• జనసైనికుల హర్షాతిరేకాల మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ రోడ్ షో
• అడుగడుగునా హారతులు.. పూలవర్షంతో స్వాగతం
• ప్రత్యేక ఆకర్షణగా హల్లో భీమవరం.. బైబై బ్యాంక్ శ్రీను పోస్టర్లు
• వైసీపీ అంతం.. వారాహి పంతం అంటూ నినదించిన పార్టీ శ్రేణులు
• పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన వారాహి విజయ యాత్ర
జన ప్రభంజనం అంటే ఏమిటో భీమవరం పట్టణంలో జనసేన శ్రేణులు చూపించాయి. వారాహి విజయ యాత్రకు తరలి వచ్చిన జనప్రవాహపు రణ ఘోషతో రహదారులు ప్రతిధ్వనించాయి. ఆడపడుచుల హారతుల మధ్య.. జన సైనికుల పూల వర్షంలో తడిసి ముద్దవుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పట్టణంలో గంటపాటు భారీ రోడ్ షో నిర్వహించారు. నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ నుంచి మొదలైన యాత్ర సభా ప్రాంగణం చేరే లోపు ఉన్న రహదారులు పూర్తిగా జనప్రవాహంతో నిండిపోగా.. ఆద్యంతం అభిమానుల జేజేల మధ్య జనసేనాని ముందుకు సాగారు. ప్రతి జనసైనికుడికి, వీర మహిళకు అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉత్సాహపరిచారు. వేలాది బైకుల ర్యాలీ మధ్య యాత్ర సాగింది.
• ఎటు చూసినా జనమే
భీమవరం అంబేడ్కర్ సెంటర్లో వారాహి సభా ప్రాంగణానికి నలువైపులా ఎటు చూసినా కనుచూపు మేరలో ఇసుక వేస్తే రాలనంతగా ప్రజలు తరలివచ్చారు. వారాహి విజయ యాత్ర మొదటి అంకం ముగింపు సభ కావడంతో భీమవరం పట్టణంతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా నుంచి జనసేన నాయకులు తరలివచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి రోడ్ షోలో జనసైనికుల చేతుల్లో హల్లో ఏపీ.. బై బై వైసీపీ నినాదంతో ప్లకార్డులు పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. హల్లో భీమవరం.. బైబై బ్యాంక్ శ్రీను.. అంటూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని ఇంటికి పంపుతామంటూ మరికొంత మంది ప్లకార్డులు ప్రదర్శించారు. ఇంకొంత మంది స్థానిక సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చేందుకు ప్లకార్డులపై రాసి ప్రదర్శించారు. భీమవరం వారాహి విజయ యాత్ర సభా ప్రాంగణం మొత్తం జనం సముద్రంగా మారి పట్టణం విరుచుకుపడిందా అన్న చందంగా పూర్తిగా నిండిపోయింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూసేందుకు పక్కనే ఉన్న రైల్వే లో బ్రిడ్జ్ షెడ్డుతో పాటు సెల్ ఫోన్ టవర్స్, వృక్షాలను కొంత మంది, చుట్టు పక్కల ఉన్న భవన సముదాయాలను కొంత మంది ఆశ్రయించారు. సభా ప్రాంగణం వద్ద ఒక వరుసలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. వైసీపీ అంతం.. వారాహి పంతం అంటూ పార్టీ శ్రేణులు నినదించాయి. భీమవరం సభతో వారాహి విజయ యాత్ర మొదటి అంకం ముగిసింది.