టీడీపీ నిర్మాణం… బీజేపీ శక్తి… జనసేన పోరాటం… రాష్ట్ర ప్రగతికి చోదకాలు

జనసేన

• జగన్ కు ఎన్నికల ఆరాటం తప్ప.. రాష్ట్ర భవిష్యత్తు పట్టదు
• భయపెట్టి ఓట్లు అడుగుతున్న జగన్
• విజన్ 2047లో రాష్ట్ర యువత నుంచే అధిక భాగస్వామ్యం ఉండాలి
• నెల్లూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
• నెల్లూరు ప్రజాగళం సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
2019 ఎన్నికల్లో దణ్ణం పెట్టి ఓట్లు అడిగిన జగన్- ఇప్పుడు వేలు చూపించి ప్రజలను భయపెట్టి ఓట్లు వేయమని అడిగే స్థాయికి వచ్చాడు. ప్రజలను హెచ్చరించేలా అతడి మనస్తత్వం మారిపోయింది. ఇదీ జగన్ అసలు నైజం అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. జగన్ లాంటి వ్యక్తిని ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకుంటే అతడిలాగే తయారవుతాం. యధ్భావం తద్భవతి అన్నట్లు… మన మతి ఎంతో గతి అంతే అవుతుంది. అతడిని స్ఫూర్తిగా తీసుకుంటే అలాగే యువత తయారవుతుంది అన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలో జరిగిన ప్రజాగళం ఎన్నికల సభలో ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘నాకు విలువైన జ్ఞానం అందించిన నేల నెల్లూరు. ఇంతటి పోరాటానికి, జగన్ వంటి దుర్మార్గమైన వ్యక్తితో తలపడటానికి నెల్లూరు నాకు బీజం వేసింది. అలాంటి నేలలో మరోసారి ఇంతటి ప్రజాభిమానం మధ్య ముందుకు రావడం ఆనందాన్ని నింపింది. జగన్ లాంటి వ్యక్తికి కేవలం ఎన్నికలే అజెండా. ప్రజల సమస్యలు అతడికి పట్టవు. కేవలం ఎన్నికల వేళ మాత్రమే బయటకు వస్తాడు. భావితరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే మనస్తత్వం అతడికి లేదు.
• యువశక్తితో 2047కు సూపర్ పవర్ గా భారతదేశం
90వ దశకాల్లో చంద్రబాబు గారు విజన్ 2020 అంటే ఏం జరుగుతుంది అనే ఆసక్తి ఉండేది. అయితే ఈ రోజు హైదరాబాద్ ను చూస్తే, అక్కడున్న అభివృద్ధిని పరిశీలిస్తే భవిష్యత్తు కోసం అప్పట్లోనే శ్రీ చంద్రబాబు గారు ఆలోచించిన తీరు గొప్పగా అనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి విజన్ 2047 తో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ప్రపంచలోనే సూపర్ పవర్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీనిలో యువత భాగస్వామ్యమే ప్రధానం. యువతలోని శక్తికి పదునుపెడితే అది దేశ అభివృద్ధికి ఇంధనంగా మారుతుంది. అలాంటి యువతరాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి అధికంగా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం అనేది మా లక్ష్యం. దీనికి యువతను అన్ని రంగాల్లో సంసిద్దం చేస్తాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాగానే యువత నైపుణ్య గణన చేపడతాం. వారిలోని ప్రతిభ, ఆసక్తిని తగిన విధంగా మదించి, దానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చే బాధ్యతను తీసుకుంటాం. ఇది యువత భవిష్యత్తుకు, అలాగే దేశ భవిష్యత్తుకు ప్రయోజనంగా మారుతుంది. వారి నైపుణ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించే ప్రక్రియను చేపడతాం.
• రాష్ట్ర అభివృద్ధికి అందరి సహకారం అవసరం
ఒక దేహానికి ఒక రక్తనాళం ఎలా అయితే సరిపోదో ఒక రాష్ట్రానికి ఒక నాయకత్వం కూడా సరిపోదు. అందరి ఆలోచనలు, విజన్, ప్రణాళిక, ఆచరణ ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధిలో పురోగమించదు. దీనికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం అనే కోణంలోనే తెలుగుదేశం పార్టీ నిర్మాణం, బీజేపీ శక్తి, జనసేన పోరాట బలం కలగలిపిన నాయకుల సమూహంతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. ఇది ఆంధ్రప్రదేశ్ కు కొత్త దశ, దిశా చూపుతుంది. మళ్లీ రాష్ట్రం వెలుగులు చిందించేలా ప్రయాణం మొదలుపెడుతుంది. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం విడిచి పారిపోతాం.. అని చాలామంది చెబుతున్నారు. ఎక్కడికి పారిపోతాం.. ఎక్కడికి వలస వెళ్తాం. ఇది మన నేల, ఇది మన రాష్ట్రం. జగన్ లాంటి దాష్టికులతో పోరాడాలి తప్ప పారిపోవడం సరికాదు. ఓ చెట్టు మీద పక్షి అయితే వలస వెళ్లిపోతుంది. మనం ఈ నేలలోనే వేళ్లూనుకున్న చెట్టులాంటి వాళ్లం. ఎక్కడికి వెళ్తాం..? అంతా సమష్టిగా జగన్ లాంటి వారితో పోరాడాలి. మన నేలలో మనమే ఉంటాం అని చాటి చెప్పాలి. మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అండగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా పాలన సాగిస్తాం. నెల్లూరు కూటమి ఎంపీ అభ్యర్థిగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి గారికి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ పొంగూరు నారాయణ గారికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గార్లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి, దీవించండి’’ అని కోరారు.

ఫేస్ బుక్ ఫాలో అవండి

ట్విట్టర్ ఫాలో అవండి

ఇన్స్టా గ్రామ్ ఫాలో అవండి

రిలేటెడ్ ఆర్టికల్స్