింగార్చన జరిపించారు. సంధ్యా సమయంలో ప్రారంభమైన ఈ అర్చన రాత్రి 8 గంటలు దాటిన తర్వాత మహా హారతులు, మంత్ర పుష్ప పఠనం మధ్య వైభవోపేతంగా ముగిసింది. యాగశాలలో ఇరువైపులా ఆసీనులైన రుత్వికుల వేద ఘోష యాగశాల మాత్రమే కాక పార్టీ కార్యాలయ ఆవరణ అంతా మారు మ్రోగింది. యాగ నిష్టతో ఉపవాస దీక్షతో తొలి రోజు క్రతువు ముగిసే వరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు యాగశాలలోనే దీక్షాధారిగా దేవతారాధన గావించారు. మహా మంత్ర పుష్పం అనంతరం వేద పండితులు అందించిన ఆశీర్వచనాలు స్వీకరించి తొలి రోజు యాగాన్ని పరిసమాప్తి గావించారు. రేపు ఉదయమే మలి రోజు క్రతువు, మధ్యాహ్నం పూర్ణాహుతిని రుత్వికులు నిర్వర్తిస్తారు.